Suryaa.co.in

Telangana

రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారు

– వరి వేయండని రెచ్చగొట్టి, పక్కకు తప్పుకున్న బీజేపీ నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి
– తెలంగాణకు కేసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
– రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి
– క్వింటాలుకు 1960 రూ.తీసుకొని లాభంతో సంతోషంగా వెళ్ళాలని కాంక్షిస్తున్న
– మంచి ధాన్యంలో కిలో తరుగు తీసిన రైస్ మిల్లులు సీజ్ చేస్తాం
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్: కేంద్రం తన బాధ్యత విస్మరించినా…రైతుకు నష్టం కాకూడదని రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం సేకరణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వరి ధాన్యం సేకరణ పై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని విమర్శించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ముందే పసిగట్టిన కేసీఆర్ వరి తక్కువ వేయమని చెప్పారని గుర్తు చేసారు. తెలంగాణ రైతులను వరి వేయమని, కేంద్రంతో కొనిపిస్తామని..రెచ్చగొట్టిన బీజేపీ బండి సంజయ్,కిషన్ రెడ్డి ఇప్పుడు పక్కకు తప్పుకున్నారని దుయ్యబట్టారు.యాసంగి ధాన్యం నూక శాతం వల్ల కలిగే నష్ట భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారన్నారు.

వరి వేయండని రెచ్చగొట్టి తప్పించుకున్న బీజేపీ నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్దం చేసుకోవాలని కోరారు. ఏడాదికి 12 వేల కోట్లు వ్యవసాయ కరెంట్ సబ్సిడీ,15 వేల కోట్ల రైతు బంధు, పుష్కలంగా సాగునీరు కెసిఆర్ అందిస్తున్నారన్నారు. ఉద్యమమైన,రాష్ట్ర అభివృద్ధి లోనైనా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏ సందర్భంలోనైనా కేసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు.

కొనుగోలు కేంద్రాలకు రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.మద్దతు ధర క్వింటాలుకు 1960 రూ.తీసుకొని లాభంతో సంతోషంగా వెళ్ళాలని కాంక్షిస్తున్నట్లు తెలిపారు.మంచి ధాన్యంలో తరుగుతీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే రైస్ మిల్లులు సీజ్ చేస్తామని మిల్లర్లను హెచ్చరించారు.

ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్,డిసివో సింహాచలం,పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,రైతుబందు సమితి ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE