– కులగణన మోదీకి మరణశాసనం
– వర్గీకరణ మోదీకి గుదిబండ
– మే 1 నుంచి జూన్ 2 వరకు నేనూ జనంలో ఉంటా
– మీరూ రేపటి నుంచి జనంలో ఉండాలి
– బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం
– భూ భారతిని రైతులకు చేరవేయాలి
– సన్నబియ్యం పథకం ఒక అద్భుతం
– సన్న బియ్యం మన పథకం..మన పేటెంట్, మన బ్రాండ్
– సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం
-హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు,ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యేలు,ఎంపీలు
హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం.
భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం.
విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం.ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది.
ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరి,బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది. కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది.
దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి.సన్న బియ్యం మన పథకం..మన పేటెంట్,మన బ్రాండ్.