– పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు
– సర్కారుపై వ్యతిరేక ప్రచారం పెరిగింది
– సోషల్‌మీడియా వాడరా?
– పార్టీకి ఇబ్బంది కలిగిస్తే మీకే నష్టం
– హైదరాబాద్‌లోనే ఉంటే ఎలా?
– సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు
హైదరాబాద్: పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ నోవాటెల్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని అన్నారు. మీరు మాట్లాడేదంతా రికార్డవుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ సోషల్‌మీడియా వాడటం లేదని అన్నారు. ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే.. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని అన్నారు. వీకెండ్ రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు .
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రచ్చ చేస్తే, పదేళ్లు పార్టీని కాపాడుకున్న మమ్మల్ని కాదని.. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌సాగర్ రావు పరోక్షంగా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు.
ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంపై.. సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. మంత్రి పదవులను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు.