మీపై, మీ కుటుంబ సభ్యులపై సినిమా తీస్తే ఊరుకుంటారా ముఖ్యమంత్రి గారూ?

` మీ ఇంటి మహిళలను కించపరిస్తే మీరు సమర్ధిస్తారా?
` కల్పిత పాత్రలు పెట్టి వ్యక్తులను కించపర్చడమే మీ ధ్యేయమా?
` అధికారం కోసం ఆత్మాభిమానాలపై దెబ్బకొట్టే ‘వ్యూహం’ మీ అత్యంత నీచమైన వ్యూహం కాదా?
` ఆరోగ్యకరమైన రాజకీయాలపై వేటు వేసి, కక్షపూరిత రాజకీయాలే మీకు ఇష్టమా?
` కుటుంబ విలువలు తెలియని ఒక నీచుడి కడుపు నింపడానికి ఇంతటి నీచ సంస్కృతి ప్రోత్సహిస్తారా?
` ముఖ్యమంత్రిగా మహానుభావుల జాబితాలో చేరి వారి పరువును తీయడం సబబా?
` ‘వ్యూహం’ పై ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

సమాజంలో నానాటికీ కనుమరుగవుతున్న ఆరోగ్యకరమైన రాజకీయాలను బ్రతికించాలని, స్వచ్ఛమైన రాజకీయాలను అనుసరించాలని, వ్యక్తులను, వ్యక్తిత్వాలను, మహిళలను కించపరిచే విధంగా కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరుతూ… సామాజిక బాధ్యతతో వర్ల రామయ్య అను నేను ముఖ్యమంత్రి అయిన మీకు ఈ బహిరంగ లేఖ వ్రాస్తున్నా…
ఆర్యా !
మీ తండ్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు ఉమ్మడి రాష్ట్రంలో సాంప్రదాయ విధానాలతో, రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో, ప్రత్యర్థులపై ఆరోగ్యకరమైన రాజకీయాలు చేశారు. ఆయన రాజకీయ వారసులైన మీరు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తండ్రి ఆశయాలను నిలబెడతానని చెప్పిన మీ మాటలకు, మీరు అనుసరిస్తున్న విధానాలకు పొంతన కనబడడం లేదు. మీ పార్టీలోని కొంతమంది స్వార్ధపూరిత వ్యక్తులు, రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడం కోసం, మీ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై బూతుల పంచాంగాన్ని ప్రయోగిస్తూ రాష్ట్ర రాజకీయాలను అతి నీచమైన బాటలోకి తీసుకొచ్చారు. మీరు ఇలాంటి వారి విధానాలను ఖండిరచకపోగా, వారిని ప్రోత్సహించారు.

వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే, మీ ప్రోత్సాహంతోనే వాళ్లు ఇలా పేట్రేగిపోతున్నారని నిర్ధారణ అయింది. ప్రతిపక్ష నాయకుడిని మీ అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించకుండా ఉండేందుకు మానసికంగా క్రుంగదీయాలనే దుర్భుద్ధితో మీ పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుడి ఇంటిలోని మహిళలను సైతం శాసనసభ సాక్షిగా కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా మీరు మౌనం వీడలేదు. అంటే, మీకు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే సదుద్దేశం లేదు. మీకు మీ అధికారాన్ని నిలబెట్టుకోవడం తప్ప వేరే లక్ష్యాలేవీ లేవని నేను భావిస్తున్నాను.

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘వ్యూహం’ అనే సినిమా గురించి రకరకాల చర్చలు పుంఖానుపుంకాలుగా కొనసాగుతున్నాయి. ఈ ‘వ్యూహం’ అనే సినిమా ప్రత్యేకంగా ఏపీలోని ప్రతిపక్ష నాయకుడిని, ఆయన కుటుంబ సభ్యులను, ఆయన పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. ప్రతిపక్షాలను మానసికంగా కృంగదీసి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? ఇదే మీ అభిమతమా? రాజకీయ వ్యూహమంటే ప్రతిపక్షాలను కించపరిచే సినిమాల ద్వారా వారి ఆత్మగౌరవాలపై దెబ్బకొట్టడమేనా? మీ రాజకీయ వ్యూహాన్ని తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా.. సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు కొన్ని విషయాలను గుర్తుచేయాలనేదే నా ఉద్దేశ్యం.

‘వ్యూహం’ సినిమాలో ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మేము కూడా వేరొక సినిమా తీసి మీపై, మీ కుటుంబ సభ్యులపై(మహిళలతో సహా), మీ పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలు, వారి ఇళ్లలోని మహిళలపై విభిన్న పాత్రలను కల్పించి కించపరిస్తే మీరు సమర్థిస్తారా?

2019 ఎన్నికల ముందు మీ కుటుంబంలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన విషయాలపై ఇప్పటి వరకు సమాజానికి తెలిసిన, తెలియని విషయాలపై కొన్ని పాత్రలు రూపొందించి సినిమా తీస్తే మీరు నవ్వుతూ ఆ సినిమాను స్వాగతిస్తారా? మీరు కొన్ని కేసుల్లో అరెస్టయి జైలు జీవితం గడిపిన విధానాలను సైతం సినిమాల్లో వేర్వేరు పాత్రలు రూపొందించి మీ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టేలా మేం సినిమాలు తీస్తే మీరు ఆనందంగా స్వాగతిస్తారా? మీ తమ్ముడు అవినాష్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడానికి వస్తే కర్నూలు ఆసుపత్రిలోకి వారిని వెళ్లకుండా అడ్డుకున్న వైనాన్ని సైతం సినిమాగా తీసి చూపిస్తే మీరు అంగీకరిస్తారా? మీ తల్లి, చెల్లి మీ ఇంటిని, మిమ్మల్ని వదలి ఎందుకు వెళ్లిపోయారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యేలా కల్పిత పాత్రలతో సినిమాలు తీస్తే మీరు, మీ పార్టీ శ్రేణులు స్వాగతిస్తారా?

కుటుంబం, కుటుంబ విలువలు, బంధాలు-అనుబంధాలు అంటే తెలియని ఓ పనికిమాలిన వ్యక్తి జేబులు నింపడానికి మీరు ఇంతలా కృషి చేయడం సబబా? ఇదే వ్యక్తి రానున్న రోజుల్లో మీపై ఇటువంటి సినిమాలు తీస్తే మీరు అతన్ని ప్రశంసిస్తారా? అభినందిస్తారా? వెనకుండి ప్రోత్సహిస్తారా?… టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత నాయకులు ముఖ్యమంత్రిగా చేసిన ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి జాబితాలో చేరిన మీరు, ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చేలా ప్రవర్తించడం సరైనదేనా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? మీరు ఎంచుకున్న వ్యూహం బెడిసికొట్టి మీ ఇంటిపైకి వస్తే మీ పరిస్థితి ఏమిటి?

సమాజంలో తలెత్తుకు తిరగగలరా? ప్రజాక్షేత్రంలో మీ గౌరవ, మర్యాదలు నిలబడతాయని మీరు భావిస్తున్నారా? అధికారం నిలబెట్టుకోవాలంటే ప్రజలకు మంచి ఎలా చేయాలో ఆలోచించాలి. అంతేగాని, ప్రతిపక్ష నేతల ఆత్మాభిమానాలను కించపరిచేలా సినిమాలు తీసి రాక్షసానందం పొందాలనే మీ వ్యూహం ఎప్పటికైనా మీ ఇంటి తలుపులు తడుతుందని మీరు మర్చిపోవద్దు. ఓటమి భయంతో కొట్టుమిట్టాడుతూ ఉచ్ఛనీచాలు తెలియని వ్యక్తితో చేయికలిపి ఇటువంటి అసాంప్రదాయ సినిమాలకు ‘సై’ అనడం మీ ఓటమిపై మీరే సంతకం చేసినట్లు.

సమాజ శ్రేయస్సు కోరే వాడిగా, మీకంటే వయస్సులో పెద్దవాడిగా, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిగా మీ అసంబద్ధ వ్యూహాన్ని ఉపసంహరించుకోవాలని హితవు పలుకుతున్నాను. మీరు ఎంచుకున్న ‘వ్యూహం’ నదిలో మునిగిపోతున్నవాడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా తాపత్రయపడతాడో అలా ఉందని మీకు తెలియజేస్తున్నాను.

మీ నుండి సమాధానం ఆశిస్తూ…
(వర్ల రామయ్య)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మరియు పొలిట్‌ బ్యూరో సభ్యులు

Leave a Reply