ఇకనైనా కుట్రలు, కుతంత్రాలు చేయడం మానండి

– వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తి కానివ్వండి
– వాస్తవాలు బయటకు రానివ్వండి. బాధ్యులకు శిక్ష పడాలి
– కానీ లీక్‌ల పేరుతో రోజూ అసత్య ఆరోపణలు చేయకండి
– ప్రభుత్వంపై బురద చల్లడం మానండి
– ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి వెల్లడి

-రాంసింగ్‌పై కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం?
-ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలు ఇచ్చింది
-ప్రభుత్వాన్ని తప్పు బట్టడం, కోర్టు ఉల్లంఘన కాదా?
-అధికారంలో ఉన్నప్పుడు మీవన్నీ క్రిమినల్‌ ఆలోచనలే
-అన్ని వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేశారు
-మా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గౌరవిస్తోంది
-ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేసిన జి.శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో జి.శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
అదే వారి ఎజెండా:
ఒక ప్రజా పరిపాలన. పేదల సంక్షేమం కోసం, పేదలకు మంచి చేయాలని ప్రభుత్వ అధినేతగా నిరంతరం ఆలోచన చేసే నేత సీఎం వైయస్‌ జగన్‌. మరోవైపు కృష్ణా నది కరకట్ట పక్కన, అక్రమంగా నిర్మించిన ఒక భవనంలో ఉన్న మాజీ సీఎం, ఇప్పుడు అదే భవనం నుంచి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం, నిందించడం అదే వారి ఎజెండా. ఆ దిశలోనే కుట్రలు.

అసత్య ఆరోపణలు:
ఇవాళ వివేకానంద హత్య మీద అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తుంటే, అది పూర్తి కాకముందే రోజుకొక కధనం, లీక్‌లు. ప్రభుత్వంపై నిందలు వేయడం, బురద చల్లడమే లక్ష్యంగా మాట్లాడడం. పనికి మాలిన ఆరోపణలు. వాస్తవానికి ప్రభుత్వం ఆ దర్యాప్తుకు సహకరిస్తోంది. అందుకే వారు తమ పని తాము చేయగలుగుతున్నారు.
కానీ గతంలో అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రంలోకి అసలు సీబీఐని అడుగు పెట్టనివ్వబోమని అన్నారు. కానీ ఇవాళ అదే సంస్థను పొగుడుతున్నారు. ఆ విషయం గుర్తుంచుకోండి.

ప్రభుత్వానికి ఏం సంబంధం?:
సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేయించి, కేసు నమోదు చేయించారని ఇవాళ టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు ఆరోపించారు. ఆ స్థాయికి మీరు దిగజారారు. సీబీఐ అధికారి రాంసింగ్‌పై ప్రభుత్వం కేసు పెట్టిందని మాట్లాడారు. దాంతో ప్రభుత్వానికి ఏం సంబంధం?

గత నెల 27న గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి సీబీఐ అధికారి రాంసింగ్‌పై ఫిర్యాదు చేశారు. అయినా కేసు ఫైల్‌ చేయకపోవడంతో ఈనెల 15న మరో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్య తీసుకోకపోతే,

కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు రాంసింగ్‌పై కేసు నమోదు చేస్తే, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఏదైనా మాట్లాడడానికి బుద్ది, జ్ఞానం ఉండాలి.ఇది కోర్టు ఉల్లంఘన కాదా? కోర్టును అవమానించినట్లు కాదా?

సిగ్గు అనిపించడం లేదా?:
ఒక క్యాబినెట్‌ మంత్రి హఠాన్మరణం చెందితే, ఆయన మృతిపైనా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. అంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు. అందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా?

క్రిమినల్‌ ఆలోచనలు:
వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీ మాదిరిగా నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను చంపించామా? పింగళి దశరథరామ్‌ అనే ఒక విలేకరిని హత్య చేశారు. ఒక ప్రజా నాయకుడిని బ్రతికి ఉండగానే హింసించి చంపారు. మీవి క్రిమినల్‌ ఆలోచనలు. కానీ మీరు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు.

ఆ మరణం మాకే నష్టం:
నిజానికి చనిపోయింది మా నాయకుడి చిన్నాన్న. ఆయన హత్య కేసులో నిందితులను గుర్తించాలని కోరుకుంటున్నాం. ఒక కన్ను ఇంకో కన్నుకు హాని చేయాలని చూడదని సీఎంగారు చాలాసార్లు చెప్పారు. ఆయన మరణం వల్ల నష్టం జరిగింది మాకే. అయినా మీరు ఎందుకు మాపై బురద చల్లుతున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నా ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది.

మీ మాదిరిగా మేము వ్యవహరించం:
మీరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఏం కుట్రలు జరుగుతున్నాయో అని మేము ఆలోచిస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్లు మేమూ చేస్తామని మీరు అనుకుంటున్నారు. మీరు వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. కానీ మేము అన్ని వ్యవస్థలను గౌరవిస్తున్నాం.

వివేకానందరెడ్డి మరణం గురించి ఆయన బావమరిది అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. అవన్నీ రికార్డులో ఉన్నాయి. అయినా మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మేము వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నాం. అంతేకానీ కేసును తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. కానీ మీరు అనుమానాలకు తావునిస్తూ, ఏదేదో జరుగుతుందని రాస్తున్నారు.ఎందుకు ఆరోజు లేఖ సాయంత్రం వరకు బయటకు రాలేదు? ఆరోజు కేసును తప్పుదోవ పట్టించాలని చూసిందెవ్వరు?

మేమూ భయపడుతున్నాం:
దస్తగిరి స్టేట్‌మెంట్‌ అధికారికంగా బయటకు రాలేదు. కానీ దాన్ని మీరు ఎలా రాశారు. ఎలా మాట్లాడారు. ఈ కేసు గురించి మీకు ఎందుకంత భయం? మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మీకు అన్నీ దుర్మార్గమైన ఆలోచనలు వస్తున్నాయి.

సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుంది? ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని మీరు కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. బయట అలా మాట్లాడించి, లోపల ఏం చేస్తారో అన్న భయం మాకు కలుగుతుంది.

అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు?:
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, ఫ్రస్టేషన్‌లో ఇంతగా దిగజారాలా. అందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా? రోజూ ప్రభుత్వంపై బురద చల్లడమే మీ పనా? అధికారమే కావాలా? అందుకే ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కుట్ర చేస్తున్నారా? వాస్తవాలు మాట్లాడండి. మేము లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వండి.

ఇకనైనా మానండి:
ఉదయ్‌కుమార్‌రెడ్డి ఏం ఫిర్యాదు చేశారో? తెలుసుకోండి. కానీ అవన్నీ పక్కనపెట్టి లీక్‌ల పేరుతో రోజుకో కధనం రాయడం మానుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం మంచి చేస్తుంటే తట్టుకోలేరు. ఉద్యోగులు ఆందోళనకు దిగితే వారిని రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. సినీ పరిశ్రమ ప్రతినిధులు కలిస్తే, దానిపైనా దుష్ప్రచారం చేసి రెచ్చగొట్టాలని చూశారు.
మీకు ఎంతసేపూ అరాచకాలు కావాలి. ప్రభుత్వంపై నిందలు వేయాలి. ఈ ప్రభుత్వం వ్యవస్థను గౌరవిస్తుంది. దర్యాప్తులో వచ్చే ఆరోపణలకు సమాధానం ఇస్తుంది.

నిజాలు బయటకు రానివ్వండి:
ఈ కేసులో అవినాష్‌రెడ్డిగారి ప్రమేయం ఉందని ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా?. ఆయనపై ఆరోపణలు చేసిన వ్యక్తి డబ్బులకు ఆశ పడతారని కూడా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు నిజాలు బయటకు రావాలి కదా. ఆ లోగానే ఎందుకీ విమర్శలు. ఆరోపణలు.

రాజకీయాల్లో ఒక నమూనాగా, ఆదర్శంగా ఉండాలి. అంతేకానీ రోజూ కుట్రలు, కుతంత్రాలు చేయడం కాదు.
మేము సీబీఐ వారిని కూడా అడుగుతున్నాం. ఎందుకు ఈ లీక్‌లు వస్తున్నాయి. నిజానికి వివేకానందరెడ్డి హత్య జరిగింది టీడీపీ హయాంలో. ఆనాడు ఏం కుట్ర జరిగిందో తెలియాలి. కాబట్టి ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలి. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు.

ఆనాడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయన పార్టీ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి, వాస్తవాలు బయటకు రావాలని, దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని కోరుకుంటున్నాం.

Leave a Reply