– పత్రి ఒక్కరిలో స్వచ్ఛతపై అవగాహన కలిగించాలి
– నూజివీడు మండలం తుక్కులూరులోసామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పార్ధసారధి..
ఏలూరు/నూజివీడు: పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శనివారం నూజివీడు మండలం తుక్కులూరులో నిర్వహించిన స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుక్కులూరు కూడల్లో మానవహారంగా ఏర్పాడి అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ ను రాష్ట్ర మంత్రి పార్ధసారధి చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత శుభ్రత ప్రజల జీవన విధానం కావాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛ దివాస్ ప్రతినెలా 3వ శనివారం క్రమం తప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరి సహకారం, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. గతంలో గ్రామాల్లో చాలా పరిశుభ్రమైన గాలి, వాతావరణం ఉండేవని, క్రమేపి జనాభా పెరుగదల కారణంగా చెత్తపెరిగి ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగిస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు.
మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు రోడ్లపై, ముఖ్యకూడళ్లలో చెత్తవేయకుండా నియంత్రించడంలోకూడా ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛసేవకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా పారిశుధ్య నిర్వహణపై మున్సిపాలిటీ, పంచాయితీల్లో ప్రజలు తెలియజేసే సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచే తొమ్మండ్రు బుజ్జి, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఎల్ పివో ఎంపిఎల్ సుందరి, డిఎల్ డివో వెంకట్రావు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.