• చెత్త నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
– స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ: పరిశుభ్రత అనేది మన జీవన విధానంగా మారాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ పొంగూరు నారాయణ అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం అత్యంత వేడుకగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర ను సాధించగలమని సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారని, ఆ దిశగానే ముందుకు సాగుతున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు లక్ష్యానకంటే 15 రోజుల ముందే క్లియర్ చేయగలిగామన్నారు.
పట్టణాల్లో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ను ఏ రోజు కు ఆ రోజూ క్లియర్ చేయాలని కోరుకుంటారన్నారు. ఆ తరువాత చక్కటి రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఇలా ప్రాధాన్యక్రమం ఉంటుందన్నారు. కాని గత ప్రభుత్వం సాలిడ్, లిక్విడ్ వేస్ట్ ను తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నది వాస్తవమన్నారు. కాని కూటమి ప్రభుత్వం మాత్రం స్వచ్ఛాంధ్ర కు కృషి చేస్తుందన్నారు. 2021లోనే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ లో భాగంగా రూ. 3187 కోట్లు శాంక్షన్ చేసి మొదటి ఇన్ స్టాల్ మెంట్ ఇస్తే వాటికి గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా రాష్ట్రం ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు.
అమృత్ 2.0 పథకంలో భాగంగా కేంద్రం రూ. 9514 కోట్లు శాంక్షన్ చేసి మొదటి ఇన్ స్టాల్ మెంట్ ను కూడా ఇదే విధంగా గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. 2019 ఫిబ్రవరిలో రూ. 5350 కోట్లతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ కాలగడువు పెంచమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి సాధించారన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా నిలవాలన్న తలంపుతో సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారన్నారు. దీని ఫలితమే జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ లో 5 ప్రతిష్టాత్మక అవార్డులను గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణమన్నారు. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1257 అవార్డులు వివిధ క్యాటగరిల్లో ఈ వేధికపై ప్రధానం చేయనున్నామన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ప్రతి నెలా ఒక రోజూ పూర్తిగా స్వచ్ఛత ఉద్యమానికి కేటాయించడం అభినందనీయమన్నారు. దీని ఫలితమే స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఇప్పటి వరకు 1.5 కోట్ల మంది పాల్గొన్నారని అన్నారు. విజన్ 2047 లో కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకు స్థానం కల్పించడం ఈ కార్యక్రమ ప్రాధాన్యత అవగతమవుతుందన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు సర్క్యూలర్ ఎకానమి పాలసీని కూడా తీసుకురావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వమని విమర్శించారు. గత ప్రభుత్వం 85లక్షల టన్నుల చెత్తను వదిలివేసిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 2 వ తారీఖు నాటికి క్లియర్ చేయాలన్న ఆదేశాలతో గౌరవ మంత్రి నారాయణ అహర్నిశలు కష్టపడి పనిచేసి చెత్తను క్లియర్ చేయించగలిగారన్నారు. మన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాలతో డంప్ యార్డ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో అందరం నిరంతరం పనిచేస్తున్నారన్నారు.
కొత్తగా సమకూరే చెత్త సైతం పేరుకుపోకుండా ఎక్కడికక్కడ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 70 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లకు టెండర్లు పిలవటం కూడా జరిగిందన్నారు. రాష్ట్రంలో గుంటూరు, వైజాగ్ లలో ఉన్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల తో పాటు మరో 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయనున్నాము. అలాగే రీసైక్లింగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ మన రాష్ట్ర సెక్రటేరియట్ అని గర్వంగా చెప్పారు. అతి త్వరలో ఎలక్ట్రిక్ కాంప్రాక్టర్ లను తీసుకురానున్నామన్నారు. అలాగే 1600 ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కొనుగోలు చేయనున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఐటీసీ కంపెనీతో ఒప్పందం చేసుకుని 8వేల పాఠశాలల్లో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో 8814 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించడం జరిగిందన్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడానికి ఇది మొదటి అడుగు అని అన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ అందరినీ ప్రేరేపించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వచ్చాంధ్ర మిషన్ ను ముందుకు తీసుకువెళుతున్నామన్నారు.
ముఖ్యమంత్రి అపార అనుభవం, దార్శనికతలో వినూత్న ఆలోచనలతో స్వచ్ఛాంధ్ర దిశగా సాగుతున్నామన్నారు. ప్రతి నెలా మూడోవ శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో లక్షలాది మంది స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర నిర్వహించడం గర్వనీయమన్నారు. దేశంలో మొదటి సారిగా రాష్ట్రస్థాయిలోనే కాకుండా గ్రామస్థాయిలో అవార్డ్స్ అందించడం అభినందనీయమన్నారు. చెత్త నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.
అనంతరం రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించటంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, రైతు
బజార్లు, బస్ స్టేషన్లు, పరిశ్రమలకు అవార్డులను సీఎం చేతుల మీదుగా అందచేశారు.
మొత్తం 21 కేటగిరీల్లో రాష్ట్రస్థాయిలో 69 అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలో 1,257 అవార్డులను అందచేశారు. కార్యక్రమంలో గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, ఎన్టీయార్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ శాఖ అధికారులు, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.