– కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో మంత్రి సవిత
విజయవాడ : రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల(ఎంజేపీ స్కూళ్లు) అభివృద్ధికి సహకరించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రి డాక్టర్ రాందాస్ అథవాలేను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కోరారు.
రాష్ట్రంలో డి.ఎన్.టి. కులాల లబ్ధిదారులు వివిధ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వాటికి కూడా పరిష్కారం చూపాలని కోరారు. విజయవాడలోని ఓ హోటల్లో కేంద్రమంత్రి డాక్టర్ రాందాస్ అథవాలేను మంత్రి సవిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఎంజేపీ స్కూళ్ల అభివృద్ధికి రూ.66 కోట్లు మంజూరు చేయాలని కోరారు. స్వయం ఉపాధి కోసం డి.ఎన్.టి కులాల లబ్ధిదారులు 3,700లకు పైగా దరఖాస్తులు చేసుకున్నారని, వాటికి కూడా పరిష్కారం చూపాలని కోరారు.
ఈ రెండింటితో పాటు పలు వినతులను కేంద్రమంత్రికి అందజేశారు. మంత్రి సవిత వినతులపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి సవిత వెంట రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు.