మూసివేత జ‌ర్న‌లిజం

ఆంధ్ర‌భూమి కాలంలో క‌లిసిపోయింది. ప‌త్రిక‌ల మూత కొత్త‌కాదు, అయితే ఉద్యోగుల జీత‌భ‌త్యాలు సెటిల్ చేసి మ‌రీ మూత వేయ‌డం కొత్త‌. గ‌తంలో ఉద‌యం, ఆంధ్ర‌జ్యోతి ఈ ప‌ని చేయ‌లేదు. ఉద‌యం ఉద్యోగులు క‌ష్టాల ప‌డుతుంటే బాధ‌గా అనిపించేది. తొంద‌ర‌లోనే మాకూ అదే గ‌తి ప‌ట్టింది. 96 వ‌ర‌కూ ఒక‌టో తేదీ జీత‌మిచ్చిన ఆంధ్ర‌జ్యోతి ఆ త‌ర్వాత ఏదో ఒక‌రోజు జీత‌మిచ్చింది. కాల‌క్ర‌మేణా ఏదో ఒక నెల జీత‌మొచ్చేది. అది కూడా బ‌రువై మూసేసింది. అప్ప‌టి బ‌కాయిలు (జీతం కాదు, అది ఎగ్గొట్టారు. గ్రాట్యుటీ) 2007లో అంటే ఏడేళ్ల త‌రువాత పాత మేనేజ్‌మెంట్ అందించింది. అదే ప‌దివేలు.

ఆంధ్ర‌ప్ర‌భ ఒక‌ప్పుడు వెలిగింది. చాలా వూళ్ల‌కి మిట్ట మ‌ధ్యాహ్నం వ‌చ్చేది. కొన్ని వూళ్ల‌కి మ‌రుస‌టి రోజు కూడా వ‌చ్చేది. అయినా చ‌దివేవాళ్లు. జై ఆంధ్రాలో సుష్టుగా తిని నిరాహార దీక్ష చేసాను. ఆ ఫొటో ప‌ది రోజుల త‌రువాత ఇంకు ముఖాల‌తో వ‌చ్చింది. అదే సంబ‌రం.

ఆంధ్ర‌ప్ర‌భ ఇంట‌ర్వ్యూకి వెళితే వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి పోయింది. అది అదృష్టం. ఆంధ్ర‌భూమి టెస్ట్ విజ‌య‌వాడ‌కి వెళ్లి రాస్తే రాలేదు. చివ‌రికి జ్యోతిలో సెటిల‌య్యాను. పోటీ ప‌డ‌లేని ముస‌లిత‌నంతో ఆంధ్ర‌ప్ర‌భ మ‌ర‌ణించింది. ఇపుడు వున్నా అది లేన‌ట్టే. ఆంధ్ర‌ప‌త్రిక కూడా ఒక‌ప్పుడు బాగానే బ‌తికింది. భార‌తి ప‌త్రిక చిన్న న‌వ‌ల‌ల పోటీ పెడితే నా న‌వ‌ల‌ను ప్ర‌చుర‌ణ‌కి స్వీక‌రించారు. భార‌తి మూసేసారు. త‌రువాత చాలా ఏళ్ల‌కు ఆంధ్ర‌ప‌త్రిక‌లో డైలీ సీరియ‌ల్‌గా వేసారు. అదీ ఎవ‌రో చెబితే తెలిసింది. తిరుప‌తి అంతా వెతికాను. గోవింద‌రాజ‌సామి గుడి పూజారి ఆంధ్ర‌ప‌త్రిక తెప్పిస్తాడ‌ని తెలిసింది. ఆయ‌న కూడా గంట‌ల పంచాంగం కోసం తెప్పిస్తాడ‌ట‌. వెతికి ప‌ట్టుకుంటే ప‌త్రిక ఏజెంట్ అడ్ర‌స్ చెప్పాడు. రాగిమానువీధిలో చ‌చ్చీ చెడి వెళితే ఒక టీవీ మెకానిక్ త‌గిలాడు. ఆయ‌నే ఏజెంట్. ప‌త్రిక కోసం వెతుక్కుంటూ వ‌చ్చిన న‌న్ను చూసి జాలిప‌డి, దిగులుతో చూసి ఇంటి అడ్ర‌స్ చెప్పాడు.

ఇంటికెళితే వాళ్లావిడ న‌న్ను పాత పేప‌ర్లు కొనేవాడు అనుకుంది. పేప‌ర్‌లో ప‌నిచేసే వాడ‌ని చెప్పాను. వెతికి వారం రోజుల ప‌త్రిక‌లిచ్చి, డ‌బ్బులు తీసుకుంది. పేప‌ర్ ప‌ని మానుకోమంటే మా ఆయ‌న విన‌డు అని తిట్టింది. న‌వ‌ల‌కి రెమ్యూన‌రేష‌న్ పంపుతార‌ని ఆశ‌ప‌డ్డా. నేను 1984లో క‌థ రాస్తే ఆంధ్ర ప‌త్రిక 116 రూపాయ‌ల చెక్ పంపింది. అపుడు మా ఇంటి రెంట్ అది. న‌వ‌ల కాబ‌ట్టి 1989లో వెయ్యి రూపాయ‌లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసా. పైసా కూడా రాలేదు. ఒక‌సారి విజ‌య‌వాడ‌లో ప‌త్రిక ఆఫీస్ వెతుక్కుంటూ వెళితే జ‌నాలు లేని స‌త్రంలా వుంది. ఒక క్ల‌ర్క్ అమ్మాయి ద‌గ్గ‌రికెళ్లి విష‌యం చెబితే జీతాలే ఇవ్వ‌డం లేదు, ఇక మీకేం ఇస్తారు, తిరుప‌తి హుండీలో వేసాన‌ని అనుకోండి అని హిత‌వు చెప్పింది. ప‌త్రిక చివ‌రి రోజుల‌వి.

ఇక ఉద‌యం, రావ‌డం ఒక అద్భుతం. నిష్క్ర‌మ‌ణ ఒక విషాదం. ఇలాంటి ప‌త్రిక‌లో ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకుని ప్రూప్ రీడ‌ర్ టెస్ట్ రాసాను. పాస్ అన్నారు. కానీ హైద‌రాబాద్ లోక‌ల్స్‌కే ఇస్తామ‌న్నారు. జాబ్ ఇస్తే నేనూ లోక‌లే అన్నా. ఇవ్వ‌మ‌న్నారు. ఇదీ అదృష్ట‌మే. ఉద‌యం చివ‌రి రోజుల్లో ఎంత గంద‌ర‌గోళం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు ట్రాన్స్‌ఫ‌ర్‌లు, వేధింపులు.

వార్త‌, ఏదో పొడిచేస్తుంద‌ని వ‌చ్చి, త‌న‌ను తాను పొడుచుకుంది. చాలా తొంద‌ర‌గా భ్ర‌ష్టు ప‌ట్టిన ప‌త్రిక ఇది. ఉద్యోగుల జీతాల్లో క‌ట్ చేసిన పీఎఫ్‌ని కూడా జ‌మ చేయ‌ని నీచ‌త్వం. ఇపుడు వార్త బ‌తికే వుంది, కానీ కోమాలో.

విజేత అని ఒక ప‌త్రిక వ‌చ్చింది. అది ఎందుకొచ్చిందో, ఎపుడు మూత‌ప‌డిందో కూడా తెలియ‌దు. జ‌ర్న‌లిజం మెల్లిగా చ‌చ్చిపోతున్న ప్రొఫెష‌న్‌. ఈ మ‌ధ్య ఒక డెంటిస్ట్ క‌లిసాడు. నెల‌కి 5 ల‌క్ష‌ల ఆదాయం. నాకు జ‌ర్న‌లిస్ట్ కావాల‌ని కోరికుండేది అన్నాడు. జ‌ర్న‌లిస్ట్‌గా 5 ల‌క్ష‌లు తీసుకోవాలంటే ప‌త్రిక ఎడిట‌ర్‌, ఎండీకి కూడా సాధ్యం కాద‌ని చెప్పాను.

జ‌ర్న‌లిస్ట్‌గా ఎంత క‌ష్ట‌ప‌డి ప‌నిచేసినా డ‌బ్బులు రావు. జ‌ర్న‌లిస్ట్ పేరుతో వేరే ప‌నులు చేస్తే వ‌స్తాయి. ఇపుడు ఆ ప‌నిని కూడా యాజ‌మాన్యాలే చేసేస్తున్నాయి. హోల్‌సేల్‌గా , రిటైల్‌గా వాళ్ల ప‌త్రిక‌ని వాళ్లే అమ్మేసుకుంటున్నారు.

-G.R Maharshi

Leave a Reply