– కాంట్రాక్టుల కోసం డిపార్టుమెంట్లే రద్దు చేస్తున్నారు
– ఇది మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు.. దండుపాళ్యం ముఠా లెక్క ఉంది
– క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి.. మంత్రుల పంచాయతీ పెట్టుకున్నరు
– హ్యాం మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు టాక్స్ లు పెంచిండు
– ప్రభుత్వం రాగానే హ్యాం మోడల్ పై విచారణ జరిపిస్తం
– ఇంత జరుగుతుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది?
– అసలు ఏం చేసావని విజయోత్సవాలు?
– తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ప్రజలకు సంబంధించిన అంశాల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారు అనుకున్నం. దసరాకు మొండి చేయి చూపారు, దీపావళి కానుకగా ప్రజలకు ఏదైనా తీపి వార్త చెబుతారేమో అనుకున్నం. కానీ తీవ్ర నిరాశే మిగిలింది.
రైతులకు బోనస్ పేరిట ఇచ్చే 1300 కోట్ల బకాయిలైనా ఇస్తరేమో అనుకున్నం.. మహిళలకు 2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తరేమో అనుకున్నం.. పింఛన్లు అయినా పెంచుతరేమో అని అనుకున్నం..కానీ జరిగింది ఏం లేదు, అందరికీ నిరాశే మిగిలింది.. ఏది లేదు.
క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి, మంత్రుల పంచాయతీ పెట్టుకున్నరు. క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఒకటి కాదు, రెండు కాదు అరడజను వర్గాలుగా చీలిపోయారు. ఒకరంటే ఒకరికి పడతలేదు.. సీఎం, మంత్రులు.. పాలన గాలికి వదిలి పర్సనల్ పంచాయతీలు పెట్టుకుంటున్నరు.
కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, కబ్జాల కోసం, పోస్టింగుల కోసం. ఇది మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు.. దండుపాళ్యం ముఠా లెక్క ఉంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే అధ్వాన్నం. ప్రతి దాంట్లో కొట్లాటలే.. ఆ మంత్రి ఈ మంత్రిని తిట్టుడు, ఈ మంత్రి ఆ మంత్రి తిట్టుడు ఇదే సరిపోయింది.. అతుకుల బొంతగా ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతదో అని స్వయంగా మంత్రులే భయపడుతున్నారు..
దీపం ఉండంగనే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో అధికారంలో ఉన్నపుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నరు.. కేసీఆర్ ఉద్యోగాల్లో 95శాతం లోకల్ రిజర్వేషన్ సాధించారు. . నీళ్లలో వాటా కోసం కొట్లాడారు. నిధుల వాటా కోసం కొట్లాడారు.. నేడు కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, అక్రమ వసూళ్లలో వాటా కోసం మంత్రులు కొట్లాడుతున్నరు. కాంట్రాక్టుల కోసం డిపార్టుమెంట్లే రద్దు చేస్తున్నారు..
పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నరు.. కాంగ్రెస్ తప్పిదాల వల్ల టీఎస్ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిది ఏండ్లలో అతి తక్కువ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్లు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చింది. 2024-25లో కేవలం 2049 పరిశ్రమలు, 50వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. . ఎవర్ లోయేస్ట్ ఇన్వెస్ట్మెంట్ టీఎస్ఐపాస్ ఏర్పడ్డ తర్వాత.ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ ఘన కార్యం.
బిఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ఐపాస్ తెచ్చి , అనుమతులు సులభతరం చేసాం. పెట్టుబడులకు స్వర్గధామంగా రాష్ట్రాన్ని మార్చాం.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసాం.. కానీ ఇప్పుడు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నరు.. రేవంత్ రెడ్డి గన్ కల్చర్ తెచ్చిండు. అక్రమ వసూల్లకు పాల్పడుతున్నారు.. టెక్ మహీంద్ర సీఈఓకు నాడు కేటీఆర్ వర్షంలో గొడుగు పట్టి ఆహ్వానించారు. పెట్టుబడులు రావాలని కృష్టి చేసింది బిఆర్ఎస్..
ఒక మంత్రి కుమార్తెనే స్పష్టంగా చెబుతున్నారు.. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పట్టి బెదిరించారు అని.. ముఖ్యమంత్రి జపాన్ నుంచి ఫైల్ ఆపించారు, ఇంకో మంత్రి టెండర్లు మాకు దక్కవద్దని హుకుం జారీ చేసారు అని.. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నది.. ఇంత జరుగుతుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది?. ముఖ్యమంత్రే తుపాకీ పంపారు అంటే ఎందుకు విచారణ జరపరు?
బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం కాకుంటే, మీది బడే భాయ్ చోటే బాయ్ సంబంధం లేదు అంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంజయ్ స్పందించండి.
కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపండి.. లేదా ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టి నిజానిజాలు బయటకు తీయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లే. ..
ఈ పాటి దానికి డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు చేస్తరట.. ఎందుకు తుపాకీలు పెట్టి వసూళ్లు చేసామని, మంత్రులు మంత్రులు కొట్టుకుంటున్నందుకా? దేని కోసం విజయోత్సవాలు? 23 నెలల పాలనలో ఏం చేసారు, ఏం సాధించారు? ఒక్క ఇళ్లు కట్టింది లేదు, ఒక్క ఇటుక పేర్చింది లేదు.. ఒక్క చెక్ డ్యాం కట్టింది లేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చింది లేదు.. టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేసింది లేదు.
ఉన్న పథకాలను ఊడగొట్టారు. ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వలేదని జరుపుతారా?
కేసీఆర్ కిట్ బంద్ చేసారని జరుపుతారా? గొర్రెల స్కీం బంద్ పెట్టినమని జరుపుతారా? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఆగం చేశారు. ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు, 420 హామీల అమలు ఊసు లేదు.అయినా విజయోత్సవాలు చేస్తమని చెప్పుకోవడానికి సిగ్గు లేదు..
అసలు ఏం చేసావని విజయోత్సవాలు? రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా?
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా?
1300 కోట్ల బోనస్ డబ్బులు ఇప్పటికీ రైతులకు చెల్లించినందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా? లగ చర్ల, రాజోలి రైతుల చేతుల చేతులకు బీడీలు వేసినందుకా? మొదటి ఏడాడిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని యువతను మోసం చేసినందుకా? నిరుద్యోగ భృతి ఎగ్గొడుతున్నందుకా?
మహాలక్ష్మి పేరిట నెలకు 2500 ఇస్తానని, ఇప్పటికీ అమలు చేయనందుకా? ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకా? అవ్వాతాతలకు పించన్లు పెంచనందుకా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకా? మూసీ సుందరీకరణ పేరుతో కమీషన్లు దండుకుంటున్నందుకా? ఎందుకు విజయోత్సవాలు చేస్తా అంటున్నవు రేవంత్ రెడ్డి? ఇంకెంత కాలం మోసం చేస్తారు, ఇంకెంత కాలం మభ్యపెడుతరు. 22 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెట్టినవు.
ఎందుకోసం ఉత్సవాలు జరుపుతావు.
కొత్తగా హ్యామ్ మోడల్ అంటున్నారు. ఏంటిది ఇది కమీషన్లు దండుకోవడమే లక్ష్యం.
ఇప్పటికే రేవంతు పాలనలో అప్పులు కుప్పగా అయ్యింది రాష్ట్రం. సివిల్ సప్లైలో అప్పులు పేరుకుపోయినవి. ట్రాన్స్ కో డిస్కంలు అప్పుల కుప్పలుగా మార్చారు.. ఎఫ్ఆర్బీఎం అప్పులు గత పదేళ్లలో ఎన్నడూ తేనంత అప్పులు తెచ్చారు.
కాంట్రాక్టర్లకు లబ్ది కోసం, కమీషన్లు దండుకునేందుకు హ్యాం మోడళ్లు పిలిచారు.
10,547 కోట్లతో టెండర్లు పిలిచి, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దండుకునే ప్రయత్నం. మా పాలనలో రోడ్లు వేయలేదా? బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు ప్రతి గ్రామానికి రోడ్డు వేసింది. ప్రతి మండల కేంద్రంకు, జిల్లా హెడ్ క్వార్టర్లకు రోడ్లు వేసింది.
హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇదంతా అంటే.. ఈ డబ్బులతో బ్యాంకులకు పైసలు కడుతం అని నమ్మిస్తున్నరు.
హ్యాం మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు టాక్స్ లు పెంచిండు. టోల్ ద్వారా వసూలు చేయబోమని చెబుతూ మరోవైపు దొంగదారిలో ఈ పన్నులు పెంచిండు. హ్యాం మోడల్ అనేది ఒక బోగస్. దాని పేరు చెప్పి కమీషన్లు దండుకోవడమే తప్ప ప్రభుత్వం చేస్తున్నదేం లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హ్యాం మోడల్ పై విచారణ జరిపిస్తం, దోచుకున్న ప్రతి ఒక్కరిపై రికవరీ పెడుతం.
ఈరోజు రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసింది. ప్రజల సమస్యలు వదిలి మంత్రులే దంచుకుంటున్నారు. మంత్రులు గొడవలు పెట్టుకుంటుంటే సీఎం చోద్యం చూస్తున్నడు. పాలన గాడి తప్పింది. అరాచకత్వం పెరిగింది. క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులు తుపాకీ ముఖ్యమంత్రి ఇచ్చిండు అని చెబుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం
దీనిపై లీగల్ గా ముందుకు వెళ్తాం. ఏ ఏజెన్సీలకు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నాం.పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు భయపడవద్దు. మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది.