– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
– రాంపల్లి రామాలయం ముందు శ్రీ హనుమాన్ విగ్రహం ధ్వంసం
హైదరాబాద్: రాంపల్లి రామాలయం ముందు శ్రీ హనుమాన్ విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.. స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకు న్నారు. పరిస్థితిని పరిశీలించిన ఆయన, ఇది కేవలం విగ్రహం దాడి కాకుండా హిందువులపై దాడి అని పేర్కొన్నారు.
గతంలో ముత్యాలమ్మ, గణేష్, నవగ్రహ, భూలక్ష్మి, మాతాజీ ఆలయాలపై జరిగిన అనేక దాడులను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
హిందువుల ఆరాధ్య దేవుడు, ధైర్యాన్ని ప్రసాదించే ఆంజనేయ స్వామి విగ్రహంపై దాడి ప్రతి హిందువుపై దాడిగా పరిగణిస్తున్నాం. గతంలో ముత్యాలమ్మ ఆలయం, గణేష్ విగ్రహాలు, శంషాబాద్‌లోని నవగ్రహ ఆలయం, రక్షాపురంలోని భూలక్ష్మి ఆలయం, శివాజీ నగర్‌లోని మాతాజీ ఆలయం వంటి అనేక దేవాలయాలపై దుండగులు దాడులకు పాల్పడ్డారు.
ఈ కేసులలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి, వారిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. బీజేపీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.