◆కాలకేయుడిలా క్యాంపస్ లోకి
◆పోలీస్ లు లేకుండా వస్తే ఆర్ట్స్ కళాశాల ముందు అరగుండే
◆ఉత్త చేతులు..వొట్టి మాటలతో ఓయూలో అభాసుపాలు
◆చరిత్రలో ఓయూ విద్యార్థుల నెత్తురు తాగిందే కాంగ్రెస్ సర్కార్ లు
◆ఎందరో ఓయూ విద్యార్థి నేతలు, అధ్యాపకులకు కీలక పదవులిచ్చిన కేసీఆర్
◆దళిత వర్గాలకు దారి చూపిందే గులాబీ సర్కార్
◆విద్యారంగాన్ని వధిస్తూనే,ఉత్తర కుమార ప్రగల్భాలేలా..?
◆గురుకులాల గొంతు నులిమేందుకే యంగ్ ఇండియా నాటకం
◆డయ్యర్ మనవడు అమ్రృత్ సర్ ను వర్ణించినట్లుగా రేవంత్ ప్రసంగం:
– రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా. ఈడిగ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్: గన్నుల దన్నుతో దండుపాళ్యంలా చొరబడి ఓయూ గడ్డపై గప్పాలు నరికిన సీఎం రేవంత్ రెడ్డి,ఓయూలో అరచేతిలో వైకుంఠం కథ వల్లెవేసివెల్లారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ విమర్శించారు. ఓయూ చుట్టూ ఖాకీ కంచెలు పరిచి, రాత్రి పగలూ గాలించి విద్యార్థి ప్రతినిధులందరినీ నిర్భంధించి క్యాంపస్ లోకి కాలకేయుడిలా రేవంత్ రెడ్డి కాలుమోపారని ఎద్దేవా చేశారు.
సీఎం సోది పర్యటన సందర్భంగా అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ వెంటనే విడుదల చేయాలని సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. హాస్టళ్లు,లైబ్రరీ,కళాశాల చుట్టూ వేలాది మంది పోలీసులను మోహరించి సీఎం రేవంత్ తన పైశాచికత్వాన్ని బయటపెట్టేసుకున్నారు.పైగా డిసెంబర్ లో జూటా జీవోలిచ్చి మల్లొచ్చి మోసం చేసిపోతానని ముఖ్యమంత్రి ప్రకటించాడని ఎద్దేవా చేశారు. రెండు బడ్జెట్ లు, రెండేళ్ళలో రుపాయివ్వని రేవంత్ రెడ్డి సర్కార్, రానున్న రోజుల్లో వరాలు వడ్డిస్తామంటే నమ్మేంత అమాయకులు ఓయూ విద్యార్థులు కారన్నారు.
ఓయూ గణ చరిత్ర గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జనరల్ డయ్యర్ మునిమనువడొచ్చి అమ్రృత్ సర్ అద్భుతాలు వర్ణించినట్లుందన్నారు.చరిత్రలో వివిధ ఓయూ విద్యార్థి ఉద్యమాల ఊపిరి తీసి, వేలాదిమంది విద్యార్థుల నెత్తురు తాగిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలన్నారు.రెండేళ్ళలో రాష్ట్ర విద్యా రంగాన్ని గాలికొదిలి చివరికి గురుకులాల గొంతు నులిమేందుకు యంగ్ ఇండియా స్కూల్ల స్టోరీ వల్లిస్తున్నారన్నారు.
వందమందికి పైగా దళిత,గిరిజన బడుగు వర్గాల విద్యార్థులు గురుకులాల్లో దుర్మరణం చెందితే పట్టించుకున్న నాధుడేలేడన్నారు.బడ్జెట్ లో 12% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని నమ్మించి,5% కూడా కేటాయించకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. ఇక రెండు లక్షల ఉద్యోగాలు, యూత్ డిక్లరేషన్ ల దగా మరువలేని యువత గుండెలు మండుతున్నాయన్నారు.
వాస్తవానికి ఓయూ విద్యార్థిని గ్రేటర్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టడంతో పాటు ఎంపీ, ఎంల్ ఏ,కార్పొరేషన్ ఛైర్మన్ తదితర ఎన్నో కీలకమైన పదవుల్లో ఓయూ విద్యార్థులను కూర్చోబెట్టి కేసీఆర్ ప్రభుత్వం గౌరవించిందన్నారు. ఓయూ వీసీగా బీసీని, కెయు, టియూ, శాతవాహన తదితర వర్శిటీలు,టీఎస్ పీఎస్సీ,హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తదితర ఉన్నత పదవుల్లో దళిత వర్గాలకు చెందిన ప్రొఫెసర్ లను నియమించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గౌరవించిందన్నారు.
ఓయూ విద్యార్థుల మెస్ ఛార్జీల స్కాలర్ షిప్ లు పెంచి,అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడంతో పాటు వందేళ్ల పండుగను అద్భుతంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిందన్నారు.అంతెందుకు ఓయూ భూముల రక్షణకై చుట్టూ ప్రహారీ గోడను నిర్మించిందే కేసీఆర్ ప్రభుత్వమని వివరించారు. వర్శిటీ భూములకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే పెనుముప్పన్న వాస్తవం సెంట్రల్ వర్శిటీ ఉదాంతంతో విశ్వవ్యాప్తమైందన్నారు.
వెయ్యికి పైగా గురుకులాలు,ఇంజనీరింగ్,మెడికల్, నర్సింగ్ ఇలా ఎన్నో నూతన విద్యాసంస్థలు నెలకొల్పి బడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్ కోసం తపించిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదన్నారు.చివరికి విదేశీ విద్యానిధి పథకం కూడా అణలుపరిచి దళిత,గిరిజన,బీసీ, మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కలలను సాకారం చేసిందన్నారు.
విద్యార్థులు, యువతకు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కి,రెండేళ్లుగా వారికి బేడీలు బహూకరిస్తూ కాలం వెల్లదీస్తున్న కుట్రల సర్కార్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు.నిజానికి దళిత,గిరిజన, బడుగు,మైనారిటీ వర్గాల యువత ఎదుగుదలను ఏమాత్రం ఇష్టపడని పోలీస్ పటేల్ వారసత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దేనన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్మాణాలను ప్రారంభిస్తూ,గత సర్కార్ ఉద్యోగ నియామక ఆర్డర్ లు అందిస్తూ అబధ్ధాలు ఆడుతున్న సిగ్గులేని సర్కార్ ను యువత అసహ్యించుకుంటున్నారన్నారు.
డిసెంబర్ లో పోలీసులు లేకుండా ఓయుకు వస్తే విద్యార్థిలోకం రేవంత్ రెడ్డి సర్కార్ కు అరగుండు కొడతారని హెచ్చరించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసే జీవోలన్నీ జూటాలేనని సాధారణ జనానికే తెలుసని, ఇక ఓయూ విద్యార్థులు నమ్ముతారని అనుకోవడం సీఎం రేవంత్ రెడ్డి అవివేకమని డాక్టర్ ఆంజనేయ గౌడ్ విమర్శించారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో విద్యార్థి,యువజనోద్యమాల దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ కు కునుకులేకుండా పోవడం ఖాయమన్నారు.