రాష్ట్రంలో 51 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్న సీఎం జగన్

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– పథకం లబ్ధిదారులకు రిజిష్టర్డ్ దస్తావేజుల పంపిణీ

గుడివాడ, డిసెంబర్ 21: రాష్ట్రంలో 51 లక్షల మందికి నివశించే హక్కు మాత్రమే ఉన్న ప్రభుత్వ ఇళ్ళలోని వారికి సంపూర్ణ హక్కును జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా సీఎం జగన్మోహనరెడ్డి కల్పిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని అలంకృత ఫంక్షన్ హాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులకు రిజిష్టర్డ్ దస్తావేజులను మంత్రి కొడాలి నాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో 24 వేల 343 మంది లబ్ధిదారులు బ్యాంక్ల నుండి రుణాలను తీసుకుని సకాలంలో చెల్లించారన్నారు. వీరందరి స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను ఇంటి దగ్గరే అందజేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం జగన్మోహనరెడ్డి రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారన్నారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీతో పాటు రూ .6 వేల కోట్ల స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు లబ్ధిదారులకు అందుతుందన్నారు. ఈ పథకం పూర్తి స్వచ్చంధమని చెప్పారు. లబ్ధిదారులు ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా ఇంటిని అమ్ముకోవచ్చని, బహుమతిగా
21-PHOTO-7ఇవ్వొచ్చని, వారసత్వంగా అందించవచ్చన్నారు. కుటుంబ ఆర్ధిక అవసరాలకు అవసరమైతే తనఖా పెట్టుకుని బ్యాంక్ల నుండి రుణం కూడా పొందవచ్చన్నారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఎంత ఉన్నప్పటికీ గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ. 15 వేలు, కార్పోరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే మిగతా మొత్తం మాఫీ అవుతుందన్నారు. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తం రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. లబ్ధిదారుడి స్థిరాస్థిని 22 ఎ నిషేధిత భూముల జాబితా నుండి తొలగిస్తామని, దీనివల్ల లబ్ధిదారుడు తన ఇంటిపై ఎటువంటి లావాదేవీలైనా జరుపుకోవచ్చన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చని, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీల నుండి పూర్తి మినహాయింపు లభిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబిజిస్ట్రార్ కార్యాలయాల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు.

ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైన లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదని మంత్రి కొడాలి నాని వివరించారు. అనంతరం సీఎం జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జడ్పీచైర్పర్సన్ ఉప్పాల హారిక – రాము దంపతులచే మంత్రి కొడాలి నాని కేక్ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, జిల్లా కలెక్టర్ జే నివాస్, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కే మాధవీలత, శ్రీవాసు నుపూర్ అజయ్ కుమార్, కే మోహనరావు, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, ఎంపీపీలు పెయ్యల ఆదాం, జి పుష్పరాణి, గుడివాడ ఆర్డీవో జీ శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, హౌసింగ్ పీడీ కే రామచంద్రన్, ఈఈ శ్రీదేవి, డీఈ రామోజీనాయక్, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు ఉప్పాల రాము, మండలి హనుమంతరావు, పాలేటి చంటి, మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.