-గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం వైయస్.జగన్
-ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించిన సీఎం
-విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా గురుపూజోత్సవం
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:
గురువులకు నా వందనాలు
ఇక్కడికి వచ్చిన గురువులకు నా వందనాలు. ఇక్కడికి రాలేకపోయిన గురువులు అందరికీ కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలు. నాకు చదువు నేర్పిన గురువులకు, అనేక తరాలకు చదువులు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ కూడా ఒక శిఖరం లాంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన రాష్ట్రపతి స్ధాయికి ఎదిగిన వారు. మన తెలుగువారు అయిన రాధాకృష్ణగారు ఈ స్ధాయికి తాను ఎదగడమే కాకుండా, ఉపాధ్యాయులందరినీ కూడా ఒక ఎత్తయిన శిఖరంలోకి తీసుకువెళ్లారు. అలాంటి ఆ గొప్పవ్యక్తికి కూడా వందనం.
హ్యాపీ టీచర్స్ డే…
రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ రంగంలోనూ అటు ప్రైవేటు రంగంలోనూ, ఎయిడెడ్ విద్యారంగంలోనూ పనిచేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే.
నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్ధకం చేస్తూ…మెరుగైన జీవితాన్ని పొందటం ఎలాగో నేర్పినందుకు నా గురువుకు రుణపడి ఉంటాను. ఇవి ఎంతో స్ఫూర్తి దాయకమైన మాటలు. ఇవి నేను చెప్పడమే కాదు.. ఏకంగా ప్రపంచాన్నే ఒకప్పుడు పరిపాలించిన అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఇవే మాటలు చెప్పాడు.
శిలను శిల్పంగా మలిచే శిల్పి – ఉపాధ్యాయుడు
సానపట్టకముందు వజ్రం అయినా కూడా రాయి మాదిరిగానే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. ఒక మంచి టీచర్ ఒక స్కూల్‌ని మార్చగలుగుతాడు. ఒక వ్యవస్ధను మార్చగలుగుతాడు.
గ్రామంతో మొదలుపెడితే మంచి టీచర్ ఒక విప్లవాన్ని తీసుకురాగలుగుతాడు. ఒక మంచి టీచర్ తాను కన్న పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా తపిస్తాడో… తన తరగతిలో ఉన్న ప్రతి పిల్లాడు కూడా అదే మాదిరిగా బాగుపడాలని ఆరాటపడతాడు.
ఒక మంచి టీచర్ తన పిల్లలకు కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెప్పడు. తన విద్యార్ధుల వ్యక్తిత్వాన్ని కూడా తాను మలుస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని, విజ్ఞానాన్ని, వివేకాన్ని కూడా పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాడు. వారిలో దాగిన ప్రతిభను బయటకు తీయడంలో కీలకపాత్ర పోషిస్తాడు. క్రమశిక్షణతో జీవించడం నేర్పుతాడు. బ్రతకటం ఎలా అన్న నైపుణ్యం ఉపాధ్యాయుల నుంచే వస్తుంది. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. తన దగ్గర చదువుకున్న పిల్లలంతా కూడా తనకంటే ఇంకా గొప్పవాళ్లు కావాలని ఆరాటపడతాడు. అలా ఆరాటపడుతూనే నిజంగా ఆ పిల్లలు అది సాధించినప్పుడు సంతోషపడతాడు. ఈ రోజు ప్రపంచంలో నిరంతరం చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆ నేపధ్యంలో మారుతున్న కాలానికి తగినవిధంగా పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత కూడా ఎలా బ్రతకగల్గుతారు అన్నది కూడా ఆలోచిస్తాడు. ఓ మంచి ఉపాధ్యాయుడుగా ఆలోచించాలి కూడా.
విద్యారంగం– మూడేళ్లలో ముందడుగులు…
అందుకే ఏ దేశమైనా, ఏ జాతైనా, ఏ సమాజమైనా, ఏ మంచి ప్రభుత్వమైనా కూడా చదువుకు ఉన్న అనేక ప్రయోజనాల దృష్ట్యా విద్యా సంస్ధలనే కాకుండా ఉపాధ్యాయులను కూడా గొప్పగా గౌరవిస్తుంది. గౌరవించాలి కూడా.
చదవులకున్న విలువకు, మారుతున్న ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రాధాన్యతా రంగంగా విద్యారంగాన్ని భావించి, గుర్తించి మన ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో అనేక ముందడుగులు వేసింది.
మీ అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి తెలియజేస్తున్నాను.
నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సమీక్షలలో విద్యాశాఖకు సంబంధించి చేసినన్ని సమీక్షలు మరేశాఖలోనూ చేయలేదు.
కారణం ఇది మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాలు, వారి తలరాతలను, భవిష్యత్‌ను మార్చగలిగే గొప్పదైన అస్త్రం ఈ విద్యాశాఖ. అందుకే విద్యాశాఖమీద అంత ధ్యాస పెట్టాం.
మనమంతా కూడా ఒక విషయం ఆలోచన చేయాలి. మన విద్యా విధానం, మన విద్యా వ్యవస్ధ మనకు ఈ రోజు ఒక ఆస్తిగా ఉందా? లేక భారంగా ఉందా అన్నది ఆలోచన చేయాలి.
మనందరి ముందున్న సవాల్…
చదువుకున్న చదువుల వల్ల మన పిల్లలకు ప్రయోజనం కలుగుతుందా ? లేక కేవలం పట్టా మాత్రమే వారి చేతిలో ఉంచే ఒక ఊరట కలిగించే విధంగా ఉందా ? అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
చదువుకు దూరమైన సామాజిక వర్గాల కోసం…
కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాల పాటు చదువులకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రపంచంతో పోటీ పడలేని చదువును, తమ మీద రుద్దబడిన చదువును, వేరే గత్యంతం లేక చదువుకుంటున్న దుస్థితి. దీన్ని మార్చేందుకు మనందరి ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా దృష్టి సారించి శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావు. ఇవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టాలని తీసుకున్న నిర్ణయాలు అంతకంటే కావు.
ఇవి ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగుపర్చేందుకు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్న మార్పులు. ఈ అట్టడుగున ఉన్న పేద సామాజిక వర్గాల చరిత్రను కూడా పూర్తిగా మార్చే మార్పులు. మరింత అర్ధవంతమైన, భవిష్యత్ తరాలకు అవసరమైన చదువులు కోసం అడుగులు ముందుకు వేస్తున్న మార్పులు. ఇవి గత ప్రభుత్వం మాదిరిగా విద్యా రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుని… కార్పొరేట్‌కు విద్యా రంగాన్ని అమ్మేసి, పేద సామాజిక వర్గాలకు అన్యాయం చేయడానికి ఉద్దేశించిన మార్పులు కావు.
పేదల కోసం తెస్తున్న మార్పులివి…
పెద్ద చదువులకు, మంచి చదువులకు పేదరికం అన్నది అడ్డు రాకూడదు.. ప్రతి ఒక్కరికీ కూడా అందుబాటులోకి రావాలని తెస్తున్న మార్పులు. ఇవి గతంలో మాదిరిగా కార్పొరేట్ రంగంతో కుమ్మక్కై, ఇంగ్లిషు మీడియంను, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను పేదలకు దూరమయ్యేలా గత ప్రభుత్వం చేసినలాంటి మార్పులు కావు. గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను, ప్రభుత్వ బడులను, రెండింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా తీసుకువచ్చిన చర్యలు, మార్పులు అంతకన్నా కావు.
పూర్వ వైభవం దిశగా…
భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దితూ… మనం అడుగులు వేస్తూ మార్పులు తీసుకొస్తున్నాం.
మనవన్నీ కూడా ప్రభుత్వ బడులకు మళ్లీ గుర్తింపు, ఆ వైభవం తీసుకురావాలన్న తపనతో చేస్తున్న మార్పులు. ప్రభుత్వ బడిలో ఇప్పటికీ కూడా మరో దారి లేక చదువుకుంటున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దశాబ్దాలుగా వారి జీవితాల్లో ఆశిస్తూ ఎదురు చూస్తున్న మార్పులివి. తమ పిల్లలను చదవిస్తున్నఆ తల్లులకు చదువులు ప్రోత్సహించేందుకు మద్ధతుగా నిలబడే మార్పులు.
బడికి వచ్చిన పిల్లలు ఆకలితో ఉండరాదని వారికి పౌష్టికాహారాన్ని అందించడమే కాక, రోజుకో మెనూ ఉండేలా వారి గురించి కూడా చేస్తున్న మార్పులు.
ప్రభుత్వ బడి కార్పొరేట్ బడి కంటే బాగుండాలని, అలా ఉండేలా తీసుకువస్తున్న మార్పులు. పేద పిల్లలు మాత్రమే కాకుండా.. మంచి చదువులు కావాలనుకునే ప్రతి తల్లితండ్రీ, ఆ ప్రభుత్వ బడులలో పనిచేస్తున్న టీచర్లు సైతం వారి పిల్లలను కూడా ఇవే ప్రభుత్వ బడులలో చదివించే పరిస్థితి రావాలన్న మంచి సంకల్పంతో తీసుకువస్తున్న మార్పులు.
కార్పొరేట్‌తో పోటీపడేలా…
ప్రభుత్వ బడులలో చదివిన పిల్లలు కూడా కార్పొరేట్ విద్యాసంస్ధలతో పోటీపడి, ఏ పరీక్షలో అయినా సరే నెగ్గేలా తీసుకువస్తున్నమార్పులు. విద్యార్ధుల హాజరు శాతాన్ని పెంచడం ఎలా? అక్షరాస్యతను పెంచడం ఎలా? నాణ్యమైన విద్యను అందించడం ఎలా? అన్న ప్రశ్నలకు సమాధానంగా మన ప్రభుత్వం తీసుకువస్తున్న అవసరమైన మార్పులు.
సరైన టాయ్‌లెట్లు లేకపోవడం వల్ల ఆడపిల్లల్లో ఎక్కువశాతం బడి మానేస్తున్నారు అన్న నిజాన్ని గమనించిన తర్వాతే.. వందశాతం అక్షరాస్యత, కనీసం అంటే 70శాతం ఉన్నత విద్యలో జీఈఆర్ రేషియో పెంచే విధంగా లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది.
పెద్ద మనసుతో ఒక్కటవ్వాలి…
ఇది జరగాలంటే… ఈ సౌకర్యాలన్నీ బాగుండాలంటే, ఈ లక్ష్యాలు అన్నీ చేరాలంటే పెద్ద మనసు చేసుకుని మనమంతా ఒక్కటైతేనే ఇది సాధ్యమవుతుంది.
విద్య కోసమే రూ.53 వేల కోట్లు ఖర్చు…
ఇక్కడ మన అమ్మఒడి, సంపూర్ణ పోషణంతో పాటు, గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్ ఒప్పందంతో పాటు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు కూడా స్కిల్స్ అప్‌గ్రేడెేషన్ ప్రొగ్రాం.. ఉన్నత విద్యలో విద్యాదీవెన, వసతి దీవెన, కరిక్యులమ్ మార్పులు ఇలా ఈ మూడేళ్లలో వీటిమీద మాత్రమే మనందరి ప్రభుత్వం చేసిన.. చేస్తున్న ఖర్చు రూ.53 వేల కోట్లు. ఉచితంగా విద్యను అందించడంతో పాటు ఉపయోగపడే విధంగా నాణ్యమైన చదువు ఇవ్వాలన్నది మన విధానం.
ప్రభుత్వ రంగం మీద సానుభూతి ఉన్న ప్రభుత్వమిది
ఇందులో మీతోడ్పాటు అన్నిది చాలా కీలకమైన అంశం. మీ అందరికీ దీన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ రంగం మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వంమనది. కారణం గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశాయి. ప్రభుత్వ స్కూల్స్‌కి, ఆసుపత్రికి వెళ్లడం వృధా.. చివరికి ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా వృధా అన్న విధాంగా నిర్వర్యం చేశాయి. ఇలా చేసుకుంటే పోతే ఇది ఎక్కడికి పోతుందంటే చివరకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను తీసేసే పరిస్థితిలోకి పోయేది. అటువంటి గత పాలనకు పూర్తిగా విరుద్ధంగా ప్రభుత్వ రంగం మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది.
ఉద్యోగుల కోసం చిత్తశుద్ధితో…
60 నుంచి 62 సంవత్సరాలకు ఎవరూ అడక్కపోయినా పదవీవిరమణ వయస్సును పెంచాం. ఎవరూ అడక్కపోయినా ఎస్జీటీలకు స్కూల్‌అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్లను గ్రేడ్ 2 హెడ్ మాష్టార్లగా ప్రమోట్ చేస్తున్నాం. హెడ్ మాష్టార్లను ఎంఈఓలగా పదోన్నతి కల్పిస్తూ.. నియామకాలు సాగిస్తున్నాం. ఇవన్నీ ఎవరూ అడగకపోయినా.. విద్యారంగంలో ఇవన్నీ అవసరమని చెప్పి తలచి, ఎక్కడా వెనుకడుగు వేయకుండా మనసు పెట్టి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్నాం.
క్షేత్రస్థాయిలో విద్యాబోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకు వేగంగా వేస్తున్నాం. గత రెండు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్ విషయంలో కూడా.. పూర్తి చిత్తశుద్దితో ఉద్యోగుల మీద ప్రేమ, వారికి మంచి చేయాలని తపనతో దీనికి మంచి పరిష్కారం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనదే.
ఉద్యోగులను పట్టించుకోని గత ప్రభుత్వం…
ఈ విషయంలో గతంలో ఏనాడూ ఉద్యోగుల మీద సానుభూతి చూపని ప్రభుత్వాన్ని మీరు గత ఐదు సంవత్సరాలలో చూశారు. గత ఐదేళ్లలో ఉద్యోగుల సమస్యకు పరిష్కారం వెదకాలని, వారికి మంచి చేయాలని తపన ఏమాత్రం చూపని గత ప్రభుత్వం.. ఈ రోజు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని రెచ్చగొట్టే విధంగా టీచర్లను సైతం వదలకుండా విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇంత కన్నా దారుణం ఏదైనా ఉంటుందా?
ఎల్లో మీడియా కుతంత్రాలు
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు, వారి పెన్షన్ సమస్యలకు అనుకూలంగా ఒక వ్యాఖ్య కూడా రాయని, చూపని ఇవే ఎల్లో పత్రికలు, ఎల్లో ఛానెళ్లు. ఇప్పుడు కనీసం ఒక పరిష్కారం కోసం మన ప్రభుత్వం మనసుపెట్టి ఆలోచన చేస్తూ…అడుగులు ముందుకు వేస్తుంటే.. ప్రశంసించకపోగా… రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతున్నారు. వీటిని గమనించమని, ఆలోచించమని కోరుతున్నాను.
అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర మనది…
అన్ని వర్గాలకుమంచి చేసిన చరిత్ర మనది. టీచర్లకు, ప్రభుత్వ బడులకు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా గౌరవం పెంచుతూ, మంచి జరిగేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం కూడా మనదే.
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మీ అందరి తోడ్పాటు సర్వదా లభించాలని, ఇంకా విద్యారంగంలో మంచి చేసే మార్పులకు కట్టుబడి ఉంటానని, మనసారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం వైయస్ జగన్ పురస్కారాలు అందించారు.