అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య విజ్ఞప్తి
శంకరాచార్యులు వారు చెప్పిన ‘గజం మిథ్య – పలాయనం మిథ్య’ కథలా ‘కోడి కత్తి మిథ్య- కోడి కత్తి కేసు మిథ్య’ అని తేలిపోయిందని, 52 నెలలుగా జైలులో మగ్గుతున్న అభం శుభం తెలియని దళిత అభాగ్యడు జనపల్లి శ్రీనివాసరావుపై పెట్టిన కేసును వాపస్ తీసుకొని, బేషరతుగా విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కేవలం రాజ్యాధికార దాహంతో జరగని దానిని జరిగినట్లుగా ప్రజల్ని వంచించి, నమ్మించి, కోడి కత్తి కేసును సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందారని, తద్వారా అధికారంలోకి కూడా వచ్చారని ఆరోపించారు.
కేసును నాలుగేళ్లుగా విచారిస్తున్న ఎన్ఐఏ కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర కోణం లేదని, నిందితుడికి ఏ రాజకీయ పార్టీ తో సంబంధం లేదని కోర్టుకు తెలిపినట్లు చెప్పారు. అభియోగాలు అన్నీ అభూత కల్పనలుగా తేల్చిందని అన్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాలన్న సిఎం పిటీషన్ కొట్టి వేయాలని చెప్పటంలోనే కేసు డొల్లతనం బహిర్గతం అయ్యిందన్నారు. అమ్మవారి జాతరలో పులులను బలి ఇవ్వరు. మేకలను మాత్రమే బలి ఇస్తారు అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటకు సాక్ష్యంగా శ్రీనివాసరావు జీవితాన్ని బలి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు శ్రీనివాస్ విడుదలకు కృషి చేయాలని కోరారు.