– నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ ఏడాది తప్పకుండా నిర్వహిస్తాం
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టివి మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 110 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్ర, జిల్లా స్థాయి కందుకూరి రంగస్థల పురస్కారాలు ప్రదానం చేసిన మంత్రి దుర్గేష్
విజయవాడ : కూటమి ప్రభుత్వంలో కళలు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
బుధవారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టివి మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి 177వ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలుగు నాటక రంగ దినోత్సవం-2025 ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి కమిటీ ఎంపిక చేసిన 110 మందికి అవార్డులను మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు, జిల్లాస్థాయిలో 26 జిల్లాలకు గాను 107 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలను మంత్రి దుర్గేష్ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కందుకూరి అవార్డ్స్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి చెప్పగానే సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశానని ఆ సందర్భంగా విజయవాడలో కానీ లేదా రాజమండ్రిలో గాని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ను కేటాయించాలని కోరానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు మంత్రి గుర్తు చేశారు.
ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో, ఎక్కడైతే కళలు ఎల్లలు దాటి ముందుకు వెళ్తాయో ఆ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథంలో దూసుకెళ్తుంది అన్నారు. కళకు, కళా రంగానికి, కళాకారులకు పెద్దపీట వేస్తోన్న ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అని తెలుపుతూ స్వతహాగా కళాకారుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. కళాకారులకు పెన్షన్ ఇచ్చే విషయం సీఎంతో చర్చించానని తెలిపారు.
రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో మరిచిపోయిన నాటక రంగ పండుగ మళ్ళీ వచ్చింది అన్నారు. కళాకారులను ఆదరించేది కూటమి ప్రభుత్వం అన్నారు. పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలకు మంత్రి దుర్గేష్ రూపంలో మంచి వ్యక్తి రావడం గర్వంగా ఉందన్నారు. నాటక రంగ అభివృద్ధికి ప్రతి ఒక్క కళాకారులు పాటుపడాలన్నారు. కళలు బతికించేందుకు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తానని మంత్రి దుర్గేష్ చెప్పినట్లు గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు.
నాటక రచయిత, ప్రముఖ సినీ రచయిత, కందుకూరి పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్ బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ.. నాటక రంగానికి మంచి రోజులు వచ్చాయన్నారు. కళాకారులు అయిన కీ. శే.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లు పార్టీలు పెట్టారని కళలు వెలిగేందుకు కారణం అయ్యారని, నాటక రంగానికి చేయూతనిస్తున్నారన్నారు. వీళ్ళ హయాంలో నాటక రంగం, కళలు వర్ధిల్లుతాయన్నారు.
ఎఫ్ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం శుక్ల మాట్లాడుతూ అవార్డుల ఎంపికకు కృషి చేసిన కమిటీకి అభినందనలు తెలిపారు. నాటకం ఆవశ్యకత తెలియజేసారు. రాబోయే రోజుల్లో నాటక రంగాన్ని ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి దుర్గేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.