– 30 లక్షలమంది పిల్లలకు అన్యాయం
– ఎన్టీఆర్ జిల్లా సహజ సంపద తెలంగాణకు
– మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం
– ప్రభుత్వం తీరుపై గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు
విజయవాడ: కన్నతల్లికి కూటమి వెన్నుపోటు పొడుస్తోందని మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. అమ్మఒడిని తల్లికివందనంగా మార్చిన కూటమి ప్రభుత్వం అందులో రెండువేలు ఎందుకు కోత విధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అమ్మఒడి పథకంలో స్కూళ్లలో బాత్‌రూముల క్లీనింగ్‌కు డబ్బు కోతపెట్టారని విమర్శించిన లోకేష్, మరి ఇప్పుడు తల్లికివందనంలో 2 వేలు ఎందుకు కోతపెట్టారో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వంపై వివిధ అంశాలతో కూడిన 10 ఫిర్యాదులను వైసీపీ నేతలు గవ ర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం, తమ పార్టీ కార్యకర్తలపై ఆక్రమ కేసుల గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. తల్లికి వెన్నుపోటు పొడిచి 30 లక్షల మంది పిల్లలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుక, క్వారీ,మైనింగ్ వంటి సహజ సంపదను తెలంగాణకు తరలిస్తున్నారని ఆరోపించారు. వాటి గురించి సొంత పార్టీ పత్రికల్లో వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. గవర్నర్ తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని కోరామన్నారు. జగన్ భద్రతలో విఫలమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌కే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
యువనేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, మహిళలపై రోజు రోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశామన్నారు. సాక్షి ఆఫీసులపై దాడుల ద్వారా జర్నలిస్టులను బెదిరిస్తున్నారని చెప్పామన్నారు.