Suryaa.co.in

Andhra Pradesh

బాబు ఆత్మస్తుతి.. పరనింద

– బురద చల్లుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌
– నేరమయ రాజకీయాల గురించి చంద్రబాబు మాటలు
– ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే’.. అన్నట్లుగా ఉన్నాయి

తాడేపల్లి: చంద్రబాబు ఏడాది పాలనపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్ఠీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కారుమూరి నాగేశ్వరరావు, పి.అనిల్‌కుమార్‌ యాదవ్, మేరుగ నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి సంయుక్త ప్రకటన.

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూరై్తన సందర్భంగా సీఎం చంద్రబాబు నానా హడావిడి చేస్తున్నారు. రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించాలని ఆదేశించడమే కాకుండా, సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడుతూ.. యథావిథిగా గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పైనా విమర్శలు గుప్పిస్తూ, నిందలు మోపుతూ.. ఈ ఏడాదిలో రాష్ట్రాన్ని ఎంతో ఉద్దరించినట్లు గొప్పలు చెప్పుకున్నారు.

నిజానికి ఏడాది పాటు పరిపాలనలో తాను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ్టికీ చంద్రబాబు నిత్యం బురద చల్లుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా నేరమయ రాజకీయాల (క్రిమిలైజేషన్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌) గురించి చంద్రబాబు నీతులు చెప్తుంటే ఆయన రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్లందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘క్రిమినలైజేషన్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌’కు ఆద్యుడు చంద్రబాబే అనే సంగతి అందరికీ తెలిసిందే. తన రాజకీయ జీవితంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబుది అదే తీరు.

వంగవీటి మోహనరంగా హత్య వెనకాల ఎవరున్నారో రాష్ట్ర హోం మంత్రిగా పని చేసిన చేగొండి హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. వైయస్సార్‌ తండ్రి రాజారెడ్డిగారి హత్య కేసులో నిందితులను ఆశ్రయం ఇచ్చి, వారిని దాచి పెట్టిన వ్యక్తి చంద్రబాబు కాదా?. అంతెందుకు! వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది కదా?

పైగా ఆ కేసును ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా వాడుకుని, తామే హత్య చేశామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో చెప్పిన వారిని కూడా అప్రూవర్‌గా మార్చి, ఆ నెపాన్ని నిర్దోషుల మీద మోపి రాజకీయ విష క్రీడ ఆడుతున్నది ఎవరో కూడా ప్రజలకు తెలిసిందే. తెల్గీ స్టాంప్‌ పేపర్ల స్కామ్‌ మొదలు.. ఇలా ఏ నేరం చూసినా సరే చంద్రబాబు పాత్ర లేకుండా ఉండదు. అలాంటి చంద్రబాబు నేరమయ రాజకీయాల కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది.

గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దేశంలో ఏ సీఎం కూడా చేయనంత అత్యంత హేయమైన పాలన చంద్రబాబుగారు చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలు విపక్ష నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో పాటు, అక్రమ కేసలు బనాయింపు. లేని, జరగని ఒక అంశాన్ని సృష్టించి, దానిపై విష ప్రచారం చేసి, అది నిజమని ప్రజలు నమ్మేలా అన్ని డ్రామాలు చేసి, తాను టార్గెట్‌గా చేసుకున్న వారిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబుగారు పని చేస్తున్నారు.

చంద్రబాబుగారి ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన ఘాతుకాలు ఒక్కసారి చూస్తే..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైయస్సార్‌ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63.

మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.

నేరమయ రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదు. నిజానికి, విద్యార్థి దశలో ఉన్నప్పుడే తన సహచరులకు మద్యం పట్టించి ప్రత్యర్థులపైకి దండయాత్రకి పంపానని చంద్రబాబు స్వయంగా తన ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మామ కాళ్లు పట్టుకుని తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఆందోళన కార్యక్రమం నిర్వహించినా ఎన్ని బస్సులు తగలబెట్టారని, ఎన్ని దుకాణాలు తగలబెట్టారని వాటి ఆధారంగా తన పార్టీ నాయకులకు మార్కులు వేసిన చంద్రబాబుదేనని స్వయంగా ఆయన తోడళ్లుడు అనేక టీవీల సాక్షిగా చెప్పారు. చివరకు జర్నలిస్ట్‌ పింగళి దశరథరాం హత్య వెనుకాల ఎవరున్నారో అందరికీ తెలిసిందే.

 

LEAVE A RESPONSE