(న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవచ్చా? సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారందరినీ, న్యాయమూర్తులుగా నియమించాలా? కేంద్రం ఆ జాబితాను తిరస్కరించకూడదా? అసలు ఇలాంటి పద్ధతి, సంప్రదాయం ప్రపంచంలో మరే దేశంలోనయినా ఉందా? లేదు. మరి మన దేశంలోనే ఆ సంప్రదాయం ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు? కేంద్ర న్యాయశాఖ మంత్రి రివిజు వాదిస్తున్నట్లు.. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఎందుకు ఉండకూడదు? నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలను స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే బహిర్గతం చేస్తే.. ఇక వాటికి విలువ ఏముంది?.. ఈ కిరికిరికి పరిష్కారమేమిటి? కేంద్ర న్యాయశాఖమంత్రి వాదనలో సమంజసం ఉందా?.. ఇదీ గత కొంతకాలం నుంచి కేంద్రం-సుప్రీంకోర్టు మధ్య నడుస్తున్న పంచాయతీ. ఈ కీలక అంశంపై ప్రముఖ న్యాయవాది వ్యాసమిది. )
గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న సమస్య ఈ ‘కొలీజియం’ అనే వ్యవస్థ. కొలీజియం వ్యవస్థలో హైకోర్టు, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను సుప్రీమ్ కోర్టులోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు సిఫారసు చేస్తారు. ప్రభుత్వం ఆ సిఫారసుల మేరకు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తుంది. ఇదీ టూకీగా కొలీజియం వ్యవస్థ.
అయితే ప్రభుత్వానికి, సుప్రీమ్ కోర్టుకు మధ్య ఈ ఘర్షణ వాతావరణం ఎందుకు, ఎలా ఏర్పడింది అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఒరిజనల్ గా రాజ్యాంగంలో జడ్జీల నియామకాలు, బదిలీల గురించి ఏముందో చూడాలి.
Art.124 (1) ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీమ్ కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదించి, సదరు హైకోర్టు, సుప్రీమ్ కోర్టు జడ్జీలను నియమించాలి.
స్థూలంగా ఇది.
అయితే ఈ Article లో ఉన్న ‘after consultation అనే పదానికి అర్ధవంతంగా, రీజనబుల్ గా, సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలే కానీ, మొక్కుబడి సంప్రదింపులు కాదు అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఐతే సుప్రీమ్ కోర్టు అలా నిర్వచనం ఇవ్వడానికి ఆస్కారం ఉన్నదా? అన్న విషయం చూద్దాం.
సుప్రీంకోర్టు రాజ్యాంగంలో పేర్కొన్న Consultation అనే పదానికి విశాలమైన అర్ధం చెబుతోంది. ‘after consutation’ అన్న మాటలకు Concurrence అనే అర్ధం చెప్పడం అధిక భాష్యం అనుకోవచ్చు.
ఇక కొలీజియం అనే వ్యవస్థ ఎలా పరిణమించిందో చూడాలంటే మనం S P Gupta vs. Union of India (1981) కేసు గురించి స్థూలంగా తెలుసుకోవాలి. దీనినే ఫస్ట్ జడ్జ్ కేస్ అని, జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేస్ అని కూడా అంటారు.
ముగ్గురు న్యాయవాదులను Art.224 ప్రకారం తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించడంపై అనేక హైకోర్టులలో దాఖలైన పిటీషన్లను సుప్రీమ్ కోర్టు విచారణకు తీసుకున్నది. S P Gupta అనే న్యాయవాది ఈ ముగ్గురిలోను లేరు. ఆయన అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది మాత్రమే.
ఆ కేసుని స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ క్రింది విషయాలను పరిశీలనలోకి తీసుకున్నది.
01. Art 224 (అదనపు, తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం) ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసిన నియామకం రాజ్యాంగబధ్ధమా?
02. కేంద్ర న్యాయశాఖకు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు బైట పెట్టవచ్చా?
03. S P Gupta అనే న్యాయవాది ఈ పిటీషన్ దాఖలు చేసేందుకు అర్హుడా?
04. న్యాయవ్యవస్థ స్వతంత్రత, ప్రొసీజర్
ఈ 4 అంశాలపై సుప్రీమ్ కోర్టు 7గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపి 5:2 మెజారిటీతో ఈ క్రింద విధంగా తీర్పును ఇచ్చింది.
01. తాత్కాలిక న్యాయమూర్తులను కొద్ది కాలానికి మాత్రమే నియమించవచ్చు.
02. ఉత్తరప్రత్యుత్తరాలు బహిరంగపరచాలి.
03. S P Gupta అనే న్యాయవాదికి ఈ పిటీషన్ వేసే అర్హత ఉంది.
04. న్యాయమూర్తులను నియమించే అధికారం పాలనావ్యవస్థ చేతిలో ఉంటే న్యాయవ్యవస్థ తన స్వతంత్రత కోల్పోతుంది. కనుక కొలీజియమ్ అనే వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకం జరగాలి. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాకు తేడా లేదనీ, రెండూ సమానమేనని కూడా చెప్పబడింది.
ఇదీ స్థూలంగా ఆ కేసు వివరాలు. ఈ విధంగా కొలీజియమ్ అనే మాట ప్రచారంలోకి వచ్చింది.
తరువాత 1993 లో Supreme Court Advocates on Record Vs. Union of India కేసులో కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకం మొదలయింది.
(దీనినే Second Judges Case అని కూడా అంటారు).
ఈ కేసులో ప్రధానంగా రెండు విషయాలను విచారించింది సుప్రీంకోర్టు.
01. న్యాయమూర్తుల నియామకంలో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాధాన్యత ఏమిటి?
02. న్యాయమూర్తుల సంఖ్యను నిర్ధారించే విషయంలో న్యాయబధ్ధత ఎంతవరకు?
ఈ కేసులో సుప్రీం కోర్టు 9మంది సభ్యుల ధర్మాసనం ఈక్రింద చెప్పిన విధంగా తీర్పునిచ్చింది.
01. S P Gupta కేసుని తిరగతోడి, ‘సంప్రదింపులు’ అంటే integrated, participatory and consultative అని పేర్కొన్నది. (*)
02. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘Pater familias’ సూత్రం ఆధారంగా అందరి గురించి తెలిసి ఉంటుంది కనుక న్యాయమూర్తుల నియామకం అనేది సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే చెయ్యాలి, మరో ఇద్దరు సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయమూర్తుల సలహాతో.
(Pater familias అంటే కుటుంబ పెద్దగా కుటుంబంలోని వారి గురించి మగ దిక్కుకు బాగా తెలిసి ఉండటం).
03. భారత రాజ్యాంగం, న్యాయమూర్తుల నియామకంలో పాలనా వ్యవస్థకు సంపూర్ణ అధికారం ఇవ్వలేదు, కనుక సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏవిధంగాను తక్కువ కాదు.
04. న్యాయమూర్తుల నియామకం రాజ్యాంగపరంగా సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తితో ముడి పడి ఉన్నందున, ప్రధాన న్యాయమూర్తి Concurrence లేకుండా న్యాయమూర్తుల నియామకం జరుపరాదు. (**)
05. చాలా కేసుల్లో కేంద్రం లిటిగెంట్ కనుక న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. (*)
06. 9మంది కూడా న్యాయవ్యవస్థ యొక్క స్వతంత్రతపై ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.
స్థూలంగా 7:2 మెజారిటీతో ఫస్ట్ జడ్జెస్ కేసులో చేప్పిన Consultation అనే పదానికి Concurrence అనే అర్ధం చెప్పింది ఈ సెకండ్ జడ్జెస్ కేసులో.
అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర కేవలం సంప్రదింపులకే పరిమితం కాదు. కానీ పాలనా వ్యవస్థతో కలసి నిర్ణయించాలని తీర్మానించారు. అంటే కొలీజియమ్ న్యాయమూర్తుల పేర్లను రికమెండ్ చేస్తుంది. ప్రభుత్వం (పాలనావ్యవస్థ) దానిని అమలు చేస్తుంది.
పైన పేర్కొన్న Stars * గురించి :
సంప్రదింపులు అంటే Integrated, Participative and Constructive అనే అర్ధం చెప్పింది సుప్రీమ్ కోర్టు.
బుర్రాఖుర్ కోల్ కం. లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 1961 AIR SC 954 లో నిర్వచనం గురించి సుప్రీమ్ కోర్టు ‘ఏదైనా ఒక చట్టంలో ఉపయోగించిన పదాలు (Words) స్పష్టంగా ఉన్నప్పుడు చట్టంయొక్క Preamble తో పని లేదు’ అని పేర్కొన్నది.
ఏ డిక్షనరీలోనూ సెకండ్ జడ్జెస్ కేసులో చెప్పిన విధంగా అర్ధం లేకపోయినా న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇది ముఖ్యం కాబట్టి అంగీకరించవచ్చు.
న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ముడి పడి ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి ‘Concurrence’ అవసరం ఉన్నది అని అంటే న్యాయమూర్తుల నియామకం ఒక్క ప్రధాన న్యాయమూర్తికే కాక మొత్తం రాజ్యాంగ వ్యవస్థతో ముడిపడి ఉంది అన్న విషయం సుప్రీమ్ కోర్టు విస్మరించింది అనే అనుకోవాలి.
చాలా కేసుల్లో కేంద్రం లిటిగెంటు కాబట్టి, కేంద్రం న్యాయమూర్తులను నియమించకూడదు. ఇది వితండవాదం. పాలనావ్యవస్థ అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. అంతమాత్రాన రాజ్యాంగపరంగా పాలనావ్యవస్థకు ఉన్న అధికారాన్ని కోర్టు తీసేసుకోవడం height of judicial arrogance.
ఇక మూడో కేసు : ఇది రాష్ట్రపతి రాజ్యాంగంలోని Art.143 (1) క్రింద ఏదైనా విషయం మీద (Question of Law or Facts) సందిగ్ధం ఏర్పడినప్పుడు సుప్రీమ్ కోర్టును అభిప్రాయం కోరవచ్చు. దీనినే Re Special Reference అని అంటారు. అయితే సుప్రీమ్ కోర్టు అభిప్రాయం రాష్ట్రపతిపై బైండింగ్ కాదు (President is the Head of Executive). అలాగే, కొలీజియమ్ వ్యవస్థ మీద కూడా అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ కొలీజియమ్ వ్యవస్థ మీద మొత్తం 9 ప్రశ్నలపై సుప్రీమ్ కోర్టు అభిప్రాయాన్ని కోరారు.
సుప్రీంకోర్టు అన్ని విషయాల మీద అభిప్రాయం వెలిబుచ్చినప్పటికీ స్థూలంగా తేల్చినదేమంటే ….
a) సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను కూడా సంప్రదించాలి.
b) రాజకీయపరమైన వత్తిళ్ళను తట్టుకోవాలంటే ప్రభుత్వ జోక్యం ఉండకూడదు.
c) ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియమ్ సిఫారసులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
నా అభిప్రాయం :
ఇలా సంప్రదింపులకోసం ఏర్పడ్డ కొలీజియమ్ సిస్టమ్ ఈనాడు న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నది.
ఒరిజినల్ గా Art.124(1) చెప్పినదాన్ని కూడా రాజ్యాంగవిరుధ్ధం అనడం సహేతుకం కాదు. రాజ్యాంగంలో అనేక మార్పులు చేస్తున్నారు. అలాగే ఈ Art.124(1) ను కూడా మార్పు చేయవచ్చు. ఎందుకంటే సుప్రీమ్ కోర్టు అభిప్రాయపడ్డట్లు రాజకీయ జోక్యం న్యాయవ్యవస్థ స్వతంత్రతను నీరు కారుస్తుందన్న విషయంలో రెండో ఆలోచన లేదు.
(ఇక్కడ మరో విషయం కూడా ప్రస్థావించాలి. Iron Law of Oligarchy అనేది 19వ శతాబ్దం మొదట్లో రాబర్ట్ మిషెల్స్ అనే సోషియాలజిస్ట్ ప్రతిపాదించాడు. దాని ప్రకారం ప్రజాస్వామ్యాల్లో ఉన్నతవర్గం తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోచూస్తారు. ప్రస్తుత కొలీజియమ్ కూడా అలాంటిదే అనిపించడంలో ఆశ్చర్యం లేదు).
ఆ రాజకీయ జోక్యాన్ని నిరోధించడానికే NJAC, 2014 (99th Amendment of Constitution of India) ను ప్రవేశ పెట్టింది కేంద్రం. (NJAC = National Judicial Appointments Commission)
దానిపై 2015లోనే SCAOnR Vs. Union of India కేసులో సుప్రీమ్ కోర్టు తీర్పునిస్తూ కేశవానంద భారతి కేసులో పేర్కొన్న బేసిక్ స్ట్రక్చర్ లో న్యాయవ్యవస్థ స్వతంత్రత కూడా ఒక భాగం అని, దానిని శాసన వ్యవస్థ మార్చజాలదని పేర్కొంటూ ఆ చట్టాన్ని కొట్టి వేసింది.
బేసిక్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగంలోని మూడు విభాగాలకు సంబంధించినది. ఎవరి గీతల్లో వారు ఉండాలి.
NJAC ఏం చెప్పింది?
హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలు, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తుల నియామకంపై ఒక కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిషన్ లో సభ్యులుగా, సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఛైర్మన్ తోపాటు ఇద్దరు సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, న్యాయవ్యవస్థపై, రాజ్యాంగంపై సంపూర్ణ, సమగ్ర అవగాహన ఉన్న ఇద్దరు విశిష్ట వ్యక్తులు ఉంటారు. ఈ ఇద్దరు విశిష్ట వ్యక్తులను ఎంపిక చేసే విధానంలో సభ్యులు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్ సభలోని ప్రతిపక్షనేత ఉంటారు. ఈ ఇద్దరు విశిష్ట వ్యక్తులలో ఒకరు తప్పనసరిగా SC/ST/Women / Minority కి చెందినవారై ఉండాలి.
ఈ కమిటీ నిర్ణయం మేరకు ఆ ఇద్దరు సభ్యులతోకూడిన NJAC న్యాయమూర్తుల నియామకం చేపడుతుంది. ఇందులో మళ్ళీ ఏ ఇద్దరు సభ్యులు కాదన్నా ఆ నియామకం జరుగదు.
అయితే ఇందులో రాజకీయ ప్రమేయం ఉందని, అందువల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బ తింటుందని సుప్రీమ్ కోర్టు పేర్కొన్నది.
న్యాయ వ్యవస్థ పాలనావ్యవస్థను నమ్మదు కానీ పాలనావ్యవస్థ న్యాయ వ్యవస్థను అనుసరించాలి. ఇదేమి న్యాయం?
ఒక ఉదాహరణ చెప్పుకుందాం. With due respects to Hon’ble Collegium and other Judges of Supreme Court (ఇది కోర్టు ధిక్కారం కాదనే అనుకుంటున్నాను) ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి.వై.చంద్రచూడ్ తండ్రి శ్రీ వై.వి. చంద్రచూడ్ సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా శ్రీ బి.ఎన్.కృపాల్ అనే న్యాయవాదిని బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. అదే కృపాల్ గారు సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి.వై.చంద్రచూడ్ ను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. ఆప్పుడు ఇదే డి.వై.చంద్రచూడ్ గారు ఆ కృపాల్ గారి కుమారుడైన శ్రీ సౌరభ్ కృపాల్ ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేసారు.
వీరందరు న్యాయశాస్త్ర కోవిదులే కావచ్చు. కానీ ఈ దేశ ప్రజలకు అది quid pro quo అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
రాజ్యాంగం ప్రారంభంలోనే ‘We, the people of India …. ‘ అని ఉంటుంది కాబట్టి శాసన, పాలన, న్యాయవ్యవస్థలు ఈ దేశ ప్రజలకు జవాబుదారి వహించవలసిందే.
ఈ మధ్య మరొక వాదన కూడా సుప్రీంకోర్టు వైపునుండి వినవస్తోంది.
తాము సిఫారసు చేసిన పేర్లలో కొందరిపట్ల IB రిపోర్టులలో ఉన్న విషయాలను బహిర్గతం చేయడమే కాక, వారిని సమర్ధించడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది.
సౌరభ్ కృపాల్ విషయమే తీసుకుందాం. తాను స్వలింగసంపర్కుడనని ఆయనే చెప్పుకున్నారు.
ఇండియన్ పీనల్ కోడ్ S.377 ప్రకారం Unnatural Offences కు పదేళ్ళ జైలు శిక్ష, జరీమానా విధించవచ్చు. IPC, S.377 ప్రకారం ప్రకృతికి విరుధ్ధంగా శృంగారం చెయ్యడం నేరం. అయితే 2018 లో 5గురు సభ్యుల సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ఈ సెక్షన్ ను రాజ్యాంగ వ్యతిరేకం అని కొట్టివేసింది. ఈ ఐదుగురిలో శ్రీ వై.వి.చంద్రచూడ్ కూడా ఉన్నారు. అలాగే పిటీషనర్ల తరఫున వాదించిన వారిలో శ్రీ సౌరభ్ కృపాల్ ఉన్నారు.
మొత్తంగా చూస్తే సౌరభ్ కృపాల్ ను ఢిల్లీ హైకోర్టుకు ఎలివేట్ చెయ్యడానికి ఈ సెక్షన్ ను రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చారని సామాన్యులు అనుమానిస్తే వారి తప్పేమీ లేదు.
ప్రకృతి విరుధ్ధంగా శృంగారం జరపడం అనేది మానసిక రుగ్మత. అలాంటి రుగ్మత ఉన్నవాళ్ళు న్యాయమూర్తులుగా ఎలా పనికొస్తారు?
NJAC కేసులో జస్టిస్ మదన్ లోకూర్ చెప్పిన మాటలు చూద్దాం.
NJAC Act did not take into account the privacy concerns of individuals who had been recommended for appointment as a Judge. Referring to the contentions made by the AG in this regard, he noted that given that proceedings of the NJAC would be completely accessible and if sensitive information about the recommended individual were made public, it would have a serious impact on the dignity and reputation of recommended individual….’
ఇప్పుడు IB రిపోర్టులను సుప్రీమ్ కోర్టే బైట పెట్టింది. రహస్యంగా ఉంచవలసిన విషయాలను బట్టబయలు చేసింది.
అలాగే మరొకరు ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనేది అభియోగం. సుప్రీమ్ కోర్టు ఈ విషయంలో కూడా వాక్ స్వాతంత్ర్యం అనే కవచాన్ని వాడుకున్నది అనిపిస్తుంది.
వాక్ స్వాతంత్ర్యం ఉండవలసిందే కానీ ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎటువంటి విలువలు పాటించాలి?
ఒక న్యాయవాది, న్యాయమూర్తి ఇంటికి వెళ్ళి కలవడం అనేది విలువలకు విరుధ్ధం. జిల్లా స్థాయి న్యాయవాదులే విలువలను పాటిస్తుంటే హైకోర్టు, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులుగా నియమింపబడేవారు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? (ఈ విషయంలో కొద్ది రోజులక్రితం నేను పెట్టిన పోస్టు చదివే ఉంటారు).
న్యాయమూర్తులను పాలనావ్యవస్థ నియమిస్తే వారిపై పాలనావ్యవస్థ ప్రభావం ఉంటుందని భావిస్తున్న కొలీజీయమ్, హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీమ్ కోర్టుకు పదోన్నతి కలిగించే అధికారం దక్కించుకుంటే, కెరీర్ మీద ఆశ ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల మీద కొలీజియమ్ ప్రభావం ఉండదని ఎలా చెప్పగలరు?
న్యాయం చెయ్యడం ఎంత ముఖ్యమో, చేసింది న్యాయంగా కనిపించడం కూడా అంతే ముఖ్యం.
అయితే ఈ స్పర్ధకు అంతం లేదా అంటే ఉన్నది. అది NJAC నే కానవసరం లేదు. IJS (Indian Judicial Service) ను ప్రారంభించడం ఒక పధ్ధతి. మున్సిఫ్ మేజిస్ట్రేట్ నుండి సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తుల వరకు ఈ IJS ద్వారానే జరగాలి.ఒక గుమాస్తా ఉద్యోగంనుండి ఐఏయస్ వరకు ఎంపికకు ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థలో ఈ పధ్ధతి ఎందుకు ప్రవేశపెట్టకూడదు?
ఈమధ్య సుప్రీం కోర్టు మరొక మాట కూడా అన్నది …. ‘కేంద్రం నియమించకపోతే మేమే నియమిస్తాం’ అని.
జ్యుడిషియల్ ఆర్డర్ జారీ చేస్తారా? కానీ రాష్ట్రపతి తిరస్కరిస్తే?
‘Where the Rule of Law ends, there starts the tyranny’.
శాసనం అమలు జరుగని చోట అరాచకం ఏర్పడుతుంది.
చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను.
Doctrine of Revival అనేది ఒకటుంది. దాని ప్రకారం ఒక సవరణ చట్టాన్ని కొట్టివేసినప్పుడు అంతకు ముందు ఉన్న అధికరణ దానంతట అదే అమలులో ఉన్నట్లు. Statute never contemplates a vacuum in Law. Art.124(1) కు సవరణ చేసి NJAC తీసుకువచ్చారు. కానీ కోర్టు దానిని కొట్టివేసింది. అప్పుడు అసలు Art.124(1) యధాతథంగా ఉన్నట్లే. ఈ కొలీజీయమ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కేవలం తీర్పుల ద్వారా ప్రవేశపెట్టబడిందే. చట్టం చేయడం ద్వారా ఆ తీర్పుని రద్దు చేస్తే, ఆ సవరణ చట్టాన్ని కోర్టు కొట్టివేస్తే అమలులోకి వచ్చేది సవరణకు పూర్వం ఉన్న అధికరణే కానీ కోర్టు తీర్పు కాదు. ఎందుకంటే సవరణ చేసింది చట్టానికి కాబట్టి.
Art.141 ప్రకారం సుప్రీమ్ కోర్టు తీర్పు మిగతా కోర్టులకు శిరోధార్యం.
Art.142(1) సుప్రీమ్ కోర్టు తీర్పులు, శాసన వ్యవస్థ చట్టం చేసేవరకు, చట్టంగా పరిగణించాలి. (చట్టం చేసిన తరువాత ఆ తీర్పును చట్టంగా పరిగణించరాదు).
కనుక Art.124(1), NJAC కి పూర్వ స్థితి యధాతథంగా ఉన్నట్లే.
ఇక మీదైనా సుప్రీమ్ కోర్టు కొలీజీయమ్ NJAC లేదా IJS ల వైపు మొగ్గు చూపితే దేశం అరాచకంవైపు మళ్ళకుండా ఉంటుంది.

న్యాయవాది, గుంటూరు
email : advocateamkrishna@gmail.com