– జిల్లా రైతులకు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు
– రాప్తాడు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత
– శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు కార్యక్రమం
– తరలిరానున్న 300కంపెనీలు, శాస్త్రవేత్తలు
– రైతులకు ఇది చక్కటి అవకాశమన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు: మండల కేంద్రంలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న రైతుబడి అగ్రిషో కార్యక్రమానికి తరలిరావాలని జిల్లా రైతులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో అత్యాధునిక వ్యవసాయ సమాచారంతో రైతుబడి ఆధ్వర్యంలో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన రైతుబడి అగ్రి షో ఏర్పాటు చేశారు.
శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు రాప్తాడు వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. సుమారు 300 కంపెనీలు, 1000కి పైగా నూతన వ్యవసాయ అంశాలు వివరించేందుకు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాయి. ఉమ్మడి అనంతపురంతోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి వేల సంఖ్యలో రైతులు హాజరయ్యే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను శుక్రవారం రోజు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు.
దూరప్రాంతాల నుంచి వచ్చే రైతులకు, అధికారులకు, కంపెనీల ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. వీలనైంత ఎక్కువ మంది రైతులు ఈ కార్యక్రమానికి వచ్చేలా చూసుకోవాలన్నారు. ఇందులో ఆధునిక వ్యృవసాయ పరికరాలు, డ్రోన్ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మెక్కలు, నానో టెక్నాలజీ, శాటిలైట్ సాయిల్ టెస్టింగ్, ఆటో స్టార్టర్, ఫెన్సింగ్, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు పాల్గొంటున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత తెలిపారు.
వ్యవసాయ అనుబంధ రంగాలైన డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పట్టు పురుగుల, మేకలు-గొర్రల పెంపకం వంటి ఇతర అంశాల గురించి కూడా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసుకోవడంతో పాటు.. కష్టాన్ని తగ్గించుకొని, లాభాన్ని పెంచుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సునీత అన్నారు.