‘కమ్యూనిస్ట్‌ నేపథ్యం’ రాము తెల్ల గుడ్డలపై నల్ల బురదను దాచలేకపోయింది!

విజయసాయి రెడ్డి

గుడివాడ హైస్కూలులో చదువుకున్న చెరుకూరి రాముకు (రామోజీ) కమ్యూనిస్ట్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యత్వం బాగానే ఉపయోగపడింది. ‘బొమ్మలు గీసే’ ఈ పెదపారుపూడి కుర్రాడు విద్యార్థి ఫెడరేషన్‌ కార్యకర్తగా ‘రాజకీయ చైతన్యం’ తగినంత వంటబట్టించుకున్నాడు. ఎన్‌.టి. రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 1983, 1985, 1994 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన ఈ రాజకీయ స్పృహతోనే ఊహించగలిగాడు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ తొలగించాక జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ప్రధాని ఇందిరాగాంధీ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ‘తెలుగు మీడియా చాణక్యుడి’కి ధైర్యం వచ్చింది. అప్పటి నుంచీ ‘ఈనాడు’లో గట్టి కాంగ్రెస్‌ వ్యతిరేక ధోరణి కనిపించింది. కాని, తనకు అవసరం ఉన్నప్పుడు తన శ్రేయోభిలాషి అనుకున్న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి సహాయ సహకారాలు తీసుకున్నట్టుగానే 1989–94 మధ్య నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి కాంగ్రెస్‌ సీఎంల సాయాన్ని రాము అడిగి మరీ పుష్కలంగా స్వీకరించారు.
2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిని ఊహించని రాము!

2004 పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిని రాము పసికట్టలేకపోయారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వాన సంకీర్ణ ప్రభుత్వం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానిగా ఏర్పడుతుందని మొదట తెలియగానే కుల రాజగురువు కంగారుపడిపోయారు. తాను 8 ఏళ్లకు పైగా ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అడ్డగోలుగా సమర్ధించానని, కాబట్టి తన వ్యాపారసంస్థల్లోని లోటుపాట్ల వల్ల తనకేమైనా ఇబ్బందులు వస్తాయనే ఆలోచన రాముకు రాలేదు. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ యూపీఏ సర్కారుకు సోనియా జీ నాయకత్వం వహించడంపై ఆయన ఎక్కువ దిగులుపడ్డారు. ఈ విషయాన్నే ప్రఖ్యాత జర్నలిస్టు కులదీప్‌ నయ్యర్‌ తన ఆత్మకథలో ప్రస్తావించారు.

‘‘కష్టపడి పైకొచ్చిన రామోజీ నాకు ఐదేళ్లుగా స్నేహితుడు. 2004 ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన నాకు ఫోన్‌ చేశాడు. ‘భారతదేశాన్ని ఒక ఇటాలియన్‌ పరిపాలించే దుస్థితి రాకుండా మీరు నివారించండి,’ అని ఆయన నన్ను అడిగాడు,’ అని నయ్యర్‌ ఈ పుస్తకంలో వివరించారు. రాము జీవితాన్ని కుదిపేసిన పరిణామం 2004లో ఏపీలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి నాయకత్వాన తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఏపీ అవతరించాక ఎన్నికల నుంచి ఎన్నికల వరకూ వరుసగా ఐదేళ్లు ఏ కాంగ్రెస్‌ సీఎం అధికారంలో కొనసాగలేదు, ‘ వైఎస్‌ కూడా ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారులే’ అనే ధీమాతో ఈనాడులో అబద్ధాలు, అర్థసత్యాలతో ‘కథనాలు’ మొదలుబెట్టించారు రాచపుండు రాము. ఈ క్రమంలోనే ఎలాంటి బోర్డు లేకుండా నడుస్తున్న తన కుటుంబ సంస్థ ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు మొదలయ్యేటప్పటికి ఆయన స్పృహలోకి వచ్చారు. తన సంస్థలోని లొసుగులు దాచిపెట్టి వైఎస్‌ సర్కారుపై నిందలు వేసే ప్రయత్నం చేసి రాము అభాసుపాలయ్యారు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల బూట్లు తొడుక్కునే రాజగురువు బట్టల నిండా నల్ల బురదే జనానికి కనిపించింది.

Leave a Reply