నందిగామ ఘటనపై గవర్నర్‌ కు టీడీపీ నేతల ఫిర్యాదు

విజయవాడ : నందిగామలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి యత్నం ఘటనపై గవర్నర్‌కు తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేశారు.

రాళ్ల దాడి ఘటనపై నామాత్రపు బెయిలబుల్ కేసు నమోదు చేయటాన్ని తప్పు పడుతూ గవర్నర్‌ను టీడీపీ నేతలు ఆశ్రయించారు.ఘటనకు సంబంధించి అనుమానితుల ఫోటోలు కూడా టీడీపీ అధిష్టానం విడుదల చేసింది.

గవర్నర్‌తో భేటీ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ… పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే చంద్రబాబుపై దాడి యత్నం జరిగిందన్నారు.324 చట్టం కింద కేసు పెట్టి పోలీసులు హాస్యాస్పదంగా వ్యవహరించారని మండిపడ్డారు.

విశాఖలో మంత్రి కారుకు దెబ్బ తగిలితే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. ఇక్కడ దాడి జరిగి రక్తం కారినా బెయిల్ బుల్ సెక్షన్ పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై గవర్నర్ కూడా విచారం వ్యక్తం చేశారన్నారు.

బోండా ఉమా మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లను దగ్గరుండి పోలీసులే ప్రోత్సహించారన్నారు. కాబోయే ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే రూ.100ఫైన్ కట్టి బెయిల్ మీద బయటకొచ్చే, పెట్టీ కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకున్న తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. నామమాత్రపు కేసు నమోదు చేయడంపై గవర్నర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు.

Leave a Reply