మాధవ్ వీడియో క్లిప్ పై కేంద్ర ఫోరెన్సిక్ విభాగంతో పరీక్షలు నిర్వహించండి!

  • రాష్ట్రంలో మహిళలపై కొనసాగుతున్న అరాచకాలపై విచారణ జరపండి
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లేఖ

అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు యావత్ మహిళా లోకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని ప్రముఖ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో జూన్ 2019 నుండి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై యథేచ్చగా సాగుతున్న అఘాయిత్యాలు, దాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గూడపాటి శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలపై బాధాతప్త హృదయంతో ఈ లేఖరాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 2019 నుండి జూలై 2022 వరకు సుమారుగా 777 మహిళలపై అఘాయిత్యాలు మరియు దాడుల సంఘటనలు నమోదయ్యాయని తెలిపారు.

ఎంపి గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వెలువడిన తర్వాత నెలకొన్న పరిణామాలు, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిన అంశాలపై ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్, మార్ఫింగ్ చేసిన వీడియో అని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) డాక్టర్ ఫకీరప్ప ప్రెస్ మీట్‌లో చెప్పడం యావత్ మహిళాలోకాన్ని విస్మయానికి గురిచేసిందని అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి అధికార వైఎస్సార్‌సీపీ నేతలను కాపాడేందుకు ఓ వర్గం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. నేరాలను అరికట్టడం, గుర్తించడం, దర్యాప్తు చేయడం, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల జీవితాల రక్షణ, స్వేచ్ఛ, గౌరవం, ఆస్తుల రక్షణ వంటి అంశాల్లో నేరస్థులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడం, ప్రజలకు నిజాయితీగా, నిష్పక్షపాతంగా సేవలందించడమన్నది పోలీసు విధుల్లో భాగం. కోట్లాదిమంది మహిళల ఆత్మగౌరవం, రక్షణకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నందున గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్ పై కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించి నిజానిజాలు వెలికితీయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖను అభ్యర్థించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దాడుల తీవ్రతను చూసి ఏ నాగరిక సమాజమైనా సిగ్గుతో తల దించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిశ చట్టం పేరుతో సాధారణ ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేస్తోంది. ‘దిసా చట్టం’ అనేది ప్రభుత్వం చెప్పేదానికి విరుద్దంగా ఉ,ది. అసలు దిశ పేరుతో రాష్ట్రంలో ప్రత్యేకమైన చట్టమే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలను రక్షించడంలో, వారికి భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నారు. అధికార వైఎస్సార్‌సీపీ తరపున చట్టసభలకు ఎన్నికైన నాయకులు ముఖ్యంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులను, ఇతర మహిళలను బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ కు సంబంధించిన న్యూడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. చట్టసభల సభ్యుల నైతికతకు సంబంధించిన ఈ అంశాలపై కేంద్రం సీరియస్ గా దృష్టిసారించాల్సి ఉంది. అధికార వైసిపి నాయకుల మద్దతు, ప్రోత్సాహంతో కొందరు అసాంఘిక శక్తులు ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతకు సంబంధించి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నివేదిక ప్రకారం మహిళలపై నేరాలు 2020లో 14,603 ఉండగా…2021లో 17,736 (21.45శాతం) పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర హోంమంత్విత్వ శాఖ సమగ్ర విచారణ జరిపించాలి. నేరస్తులను తప్పించుకోవడానికి అధికార వైసిపి ప్రభుత్వం పాత్ర, పోలీసు విభాగం, కొందరు అధికారుల పాత్రపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గూడపాటి లక్ష్మీనారాయణ విజ్జప్తిచేశారు.

ఎస్పీ ఫకీరప్పపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి!
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్‌పై సమగ్ర విచారణ జరిపి, విధి విధానాల ఆధారంగా వాస్తవ వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని హైకోర్టు న్యాయవాది గూడపాటి…డీజీపికి మరో లేఖరాశారు. గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్ పై విచారణలో విధి విధానాలు పాటించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఎస్పీ ఫకీరప్పపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. మాధవ్ వీడియో క్లిప్ పై విచారణ కొనసాగుతుండగానే అసలు వాస్తవాలను వక్రీకరించిన వివరాలను బహిర్గతం చేయడం పోలీసు ఎథిక్స్, స్టాండింగ్ ఆర్డర్‌లకు విరుద్ధమని తెలిపారు. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఎస్పీ ఫకీరప్ప చేస్తున్నట్టు కన్పిస్తోందన్నారు. రాష్ట్ర పోలీసు విభాగం అధిపతిగా ఉన్న మీరు చట్టాన్ని పరిరక్షించడం, చట్టబద్ధమైన పాలన అమలుచేయడం అవశ్యం. అలాగే రాష్ట్ర డిజిపిగా, ఆల్ ఇండియా సర్వీస్ (ప్రవర్తన) రూల్స్, 2014 ప్రకారం రాష్ట్రంలోని ఐపిఎస్ అధికారులందరి సక్రమ ప్రవర్తనను సమర్థవంతంగా అమలు చేయడానికి మీరు బాధ్యత వహించాల్సిందిగా గూడపాటి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply