హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సెక్యూరిటీ కమిషనర్ గోళ్లమూడి మధుసూదనరావు ను కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ పెన్షనర్స్ అసోసియేషన్ సత్కరించింది. శనివారం పట్టాభిపురంలోని రైల్వే డివిజన్ కార్యాలయంలో మధుసూదనరావు ను పెన్షనర్స్ సంఘనేతలు టి.వివేకానంద, గుమ్మడి సీతారామయ్యచౌదరి, పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్.నగేష్ బాబు కలిసి పుష్పగుచ్చం అందించి, అభినందించారు.
ఈ సందర్భంగా టి.వివేకానంద, గుమ్మడి సీతారామయ్యచౌదరి మాట్లాడుతూ.. స్మగ్లింగ్ ను నిరోధించటానికి అర్.పి.ఎఫ్, కస్టమ్స్ శాఖల మధ్య వున్న అనుబంధాన్ని, సహకారాన్ని, మైత్రి ని వివరించారు. నిబద్దత, నిస్వార్థ సేవలతో పనిచేస్తున్న మధుసూదనరావుకు రాష్ట్రపతి అవార్డు దక్కటం ప్రతిభకు లభించిన గుర్తింపు అన్నారు.
మధుసూదనరావు మాట్లాడుతూ..ఉద్యోగి పురోభివృద్ధికి పురస్కారాలు ప్రోత్సాహలుగా పనిచేస్తాయన్నారు. వృత్తిలో అంకితభావం, పట్టుదల ఉంటే అత్యున్నత శిఖరాలు అధిరోహించవచ్చునన్నారు. అనంతరం అర్.పి.ఎఫ్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బంది మధుసూదనరావును అభినందించారు.