– కాంగ్రెస్‌కు దేశంపై చిత్తశుద్ధి లేదు
– విదేశాల్లో సొంత దేశ వ్యవస్థపై విద్వేషం
– మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలు (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సభలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: సిద్ధాంతానికి అనుగుణంగా, కార్యకర్తల ఆధారంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాజ్ పేయి తన జీవితాంతం నైతిక విలువలతో.. పత్రికా విలేకరిగా, జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యులుగా, జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా సుదీర్ఘమైన రాజకీయ పరిపాలన అందించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా తలొగ్గకుండా పనిచేస్తూ, లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముందుకు నడిపించిన గొప్ప యోధుడు వాజ్ పేయి.
వాజ్ పేయి స్థాపించిన భారతీయ జనతా పార్టీలో మనమంతా సభ్యులుగా చేరడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దేశంలో పాస్ పోర్టు రావాలంటే సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితుల నుంచి… సులభతరంగా ప్రతిఒక్కరికి పాస్ పోర్టు వచ్చేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో మొదటిసారిగా హిందీలో ప్రసంగించి భారతదేశం యొక్క ప్రత్యేకతను చాటిచెప్పారు.
ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇతర దేశాల ప్రతినిధులు ఆ దేశానికి చెందిన జాతీయ, ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతుంటే.. తాను కూడా భారతీయ భాష (హిందీ)లో మాట్లాడుతామంటూ మొరార్జీ దేశాయ్ అనుమతితో ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం.
నేడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి భారతదేశంపై విషం కక్కుతూ, రాజ్యాంగబద్ధమైన సంస్థలను అవహేళన చేస్తూ, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నాడు. భారతదేశంలోని పార్లమెంటు వ్యవస్థకు వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ కు, న్యాయస్థానాలు, రక్షణ వ్యవస్థకు వ్యతిరేకంగా, అవహేళన చేస్తూ రాహుల్ మాట్లాడుతున్నాడు.
కాంగ్రెస్ పాలనలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి ని ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనాలని కోరి, భారత ప్రతినిధిగా పంపించారు. వాజ్ పేయి దేశ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రపంచ వేదికపై మాట్లాడారు. దీంతో, ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రూ. 77 వేల కోట్లతో స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు పేరుతో జాతీయ రహదారులు నిర్మించి అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేసేలా పాలన అందించారు. అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పనిచేస్తున్నారు.
వాజ్ పేయి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ప్రత్యేక కార్యాచరణతో ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టి రైతలును ప్రోత్సహించారు. దేశంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పేద ప్రజలకు అనేక ఇండ్లు కట్టించారు. వాజ్ పేయి హయాంలో దేశంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించిన జాతీయ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనే ప్రారంభించారు. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పేదలకు ఇండ్లు కట్టివ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇండ్లకు భూమిపూజ కూడా చేయలేదు.
కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ను ఓడించడంలోనూ వాజ్ పేయి కీలక పాత్ర పోషించారు. భారత భద్రతా అవసరాల నిమిత్తం అమెరికా ఒత్తిళ్లకూ లొంగకుండా వాజ్‌పేయి సారథ్యంలోని ప్రభుత్వం అణుశక్తి దేశంగా భారత్ ను తయారుచేసుకునేందుకు రాజస్థాన్ లోని ప్రోఖ్రాన్ లో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. భారత్ ను అణుశక్తి కలిగిన దేశంగా నిర్మించారు.
వాజ్ పేయి కఠోరమైన జాతీయ భావజాలంతో పనిచేశారు. పార్లమెంటులో వాజ్ పేయి ఉపన్యాసాన్ని అన్ని పార్టీల నాయకులు శ్రద్ధగా వినేవారు. వాజ్ పేయి బహిరంగ సభకు స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చేవారు. దేశ రక్షణ కోసం, భారతదేశ గౌరవం కోసం వాజ్ పేయి నాయకత్వంలో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీలో పనిచేసే అవకాశం మనకు లభించింది. ప్రజల మద్దతుతో ఈరోజు అధికారంలో ఉన్నాం.
నరేంద్ర మోదీ మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అద్భుత పరిపాలనను అందిస్తున్నారు. విదేశాంగ విధానంలో, ప్రజలకు సేవచేసే వెల్ఫేర్ యాక్టివిటీస్ లో మార్పులు తీసుకొచ్చారు. డిజిటల్ ఇండియాతో కొత్త సాంకేతికతో అనేక మార్పులు తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారతదేశం ఎదిగింది. వాజ్ పేయి స్ఫూర్తితో రానున్న మూడు సంవత్సరాల్లో దేశం కోసం పనిచేసే లక్షమంది యువకులను రాజకీయ నాయకులుగా తయారుచేయాలని మోదీజీ పిలుపునిచ్చారు.
అటల్ బిహారీ వాజ్ పేయి స్ఫూర్తితో యువతను బిజెపి లోకి తీసుకురావాలి. బడుగు బలహీన వర్గాలకు సేవలందించాలి. దేశంలో మౌలిక వసతులను కల్పించే దిశగా పనిచేయాలి. సేవాభావంతో పనిచేసే వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేలా పనిచేయాలి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టించి పనిచేయాలని కోరుతున్నాను.