– టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
– ఆరు గ్యారంటీల వివరాలను బీజేపీ ఎంపి లక్ష్మణ్‌కు పోస్టులో పంపిన సుధాకర్‌గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతున్నారన్నారు.
ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల బ్లాక్ మనీ తెప్పించి వేస్తా అన్న మీ మోడీ హామీ ఏమైంది ? ఏటా కోటి మందికి ఉద్యోగాలిస్తామన్నారు, పదేళ్ల కాలం సరిపోలేదా? అని ఆయన ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందడం తప్ప, బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు.
పేదలకు అందుబాటులో ఉండాలని స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ఆనాడు బ్యాంకులను జాతీయం చేశారని బండి సుధాకర్ గుర్తు చేశారు. కానీ ఈరోజు మోడీ అనాలోచితంగా బ్యాంకులను విలీనం చేసి, ఆ రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర పెద్దల మిత్రులకు దాదాపు 18 లక్షల కోట్లు మాఫీ చేసింది వాస్తవం కాదా? బీజేపీ నాయకులే సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం కింద 136 కోట్ల మంది మహిళలు లబ్ది పొందగా, ఇందుకోసం ప్రభుత్వం 4500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 50 లక్షల మంది గృహిణులు ఉపయోగించుకుంటున్నారన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ 43 లక్షల కుటుంబాలకు అందుతున్నదన్నారు.
ఏడాది కాలంలో రైతుబంధు, రుణమాఫీ, రైతు భరోసా కింద 58,280 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసిన ముఖ్యమంత్రి రైతుబిడ్డ రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని బండి సుధాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.