– డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ
-గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు కేంద్రం గ్రాంట్‌ను పెంచాలని కోరిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరో ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. కేంద్ర ఇంధన శాఖ సూచనలతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాల డిస్కంలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొన్నారు.
ఆయా రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక పరిస్థితులపై కీలకంగా చర్చించారు. బకాయిలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను ఏ విధంగా లాభాల బాట పట్టించి ముందుకెళ్లాలనే దానిపై మంత్రులు సమాలోచనలు జరిపారు. అదనపు నష్టాలు, ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన, ఇతర మొండి బకాయిల వసూళ్ల పై ముఖ్యంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. దీనితో పాటు పీఎం సూర్యఘర్, కుసుమ్ లాంటి పథకాలను ప్రోత్సహించి డిస్కంల భారాలను తగ్గించేలా కార్యాచరణ చేపట్టాని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తీర్మానించారు. సమావేశంలో బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి మెగావాట్ల నుంచి రెండు వేల మెగావాట్లకు పెంచాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రాన్ని కోరారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు కేంద్రం గ్రాంట్‌ను పెంచాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి, సీపీడీసీఎల్ సీఎండీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.