Suryaa.co.in

Andhra Pradesh

అది ‘అసర్‌’ రిపోర్టు కాదు.. నారా లోకేశ్‌ నివేదిక

– వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌

తాడేపల్లి: గత ఐదేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన వైఎస్‌ జగన్‌ దేశంలోనే టార్చ్‌బేరర్‌గా నిలిచారని, అది చూసి ఓర్వలేక ఆయన ప్రతిష్టను మసకబార్చడమే లోకేష్‌ పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుళ్లు కుతంత్రాలతో అసర్‌ రిపోర్టును లోకేష్‌ తారుమారు చేశారని ఆక్షేపించారు.

తండ్రీ కొడుకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా వైఎస్‌ జగన్‌ గొప్పదనాన్ని, విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను విద్యాశాఖ వెబ్‌సైట్‌తోపాటు కేంద్ర నివేదికలు రుజువు చేస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రుల్లో ఎవరిని అడిగినా పిల్లల చదువుల కోసం వైఎస్‌ జగన్‌ తపించిన వైనాన్ని వివరిస్తారని చెప్పారు.

‘అసర్‌’ సర్వే ప్రకారం జగన్‌ పాలనలో విద్యావ్యవస్థలో ప్రమాణాలు పడిపోయాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. అసలు ఆ సర్వే ఏమిటని చూస్తే..

ప్రథమ్‌ అనే స్వచ్చంద సంస్థ సాయంతో అసర్‌ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) సర్వే నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల్లో విద్యా రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై స్థానికంగా ఉండే డైట్‌ సంస్థల సిబ్బంది అంతా కలిసి ఈ సర్వే నిర్వహిస్తుంటారు.

అందులో భాగంగా రాష్ట్రంలో జరిగిన సర్వేలో పద్ధతి ప్రకారం తమాషా చేశారు. అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విజాన్‌ ఫౌండేషన్‌కు చెందిన లా కాలేజీ, వైఎస్సార్‌ జిల్లాలోని ఎస్‌ఆర్‌ ప్రభుత్వ కాలేజీకి సంబంధించిన వారంతా కలిసి సర్వే చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత జగన్‌ పాలనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న లోకేశ్‌.. డైట్‌ కాలేజీ సిబ్బందిని ప్రలోభపెట్టి మొత్తం వివరాలను తారుమారు చేసి తప్పుడు సమాచారాన్ని నివేదిక రూపంలో పొందుపరిచారు. చంద్రబాబు గత పాలన 2018లో ఉన్న విద్యా ప్రమాణాలు జగన్‌ అధికారంలోకి వచ్చాక దిగజారిపోయాయని చెప్పడమే లోకేశ్‌ ఉద్దేశం. విద్యావ్యవస్థ జగన్‌ పాలనలో దారి తప్పిందని చెప్పాలన్న కుట్రతోనే సర్వే సమాచారాన్ని లోకేశ్‌ తారుమారు చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న విద్యా ప్రమాణాలపై రాష్ట్రాల వారీగా యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) రిపోర్ట్‌ ఇస్తుంది. ఆ రిపోర్టును చంద్రబాబు దిగిపోయే ఏడాది 2018–19 సంవత్సరానికి, వైఎస్‌ జగన్‌ దిగిపోయిన 2023–24కి పోల్చి మౌలిక వసతుల సదుపాయాలను చూస్తే.. జగన్‌ హయాంలో బాలికల టాయ్‌లెట్లు 59,944. అదే చంద్రబాబు హయాంలో ఆ సంఖ్య కేవలం 26,367 మాత్రమే. అంటే, జగన్‌ హయాంలో స్కూళ్లలో బాలికల టాయిలెట్లు రెట్టింపు కంటే పెరిగాయి.

ఇక బాలుర టాయ్‌లెట్లు పరిశీలిస్తే జగన్‌ హయాంలో 42,627ఉండగా, చంద్రబాబు హయాంలో ఆ సంఖ్య కేవలం 21,438 మాత్రమే. అంటే అవి కూడా జగన్‌ హయాంలో, చంద్రబాబు టైమ్‌తో పోలిస్తే, రెట్టింపు కంటే పెరిగాయి. ఇంకా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) చూసినా, జగన్‌హయాంలో 95 శాతానికి పైగా నమోదు కావడం విశేషం. ఈ రెండు రిపోర్టులు చూస్తే, ఎవరి సామర్థ్యం ఏమిటో తెలిసిపోతుంది.

LEAVE A RESPONSE