– దేశంలో బీసీలకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ
– కాంగ్రెస్ వైఖరి కారణంగానే బీసీల వెనుకబాటు
– బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ మాట్లాడి అవమానించారు
– బీసీలను మభ్యపెట్టవద్దు… పెంచిన రిజర్వేషన్లను అమలు చేసి తీరాల్సిందే
– బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దు
– రాజకీయ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం అవసరమని మాయమాటలు చెప్పవద్దు
– బూసాని కమిషన్ నివేదికను తక్షణమే బహీర్గతం చేయాలి
– గ్రామాల వారీగా బీసీ కులాల వివరాలను వెల్లడించాలి
– శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: ఈ దేశంలో బీసీలకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, బీసీల వెనుకబాటుతనానికి ఆ పార్టీ వైఖరే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం బీసీ వ్యతిరేక, విద్రోహ చరిత్రనేనని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో రాజీవ్ గాంధీ సుదీర్ఘంగా ప్రసంగించి బీసీలను అవమానించారని తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ “మీరెంతో మీకంతా వాటా” అంటూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు. బీసీ బాధలు, వారి ఆర్థిక, సామాజిక కష్టాలను వివరిస్తూనే బిల్లులో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… “కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు. వి.పి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదు.
పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారు” అని ఎండగట్టారు. రూ. 4300 కోట్లు విడుదల చేసి 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది కానీ ఆ నివేదికను ఇప్పటివరకు బయట పెట్టలేదని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు. బీసీ వర్గీకరణ కోసం మోడీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అసలు ఈ 42 శాతమన్న లెక్కకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ కారణం చేత 42 శాతమని నిర్ణయానికి వచ్చారు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల పాటు కాలయాపన చేసి తమ పోరాటాలతో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషనన్ ను నియమించిందని, కానీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని అడిగారు.
నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని, కులాల వారీగా , గ్రామాల వారిగా బీసీ జనాభాను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుందని, రిజర్వేషన్లలో, ప్రమోషన్లలో భవిష్యత్తులో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి వర్తించబోదని, కాబట్టి దానికి కేంద్రం ఆమోదం కావాలంటూ ఢిల్లీకి వెళ్లాలంటూ ప్రజలను మభ్యపెట్టవద్దని సూచించారు. రాజకీయ ,విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లులో గ్రూపుల వారీగా రిజర్వేషన్లను ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. గ్రూపుల వారీగా రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, న్యాయపరమైన చిక్కుల్లో ఈ చట్టాలు ఇరుక్కోవద్దన్నది తమ అభిమతమని, చిన్న చిన్న విషయాల మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే చట్టాలను కొట్టివేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాలని సూచించారు.
ఇక బీసీలకు ఏటా రూ రూ. 20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి గత ఏడాది కేవలం 9200 కోట్లను మాత్రమే కేటాయించిందని, ఈ బడ్జెట్ లో మాత్రం కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రూ 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బీసీల కోసం చేసిన ఖర్చు లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాలన్నారు.
కాగా, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేదని అభిప్రాయపడ్డారు. మనంతల మనమే 50 శాతం జనాభాను అవకాశాలకు ఇన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టి, మహిళలకు అవకాశాలు దక్కితేనే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న ముదిరాజ్ వంటి ఎంతోమంది పోరాట వీరులు, త్యాగధనులు ఉన్నటువంటి బీసీ వర్గాలకు అందాల్సిన అవకాశాలు ఇంకా అందలేదని వివరించారు.
ఉద్యోగ అవకాశాల్లో జాతీయస్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా 23 శాతానికిపైగా ఎప్పుడూ భర్తీ కాలేదని, యూపీఎస్సీలో 27 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎప్పుడూ 8 శాతం అవకాశాలు కూడా దక్కలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. బీసీ వర్గాలు ఆర్థిక అసమానతలు కూడా ఎదుర్కొంటున్నారని, దేశంలో 50 శాతం జనాభా ఉన్న బీసీల వద్ద కేవలం 15 శాతం మాత్రమే సంపద ఉందని, ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
భిన్న వృత్తుల సమాహారమైన బీసీ వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలని, కుల వృత్తుల వారు సంప్రదాయ ఆదాయ వనరులను కోల్పోయారని, అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి కృషి చేయకపోవడం బాధాకరమన్నారు. బీసీలకు, మహిళలకు రాజ్యాంగ రక్షణ లేకపోవడం వల్ల విస్మరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక స్వతంత్రం, అధికారం, ఆత్మగౌరవం కోసం బీసీలంతా పోరాటం చేస్తున్నారని, అనేక బీసీ కులాలు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తుండడం ఆందోళనకరమన్నారు. సంచార జాతుల వారి పిల్లలకు విద్య విషయంలో ఎంతో ఆవేదన కలుగుతుందని, కేసీఆర్ గారు సంచార జాతుల వారి కోసం రెసిడెన్షియల్ స్కూల్ లలో ప్రత్యేకంగా కోటాను ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నీరా కేఫ్ ను కొనసాగించాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలి, వడ్డెర కులాన్ని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ పై ప్రభుత్వం ఆలోచన చేయాలని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సగర కులానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను కొనసాగించాలని, విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, ఆరె కటిక సామాజిక వర్గానికి స్టాటర్ హౌజులకు మునిసిపల్ అనుమతులను వేగవంతం చేయాలని, పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ పరికరాలకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
యాదవులు గొర్రెల పంపణి కోసం వేచి చూస్తున్నారని, ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుర్మ సామాజిక వర్గం డిమాండ్ చేస్తున్నదని, రజక సమాజం తమను ఎస్సీలో చేర్చాలని చేస్తున్న డిమాండ్ ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ముదిరాజ్ లను బీసీ – డీ నుంచి బీసీ – ఏ లో చేర్చుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారని, అదే సమయంలో ముదిరాజ్ లను తమ గ్రూపులో చేర్చితే తమ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని బీసీ – ఏ వర్గాలు అంటున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి ఆయా వర్గాల ఆందోళనలను తొలగించాలని పేర్కొన్నారు.
గంగపుత్రుల కోసం గతంలో చెరువుల్లో 90 కోట్ల ఉచిత చేప పిల్లలు వేస్తే… ఈ ఏడాది కేవలం 19 కోట్ల చేప పిల్లలను కూడా వేయలేదని, కుమ్మరి, నాయిబ్రాహ్మణ వంటి సామాజిక వర్గాల డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారు. మేరు, పూసల, బోయ, వడ్డెర, మేదరి వండి సంచార జాతులకు డీనోటిఫైడ్ ట్రైబ్స్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.