Suryaa.co.in

Telangana

ఇంట‌ర్‌నేష‌న‌ల్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్స్‌

-రూ.2500 కోట్ల‌తో 100 రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణం
-పైలేట్ ప్రాజెక్టుగా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ఎంపిక‌
-నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల వారీగా నాలేడ్జ్ కేంద్రాల ఏర్పాటు
-విద్యాశాఖ ఉన్న‌త అధికారుల స‌మీక్ష‌లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

ఇంట‌ర్ నేష‌న‌ల్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణాలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు విద్యా శాఖ అధికారుల‌ను అదేశించారు. గురువారం డా. బి.ఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలోని డిప్యూటి సీఎం కార్యాల‌యంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌న నిర్మాణాల‌పై విద్యా శాఖ ఉన్న‌త అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఇందిర‌మ్మ రాజ్యంలో పాఠ‌శాల‌ల మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు పెద్ద పీట వేస్తున్నామ‌న్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవ‌త్స‌రంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బిసీ, మైనార్టీ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు. ఒక్కో రెసిడెన్షియ‌ల్ భ‌వ‌నానికి ప్ర‌భుత్వం రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేసింద‌న్నారు. భ‌వ‌న‌ నిర్మాణాల‌కు గాను బ‌డ్జెట్‌లో నిధుల కేటాయింపు కూడ జ‌రిగినందున భ‌వ‌న నిర్మాణాల ప‌నులు త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు వేర్వేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక ముందు నిర్మించే భ‌వ‌నాలు ఒక చోట ఉండే విధంగా యాక్ష‌న్‌ ప్లాన్ రూపొందించాల‌న్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాలల భ‌వ‌నాలు ఇంటిగ్రేటేడ్ గా ఒకే చోట నిర్మాణం చేయ‌డం వ‌ల్ల స్థ‌ల స‌మ‌స్య‌ను అధిగ‌మించొచ్చ‌ని సూచించారు. అదే విధంగా కామ‌న్‌గా అందేటి సౌక‌ర్యాల వ‌ల్ల కూడ కొంత అద‌న‌పు ప్ర‌యోజ‌నం క‌ల్గుతుంద‌న్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల విద్యార్థులు ఒకే చోట ఉండ‌టం వ‌ల్ల విద్యార్థుల్లో సోద‌ర భావాన్ని పెంపొందించ‌డం వ‌ల్ల కుల ర‌హిత స‌మాజానికి బాటలు వేసిన వార‌మ‌వుతామ‌న్నారు.

అలాగే మిని ఎడ్యుకేష‌న్ హ‌బ్ గా అభివృద్ది చేయ‌డానికి బాగుంటుంద‌ని వివ‌రించారు. ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణం కోసం మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామ‌న్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ బాలుర రెసిడెన్షియ‌ల్ పాఠశాల‌ను చింత‌కాని మండ‌ల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం స‌మీపంలో ఉన్న 10 ఎక‌రాల స్థ‌లంలో నిర్మాణం చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఎస్సీ, బిసి, మైనార్టీ బాలిక‌ల రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ను ఎర్రుపాలెం మండ‌ల ప‌రిధిలో నిర్మాణం చేయ‌డానికి స్థ‌ల ఎంపిక చేస్తున్న‌ట్టు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణం జ‌రుగ‌డానికి కావాల్సిన స్థ‌ల ఎంపిక‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణం త్వ‌ర‌గా జ‌రుగ‌డానికి వివిధ శాఖల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీ అబ్ధుల్ న‌దీం ను ఆదేశించారు.

అనంత‌రం బెంగ‌ళూర్‌కు చెందిన ఆర్కిటెక్ ప్ర‌తినిధులు దేశంలో వివిధ ప్రాంతాల్లో వారు చేప‌ట్టిన ఇంట‌ర్ నేష‌న‌ల్ మోడ‌ల్ పాఠ‌శాల‌ల‌కు సంబంధించిన‌ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేటేంష‌న్‌ను విద్యాశాఖ అధికారుల స‌మ‌క్ష్యంలో డిప్యూటి సీఎం తిల‌కించారు. అన్ని హంగుల‌తో అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో 100 రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణాలు ఒకే మోడ‌ల్ గా చేప‌ట్టాడానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను అదేశించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగాల పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌మ‌య్యే నిరుద్యోగుల‌కు కోచింగ్ సౌక‌ర్యం కోసం నాలేడ్జ్ కేంద్రాల‌ను నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల వారీగా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు డిప్యూటి సీఎం తెలిపారు.

LEAVE A RESPONSE