– మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభం
– మంగళగిరి-తెనాలి-నారాకోడూరు మధ్య నాలుగు లేన్లుగా నిర్మాణం
– మంత్రి చొరవతో అభివృద్ధి దిశగా ఆయా ప్రాంతాలు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి – తెనాలి – నారా కోడూరు మధ్య రోడ్లకు మహర్దశ పట్టింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో కీలక రోడ్లు, ప్రజలు నిత్యం రాకపోకలు అధికంగా సాగించే మార్గాలైన తెనాలి – గుంటూరు వయా నారా కోడూరు, తెనాలి – విజయవాడ వయా మంగళగిరి రహదారుల విస్తరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
తెనాలి నుంచి గుంటూరు మార్గంలో నారా కోడూరు వరకు, తెనాలి – విజయవాడ మార్గంలో మంగళగిరి హైవే వరకు 4 లైన్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో అధికారులు డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గుంతల రోడ్లతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంగళగిరి నుంచి నారా లోకేష్ అత్యధిక మెజార్టీతో గెలవడంతో ఈ ప్రాంత రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. అనతి కాలంలోనే ఆయా గ్రామాల మధ్య తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి – తెనాలి- నారా కోడూరు మధ్య 40.05 కి.మీ రహదారులను నాలుగు వరుసలకు విస్తరణ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీ పనులను శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఇందు కోసం ప్రభుత్వం రూ. కోటి 12 వేలు విడుదల చేసింది. దీనితో అధికారులు, ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి డీపీఆర్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. విస్తరణకు అవసరమైన కొలతలు సేకరిస్తున్నారు.