కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి

-కృష్ణా జలాల వాటాను పెంచి పాలమూరు-రంగారెడ్డి పనులకు అనుమతివ్వండి
-కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు బండి సంజయ్ వినతి
-సానుకూలంగా స్పందించిన షెకావత్
-సీడబ్ల్యూసీకి డీపీఆర్ ను పంపిస్తామని హామీ

‘‘క్రిష్ణా జలాల వాటా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పిదం దక్షిణ తెలంగాణ ప్రజలకు శాపమైంది. ఆనాడు 299 టీఎంసీలకు అంగీకరించడంవల్ల నేడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లివ్వలేని పరిస్థితి నెలకొంది. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు నష్టపోకుండా చూడండి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వండి. తద్వారా కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ధండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్రానికి విజ్ఝప్తి చేశారు. కేంద్ర జల వనురుల శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరాంతో కలిసి బండి సంజయ్ ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి వనురుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందే అవకాశం ఉందన్నారు. క్రిష్ణా జలాల వాటా కేటాయింపుల సందర్భంగా సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం చేశారని వాపోయారు. కేసీఆర్ స్వార్ధ పూరిత రాజకీయాలకు, తప్పిదాలకు తెలంగాణ ప్రజలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే క్రిష్ణా జలాల వాటా నీటి కేటాయింపులతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి త్వరగా పనులు చేపట్టేలా అనుమతి ఇవ్వాలని కోరారు.

బండి సంజయ్ విజ్ఝప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. వెంటనే డీపీఆర్ ను కేంద్ర జలవనరుల సంఘానికి (సీడబ్ల్యూసీ) పంపి పరిశీలించడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల అనుమతి విషయంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply