Home » వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్

వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్

  • అవినీతిలో మునిగి, రౌడీయిజాన్ని పెంచి పోషించిన వైసీపీని ఇంటికి పంపాలి
  • వైసిపి మాఫియాలకు ఎన్డీఏ ప్రభుత్వంలో తగిన ట్రీట్మెంట్ ఉంటుంది
  • మోదీ లక్ష్యం – ఆంధ్ర ప్రదేశ్ వికాసం
  • దేశాన్ని ముక్కలు చేయాలనేదే కాంగ్రెస్ ఆలోచన
  • రాయలసీమకు సాగునీరు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం
  • కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది
  • కలికిరి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ

‘పేదల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం మాఫియాను పెంచి పోషించింది. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగింది. వీరి ఇసుక దాహానికి ఏకంగా అన్నమయ్య సాగునీటి డ్యాము తెగిపోయింది. ఏకంగా కొన్ని గ్రామాలు మునిగిపోయి, 39 మంది మృతికి కారణమయ్యారని తెలుసుకొని వేదన చెందాను. ఇలాంటి ఇసుక మాఫియా, ప్రశ్నించే వారిపై దాడులు, రౌడీ రాజ్యం ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చిన వైసీపీకి కౌంటర్ మొదలైంది. ఇక వారు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేన’ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో మంత్రులు గూండా గిరి చేస్తారు.. ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటారు. పూర్తిగా అవినీతిలో మునిగిపోయిన వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి.. రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి అని చెప్పారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభ బుధవారం పీలేరు నియోజకవర్గం, కలికిరిలో జరిగింది.

ఈ వేదిక నుంచి  నరేంద్ర మోడీ మాట్లాడుతూ… “ఎంతో నమ్మకంతో ప్రజలంతా 2019లో వైసీపీని గెలిపిస్తే వారి నమ్మకాన్ని వైసీపీ తుంగలో తొక్కింది. ప్రజల పట్ల విశ్వాస ఘాతుకంగా  పని చేసింది. పూర్తి అవినీతిలో కూరుకుపోయి, ఆంధ్ర ప్రదేశ్ ను  రౌడీ రాజ్యంగా మార్చింది. ఈ వైసీపీ మాఫియాలకు ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో తగిన ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రతి ఒక్క అవినీతిని బయటకు తీస్తాం.

ప్రతి ఒక్కరికి తాగునీరు ఇవ్వాలని కేంద్రం తీసుకువచ్చిన జలజీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ పట్టించుకున్నది లేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేశారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ఎన్డీఏ సర్కారు వస్తే రాయలసీమ పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తిస్థాయిలో నిర్మించే బాధ్యతను తీసుకుంటాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి దిశగా ముందుకు నడుపుతాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా, దేశమైన అభివృద్ధి చెందాలి అంటే సుస్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం అవసరం. రాయలసీమకు బలమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో అపారమైన ఖనిజ సంపద, ఆలయాలు, బలంగా పనిచేసే యువత, కష్టించి సాగు చేసే రైతులు, పర్యాటక రంగం నిండుగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సరైన రీతిలో అభివృద్ధి చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో, దేశంలో ఒకే రకమైన నాయకత్వం ఉంటే పరస్పర సహకారం చాలా చక్కగా ఉంటుంది. రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధిలో అందనంత ఎత్తుకు తీసుకువెళ్లే బాధ్యత ఎన్డీఏ సర్కార్ తీసుకుంటుంది. ఉపాధి పరిశ్రమలు తీసుకొచ్చి వలసలు నిరోధించేలా పనిచేస్తాం. మోడీ లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ వికాసం. దాన్ని కచ్చితంగా నెరవేర్చుదాం. గత ఐదేళ్లలో కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రాభవాన్ని తిరిగి నెలకొల్పుతాం.

కాంగ్రెస్ ఆలోచనలన్నీ రివర్స్ గేర్లో ఉంటాయి
 దేశంలో గత పదేళ్లలో తీసుకొచ్చిన ఎన్నో మంచి కార్యక్రమాలను కాంగ్రెస్ రద్దు చేస్తానని చెబుతోంది. కాంగ్రెస్ ఆలోచనలన్నీ రివర్స్ పాలన మాదిరిగా ఉంటాయి. కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తే ఆర్టికల్ 370ని తీసుకొస్తామని చెబుతోంది. సీఐఐ రద్దు చేస్తామని అంటోంది. పేదలకు ఇచ్చే బియ్యం నిలుపుదల చేస్తామని చెబుతోంది. పేదల జీవితాలకు ఆరోగ్య భద్రతను తీసేస్తామని చెబుతోంది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో నిర్మాణం అయిన రామ మందిరానికి కూడా తాళాలు వేస్తామని చెబుతోంది. కాంగ్రెస్ నేతల ఆలోచనలు అన్ని రివర్స్ లోనే ఉంటాయి.

దేశానికి బలమైన నాయకత్వం ఉంటే దేశం తలెత్తుకుని ఉంటుంది.  అరబ్ దేశాలతో ఎన్నడూ లేనట్లుగా భారత్ సంబంధాలు మెరుగయ్యాయి. ఖతార్లో చిక్కుకున్న దేశ ప్రజలను సురక్షితంగా తీసుకురాగలిగాం. మోడీ జాతి నిర్మాణ బాధ్యతను తీసుకున్నాడు. సరికొత్త భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలని భావిస్తున్నాడు. ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి వర్గాన్ని  అత్యున్నతంగా నిలపాలని భావిస్తున్నాడు. మోడీకి ఈ సమయంలో మీరు అండగా నిలవాలి.

దేశాన్ని ముక్కలు చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని దారులైన తొక్కుతుంది. ఇప్పుడు తాజాగా దక్షిణం, పశ్చిమం అంటూ దేశాన్ని విభజించే కుట్రను చేస్తోంది. దేశాన్ని ముక్కలు చేసి జాతి మూలాలు తొలగించాలని భావిస్తోంది. మనమంతా భారతజాతి కాదు వేర్వేరు జాతులు అని ప్రచారం చేస్తోంది. గాంధీ పరివారానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అమెరికా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. తమిళ సంస్కృతి వేరని, ఉత్తరాది వేరంటూ చెబుతున్నారు. అమెరికాలో చర్మం రంగును బట్టి జాతులుగా విభజించినట్లు దేశాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి పరిపాలించాలని భావిస్తోంది. దీనికి బాలథాక్రె వంటి పెద్దల మూలాలు ఉన్న వ్యక్తులు సైతం మద్దతు పలకడం బాధిస్తోంది. కాంగ్రెస్ ఆలోచనలన్నీ దేశానికి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు ఉన్న పార్టీని ఆ నాయకుల్ని ప్రజలంతా తిప్పి కొట్టాలి. వారికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠాన్ని నేర్పాలి.

రాష్ట్ర అభివృద్ధికి మోడీ గ్యారంటీ ఉంటుంది
భారతదేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాం. జాతీయ రహదారులు, రైల్వేలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాం. దేశంలో సౌకర్యాలు మౌలిక వసతులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సైతం మోడీ గ్యారెంటీ ఉంటుంది. నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వే లైను అలాగే కడప బెంగళూరు రైల్వే లైను మంజూరు అయింది. దేశంలో పారిశ్రామిక కారిడార్లు వచ్చినట్లుగా రాష్ట్రంలో కూడా విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తాం. దక్షిణ భారతదేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కూడా బుల్లెట్ ట్రైన్ పరుగులు ఉంటాయి. రాయలసీమ రైతుల కరువు తీరుస్తాం.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఇక్కడ ఉద్యాన పంటల రైతులకు తగిన ప్రోత్సాహం ఇస్తాం. అత్యంత ఆధునిక కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. ఇప్పటికే పులివెందులలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ ను మొదలు పెడుతున్నాం. అలాగే చిత్తూరు ప్రాంత రైతులకు టమాటా ప్రాసెసింగ్ యూనిట్ అవసరం ఉంది. దీన్ని ఈ ప్రాంతంలో వచ్చేలా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు చూపించడం, యువ శక్తిని చక్కగా వినియోగించుకోవడంలో ఎన్డీఏ సర్కారు దృష్టి పెడుతుంది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను అలాగే రాజంపేట బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్, కడప పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావులను మంచి మెజారిటీతో ఢిల్లీ పంపిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

Leave a Reply