– పక్కదారి పట్టించే వారి పై కఠిన చర్యలు
– ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
– అర్హతలు ఉన్న వారికే 102 జతల జీవాల పంపిణీ
– కలెక్టర్ ఎం. హరిత
వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి అందించే కోడెలను సంరక్షించి.. వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు శుక్రవారం కోడెలను ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామి వారికి కోడెలను కట్టే సంస్కృతి వేములవాడ రాజ రాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో అధునాతన సౌకర్యాలతో 40 ఎకరాల్లో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని, అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
కలెక్టర్ ఎం హరిత మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు వాటిని వ్యవసాయ పనులకు వినియోగించాలని సూచించారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను పరిశీలించి కోడెలను పంపిణీ చేశారు. మొత్తం 102 జతల కోడెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు, గోశాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.