కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్‌

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈరోజు రాత్రి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్‌ తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరంగల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని పేర్కొన్నారు.

Leave a Reply