Suryaa.co.in

Andhra Pradesh

క్రీడల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు

-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 10: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద పబ్లిక్, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు, ఇతర సంస్థల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 34.35 కోట్ల రూపాయల నిధులు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ (ఎన్ఎస్‌డిఎఫ్‌)కు సమకూర్చినట్లు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ క్రీడాకారులు, క్రీడా సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర తమ మంత్రిత్వ శాఖ ఎటా అందించే నిధులకు అదనంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఎన్‌ఎస్‌డిఎఫ్‌కు నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్‌ ద్వారా కింద 43.88 కోట్ల రూపాయలు సమకూరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడా విభాగాల అభివృద్ధి నిరంతర ప్రక్రియని అన్నారు. తమ మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన స్పోర్ట్స్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీం, ఖేలో ఇండియా స్కీం సహాయంతో ఎన్‌ఎస్‌డిఎఫ్‌కు అదనంగా క్రీడాకారుల శిక్షణ, క్రీడల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని అన్నారు. ఎన్‌ఎస్‌డిఎఫ్‌ కింద 2023-24 బడ్జెట్లో 15 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

ఈ-శ్రమ్‌లో ఏపీ నుంచి 80 లక్షల అసంఘటిత కార్మికులు
న్యూఢిల్లీ, ఆగస్టు 10: అసంఘటిత కార్మికుల వివరాలతో సమగ్రమైన జాతీయ డేటా బేస్ రూపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఈనెల 3 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 80,03,442 మంది తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు.

రాజ్యసభలో గురువారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశవ్యాప్తంగా 28,99,63,420 మంది అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన లక్ష్యంగా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్‌ను ప్రతిబింబించే విధంగా దేశంలో దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న నిరుపేదల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపడుతూ వారి సమ్మిళిత వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం వారికోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు.

అందులో కొన్ని పథకాల కింద డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా నేరుగా లబ్దిదారులకు వనరులు, సంపద అందిస్తుండగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిషన్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్, గ్రామీణ కౌశల్య యోజన, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ సోషల్ ఆసిస్టెన్స్ ప్రోగ్రాం, పీఎం వీధి వర్తకుల ఆత్మనిర్బర్ నిధి స్కీం, శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్ ప్రోగ్రాం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, స్కిల్ ఇండియా, సన్సాద్ ఆదర్శ్ గ్రామ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, అటల్ పెన్సన్ యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండ్ అప్‌ ఇండియా స్కీం, ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజక, స్వచ్చభారత్ మిషన్ వంటి పథకాలు ద్వారా మౌలికసదుపాయాలు కల్పించి ఆదాయ మార్గాలు సృష్టిస్తోందని మంత్రి అన్నారు.

LEAVE A RESPONSE