– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపణ
అనంతపురం జిల్లా తాడిపత్రి దళిత సీఐ ఆనందరావు ఆత్మహత్యపై పలు ఆరోపణలు, అనుమానాలు వస్తున్నాయని, ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి సాక్షాధారాలను తుడిచేసినట్లు, ఆనందరావు ఆత్మహత్యకు సంబంధించిన లేఖను, ఫోన్ లో ఉన్న ఆధారాలను కూడా చెరిపేసారా? తుడిచేశారా? అని ప్రశ్నించారు.
స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆనందరావు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోందని, ఆయన కుమార్తె కూడా పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిడులతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి విచారణ చేయకుండానే కుటుంబ తగాదాలతో సంఘటన జరిగినట్లు జిల్లా ఎస్పీ ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? అని నిగ్గదీశారు.
ఐన దానికి, కాని దానికి స్పందించే పోలీసు బాసుల సంఘం ఆనందరావు ఆత్మహత్యపై ఎందుకు స్పందించటం లేదని పేర్కొన్నారు. ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను పొట్టన పెట్టుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆఖరికి దళిత పోలీసు అధికారులను కూడా పొట్టన పెట్టుకుంటుందని బాలకోటయ్య మండిపడ్డారు.