Suryaa.co.in

Telangana

దావోస్‌ సరే.. పాత పెట్టుబడులేమయ్యాయి?

-అప్పుడు అదానీని తిట్టి ఇప్పుడు ఆ కంపెనీతోనే ఒప్పందాలా?
-22న తెలంగాణలో సెలవు ప్రకటించరా?
-బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌

హైదరాబాద్: విదేశీ పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకే వెళ్తున్నారు తప్పితే తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే.. ఒకవైపు పెట్టుబడుల కోసం అదానీ బృందంతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పుకుంటారు. కానీ, ఆ పెట్టుబడులు ఎక్కడికి పోయాయనేదానిపై స్పష్టతనివ్వరని దుయ్యబట్టారు.

కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి అదానీ బృందంతో సమావేశమై.. తిరిగి అదానీ, అంబానీ, నరేంద్ర మోదీ పై రాజకీయ విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవపట్టించడంలో భాగమేనని, దీన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పెట్టుబడులు ఎక్కడికి వెళ్లాయో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు రాములు , మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ మాట్లాడిన ముఖ్యాంశాలు :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో భాగంగా దావోస్ లో పర్యటించి అదానీ గ్రూప్ తో సమావేశమై తెలంగాణలో రూ. 12 వేల కోట్ల మేర పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు.

ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు.. సమయమొచ్చినప్పుడల్లా బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అదానీ-అంబానీ, నరేంద్ర మోదీ గారి పట్ల దుష్ప్రచారం చేశాయి. దేశ సంపదను దోచిపెడుతున్నట్లుగా పదేపదే విమర్శిస్తూ ప్రకటనలు చేశాయి.

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే దావోస్ పర్యటనకు వెళ్లి అదానీ బృందంతో చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా చెప్పారు. కేటీఆర్ కూడా గతంలో తెలంగాణ ప్రతినిధిగా ఐదుసార్లు దావోస్ పర్యటనకు వెళ్లి రూ. 21 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నామని సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటనలు గుప్పించారు. అసలు ఆ పెట్టుబడులు ఎక్కడ పెట్టారనేది ఎవ్వరికీ తెలియదు.

మరి వీళ్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు వెళ్లేది పెట్టుబడులు తేవడానికా… లేదా పెట్టుబడులు పెట్టేందుకా..? దావోస్ సమావేశాల అంశంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండు పార్టీలు పోటీపోటీగా వ్యవహరించాయి. గతంలో కేసీఆర్ కూడా అదే అదానీతో ప్రత్యేకంగా సమావేశమై మంతనాలు జరిపారు. తర్వాత కేటీఆర్ కూడా అదానీ గ్రూప్ తో కలవడం, మంతనాలు జరిపడం.. అనంతరం భారతీయ జనతా పార్టీపై రాజకీయ విమర్శలు చేశారు.

అదే బీఆర్ఎస్ కోవలోనే మొన్న అదానీతో సమావేశమైన రేవంత్ రెడ్డితో పాటు.. కేసీఆర్, కేటీఆర్ గతంలో ప్రతి సభలో, బహిరంగ సభలో ఎక్కడికెళ్లినా అదానీ, అంబానీలకు మోదీ దోచిపెట్టారంటూ విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇదే రీతిలో భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారం.. ఒకవైపు పెట్టుబడుల కోసం అదానీతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పుకుంటారు. కాని, ఆ పెట్టుబడులు ఎక్కడికి పోయాయనేదానిపై స్పష్టత లేదు.

తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పెట్టుబడులు ఎక్కడికి వెళ్లాయో ఎందుకు చెప్పలేదు? విదేశీ పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పెట్టుబడులు పెట్టేందుకే వెళ్తున్నారు.. అంతేగానీ పెట్టుబడులు తేవడానికి కాదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అదానీ, అంబానీలను విమర్శిస్తూ.. మరోవైపు వారితో కలిసి సమావేశమై భోజనాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలను గమనించాలి.

జనవరి 22వ తేదీ.. యావత్ భారత జాతి ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న రోజు. అయోధ్యలో భవ్య, దివ్య మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం జరుగుతున్న క్రతువు ప్రారంభమైంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. భారతదేశ పౌరుల మనోభావాలను ఈ పార్టీలు ఏనాడు గౌరవించలేదు.

రాముడు జన్మస్థలం అయోధ్య అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి ముందడుగు వేసింది. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కళ్లు తెరవకుండా కుహనా లౌకికవాదం, అవకాశవాద ధోరణిని అవలంభిస్తూ విమర్శలు గుప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా భారత జాతికి క్షమాపణలు చెప్పాలని ఆ మూడు పార్టీలను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

ఇప్పటికే జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే గా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం జనవరి 22 వ తేదీ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని, చిరకాల వాంఛ నెరవేరుతున్న భారతీయుల మనోభావాలను గౌరవించేలా ఆ రోజున అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుదినంగా ప్రకటించాలి.

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నుంచి అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టాపన కోసం సంప్రదాయబద్ధంగా చేయాల్సిన సత్కార్యాలు, ఆభరణాలు, వస్త్రాలను అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE