హవ్వ… ఎస్సీ సామాజిక వర్గానికి ఏమీ చేయని జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవమా?!

– నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఎస్సీ సామాజిక వర్గానికి ఎటువంటి మేళ్లు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రజలంతా
దురదృష్టంగా భావిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘు రామ కృష్ణంరాజు అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను గల్లంతు చేసి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎత్తివేసి, ఎస్సీల సంక్షేమం కోసం నిర్దేశించిన 27 పథకాలను రద్దుచేసి, 7000 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించి, ఎస్సీ సామాజిక వర్గానికి ఆయన చేసిన అన్యాయానికి నష్టపరిహారంగా విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎస్సీ సామాజిక వర్గ యువత ఉపాధి అవకాశాల కోసం రుణాల మంజూరీకి నిర్దేశించిన 7000 కోట్ల నిధుల దారి మళ్లింపుపై హైకోర్టు కూడా కామెంట్ చేసిందన్నారు. ఇక అంతమాత్రానికి ఎస్సీ కార్పొరేషన్ అవసరమా అంటూ ప్రశ్నించిందని గుర్తు చేశారు. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ పబ్లిక్ గా రోదించే జగన్మోహన్ రెడ్డి, ఎస్సీలకు లబ్ధి చేకూర్చే 7వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించడం పట్ల వారు ఆగ్రహంగా ఉన్నారు. ఎస్సీలకు ఎంతో అన్యాయాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం వారు శాంతిస్తారా? విగ్రహ ఏర్పాటు వారి ఆగ్రహం పై నీళ్లు చల్లుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? అంటూ రఘురామ కృష్ణంరాజు నిలదీశారు .

డాక్టర్ సుధాకర్ ని ఈ ప్రభుత్వం దారుణంగా చంపివేసింది. సుబ్రహ్మణ్యం ను దారుణంగా హత్య చేసి, ఆయన ఇంటికి శవాన్ని పార్సిల్ చేసిన వారు ప్రస్తుతం బెయిల్ పై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పై అనుకోని చిలిపి ప్రయోగాన్ని చేసిన శ్రీను అలియాస్ కోడి కత్తి శ్రీను ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై ఉంటే, కోడి కత్తి శ్రీనుకు కనీసం బెయిల్ అయినా వచ్చి ఉండేది. కోర్టుకు హాజరు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎంతో నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.

హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా దళిత యువకుడు కిషోర్ ను చంపివేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా దళితున్ని దారుణంగా హత్య చేశారు. ఇలా చరిత్రలో గతంలో ఎన్నడూ లేనన్నీ దారుణాలు దళితులపై రాష్ట్రంలో జరుగుతుంటే పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా , అంబేద్కర్ వంటి మహనీయుడు విగ్రహ ప్రతిష్ట జరగడం అన్నది… ఏమో ఇట్స్ నాట్ గుడ్ టేస్ట్. ఫాలో చేయాలి తప్పదనుకోండని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి ఎంత న్యాయం చేశారో… వీ సీ ల, ప్రభుత్వ సలహాదారుల నియామకాన్ని పరిశీలిస్తే తెలిసిపోతుంది
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత న్యాయం చేశారో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ల నియామకాన్ని, ప్రభుత్వ సలహాదారుల నియామకాన్ని, ప్రభుత్వం ప్లిడర్ల నియామక జాబితాను పరిశీలిస్తే తెలిసిపోతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.. వైస్ ఛాన్స్లర్ల, ప్రభుత్వ సలహాదారుల, ప్రభుత్వ ప్లీడర్ల జాబితా ను ఒక్కసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీలపై ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు, వాలంటీర్లను రంగంలోకి దించి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందేనని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో ఎక్కాల్సిందేనని లేకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ బెదిరింపులకు దిగడంసిగ్గుచేటు.

ప్రజాధనంతో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తన రాజకీయ స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రచారంగా వాడుకోవాలని చూస్తున్నారు. అంబేద్కర్ స్మృతి వన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాన్ని చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఏదైనా విగ్రహాన్ని ఆవిష్కరిస్తే, ప్రారంభించిన వారి పేరు పక్కనే శిలాఫలకంపై రాయడం అనేది సర్వసాధారణం. కానీ విజయవాడలో అంబేద్కర్ పేరుతో సమానంగా విగ్రహం పైనే జగన్మోహన్ రెడ్డి పేరును రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంబేద్కర్ అనే మహానుభావుడు ఎక్కడ… జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అని ప్రశ్నించారు. తనకున్న పైత్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా చాటుకున్నారని మండిపడ్డారు.

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయడం కాదు… ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించాలి
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదివి దాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా, సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ఒక పార్లమెంటు సభ్యుడన్న గౌరవం లేకుండా హింసించి జగన్మోహన్ రెడ్డి ఆనందించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించే ముందే ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదివి, దాన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి. అదే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ సభలో ఆ… చంద్రబాబు నాయుడు, దత్త పుత్రుడు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 దుష్ట చతుష్టయమనే వెకిలి మాటలను మాట్లాడవద్దు. అంబేద్కర్ గురించి మీకేమైనా నాలుగు మాటలు తెలిస్తే, చెప్పండి. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభను రాజకీయ సభగా మల్చకండి. ఎస్సీ సామాజిక వర్గానికి ఎంతో చేశానని అబద్దాలను చెబితే చెప్పుకోండి కానీ, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన అక్రమ కేసులను ప్రస్తావించి, సభకు రాజకీయ రంగు పులమకండి.

మీకు అంబేద్కర్ గురించి తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పి, అంబేద్కర్ రిస్టులను నాలుగు మంచి మాటలు మాట్లాడనివ్వండి . గతంలో మిమ్మల్ని గాంధీతో, పూలేతో పోల్చారు. ఇప్పుడు కొంతమంది అభినవ అంబేద్కర్ అని కూడా కీర్తిస్తారు. పాటలను కూడా పాడుతారు. దానికి మేము మానసికంగా సిద్ధమయ్యే ఉన్నాము. అభినవ అంబేద్కర్ అని మిమ్మల్ని కీర్తించే వారి కోసమైనా ముందు రాజ్యాంగాన్ని చదివి అంబేద్కర్ ను గౌరవించడం నేర్చుకోవాలని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.

అంబేద్కర్ ను గౌరవించాల్సిందే … కానీ కిక్కిరిసిన రోడ్ల మధ్య విగ్రహ ఏర్పాటే బాధ కలిగిస్తోంది
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెలంగాణలోనూ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అమరావతి నగరంలో 100 ఎకరాలలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రాబోయే మహానగరంలో విశాలమైన ప్రాంగణంలో అంబేద్కర్ స్మృతి వనం ఉండి ఉంటే ఎంతో బాగుండేది.

విజయవాడ అసలే ఇరుకునగరం. నగరం నడిబొడ్డులో ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్, దానికే ఆ తరువాత స్వరాజ్ మైదానంగా నామకరణం చేశారు. ఈ మైదానంలో జరిగిన సభ లలో పండిట్ జవహర్లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ వంటి మహా నాయకులు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అనంతరం ఎన్టీ రామారావు కూడా ఈ మైదానంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తొలి రాజకీయ ప్రసంగాన్ని చేశారు. నగరంలో ఎటువంటి ఎగ్జిబిషన్లు జరగాలన్న 20 ఎకరాల లో విస్తరించిన పిడబ్ల్యుడి గ్రౌండ్స్ మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం ఒక సామాజిక వర్గం పై ద్వేషంతో, అంబేద్కర్ పై జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉన్నదో లేదో కూడా తెలియదు.

అమరావతి నగరానికే అందం తెచ్చే అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టును, విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడమన్నది సబబుగా లేదు. అమరావతి నగరంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఆయన విగ్రహానికి కూడా వన్నె చేకూరేది. అమరావతి నగరం అంటేనే బౌద్ధుల ఆరామాలకు నిలయం. అక్కడ ఎంతోమంది బుద్ధుని అనుచరులు ఉండేవారు. ఇప్పటికీ బౌద్ధ గురువుల అమరావతిలో నివసించినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అంబేద్కర్ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంబేద్కర్ స్మృతి వనం అమరావతి నగరంలో ఉంటే ఆయనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చినట్లుగా ఉండేది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న చిన్న ప్రదేశంలో రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విగ్రహానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా చూపెట్టారు. విగ్రహం కోసం ఖర్చు అయ్యింది ఎంతో తెలియదు. 206 అడుగుల విగ్రహాన్ని అంత చిన్న స్థలంలో, కిక్కిరిసిన రోడ్ల మధ్య ఏర్పాటు చేయడం బాధ కలిగిస్తోంది . ఎంతోమందికి అందుబాటులో ఉండేలా సుందరమైన ప్రదేశంలో ఏర్పాటు చేయలేదన్న నిరాశలో అంబేద్కర్ అభిమానులు ఉన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరికీ మేనమామ అయిన జగన్మోహన్ రెడ్డి సొంత మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలలో ఉన్నది కేవలం రెండు నిమిషాలే
రాష్ట్ర ప్రజలందరికీ మేనమామ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలలో మాత్రం కేవలం రెండు నిమిషాల ఒక్క సెకండ్ మాత్రమే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కనీసం 10 నిమిషాల నుంచి పావుగంట సేపు అయినా ఉండి ఉంటే బాగుండేదని జనం అనుకుంటున్నారన్నారు. వారికి, వారికి మధ్య ఏమున్నాయో మనకు అనవసరమని పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని మేనల్లుడి వివాహ వేడుకలకు హాజరు కావడానికి 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఈ ఖర్చు అంతా సొంతంగా పెట్టుకుంటారా?, లేకపోతే ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారా?? అన్నది తెలియదు. నిండా మునిగిన వాడికి చలి ఏమిటి అన్నట్లు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి, ఈ ఖర్చు ఓ లెక్క అని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

నేను వేసిన ఏ పిటిషన్ ను కోర్టు కొట్టి వేయలేదు… ఇది జగన్ విజయమని సాక్షి దినపత్రిక రాసుకున్న ప్రయోజనం సున్నా
సుప్రీంకోర్టులో నేను దాఖలు చేసిన ఏ పిటీషన్ ను కోర్టు కొట్టి వేయలేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికి దక్కిన విజయమని సాక్షి దినపత్రికలో రాసుకున్న ప్రయోజనం సున్నా అని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పై నమోదు చేసిన కేసులను త్వరగా విచారించాలని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ పిటిషన్లపై దాఖలైన కేసులో శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించే ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ లు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి తరుపున వాదనలను వినిపించారు. అలాగే వైకాపా పార్లమెంట్ సభ్యుడు ఎస్. నిరంజన్ రెడ్డి కూడా న్యాయవాద బృంద సభ్యునిగా ఉన్నారు. సిబిఐ తరఫున తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి హైకోర్టులో కేసులను వేగవంతం చేయాలని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసుల విచారణ కచ్చితంగా వేగమంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేయాలని దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు అభ్యర్థించిన సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ముఖ్యమంత్రిగా ఉన్నాడు… కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని పేర్కొనడం సమంజసమేనా అని న్యాయస్థానం ప్రశ్నిస్తూనే , ప్రస్తుతం ఈ కేసులను వేరే కోర్టుకు బదిలీ చేయడం లేదని చెప్పారు. అదే పనిగా జాప్యం జరిగితే కేసుల బదిలీ ప్రక్రియపై ఒక నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం అభిప్రాయపడింది. డిస్పోజల్ కేసులను అదే పనిగా జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ పరోక్షంగా సిబిఐ న్యాయస్థానానికి చురక అంటించారు. ఇంకా ఆ మహానటుడి నటనకు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.

హైకోర్టులో త్వరితగతిన కేసులు తేలేక పోతే వేరే కోర్టుకు బదిలీ చేయాలని మాత్రమే నేను కోరడం జరిగిందన్న రఘురామ కృష్ణంరాజు .. వేరే కోర్టుకు కేసులు బదిలీ చేయడం అంటే రెడ్డి వచ్చే ఆట మొదలు అన్నట్లుగా పరిస్థితి నెలకొంటుందన్నారు . ఇక్కడ వినే ఇంట్రెస్ట్ లేనప్పుడు, కేసులను పరిష్కరించే ఆసక్తి లేకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితిలో కేసులను వేరే కోర్టుకు బదిలీ చేయమని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. కేసుల విచారణను స్పీడ్ అప్ చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు లిస్ట్ చేయమని న్యాయ మూర్తి ఆదేశించారు. మూడు నెలల లోగా కేసులలో ఎటువంటి పురోగతి లేకపోతే, సీనియర్ న్యాయవాదులు ఎటువంటి కహానీలు చెప్పడానికి వచ్చినా తగు చర్యలు ఉండవచ్చనేది మన ఆశ అని ఆయన పేర్కొన్నారు.

ఈ మూడు నెలలలోగా కోర్టు మేల్కొంటుందా?, కేసులను టేకప్ చేయాలని సిబిఐ అధికారులు అడుగుతారా? అనేది చూడాలన్నారు. డిస్పోజల్ పిటిషన్ వచ్చినప్పుడు వెంటనే డిస్పోజల్ చేయాలి కదా??, సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టాల్సిన అవసరం ఏముంది?, లేకపోతే డిస్పోజల్ చేయమనైనా చెప్పాలి కదా అంటూ న్యాయమూర్తి, సీబీఐ తరఫున న్యాయవాదిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలను కూడా ఏప్రిల్ రెండవ వారంలోగా కేసు లిస్ట్ అయినప్పుడే కలిపి వింటామని చెప్పారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Leave a Reply