– మేధావుల కమిటీని తుంగలో తొక్కి నారాయణ కమిటీ వేసి బాబు తప్పు చేశాడు
– విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఇప్పటికీ చట్ట బద్ధత ఉంది.
– అందుకే ముఖ్యమంత్రి జగన్ ఆ చట్టానికి అనుగుణంగా వికేంద్రీకరణ నిర్ణయం
– రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం
– ఈ చట్టాన్ని అమలు చేయకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
– మీ తాబేదార్ల భూములు కొనేసి రాజధానిని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు
– తొమ్మిది యేళ్లు అవుతున్నా రాజధానిపై స్పష్టత లేక పోవడానికి కారణం చంద్రబాబే.
– విశాఖ రాజధానిగా వద్దనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..?
– మా పీక కోస్తామంటే ఎందుకు ఒప్పుకుంటాం..?
– శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ చేయమని ఎప్పుడో చెప్పింది
– రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
బాబే కారణం..
విభజన సమయంలో నియమించిన మేధావుల కమిటీ సూచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. విభజన కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ఇప్పటికీ చట్టబద్ధత ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణే తమ నినాదం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోమారు స్పష్టం చేశారు. మేధావుల కమిటీ సూచనలను చంద్రబాబు తుంగలో తొక్కి.. తన కేబినెట్ మంత్రి నారాయణతో కమిటీ వేసి తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్లే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ గా మిలిగిపోయిందని ధ్వజమెత్తారు. 9 ఏళ్ళు అయినా రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణం అన్నారు.
రాజమండ్రిలో 3 రాజధానుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న అమరావతి నిర్మాణానికి పదిలక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తేలిందని, అంత మొత్తం ఓ రాజధాని నిర్మాణానికి వెచ్చించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ అనే కాదు, ఏ రాష్ట్రమైనా ఇప్పటికిప్పుడు పది వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నాయని అన్నారు.
చంద్రబాబు తన సొంత మనుషుల లబ్ధి కోసమే అమరావతి ప్రతిపాదనను బలపరుస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మేధావులు ఆలోచించాలని కోరారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఎందుకు అన్న విషయమై మాట్లాడుతూ.. విశాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మీ ప్రాంతంలో అడుగు పెట్టడానికి వీలులేకుండా మేం ఇక్కడ విదేశీ పౌరులుగా ఉండాలా అని ప్రశ్నించారు. క్యాపిటల్ కోసం 55 వేల ఎకరాలు ఎందుకు.? అని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబు నిర్ణయాల కారణంగా తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. సహేతుకత లేని నిర్ణయాలు వల్లే ఇదంతా జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను బాబు ఫణంగా పెట్టారు
చంద్రబాబు కేవలం తన ప్రయోజనాల కోసమే… రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని అన్నారు. అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణానాకి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, అంత మొత్తం ఒక ప్రాంతం అభివృద్ధికోసం వెచ్చిస్తే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి అని ప్రశ్నించారు. తాము మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని, మళ్లీ మరో 70,80 ఏళ్ల పాటు వెనుకబాటును భరించేందుకు సిద్ధంగా లేమని, అభివృద్ధి వికేంద్రీకరణే మా పాలసీ అని స్పష్టంగా చెప్పామని, దీనినే ఆచరిస్తూ ప్రజాభిప్రాయం స్వీకరించేందుకు జన సమూహాల ముందుకు వెళ్తామన్నారు.
చంద్రబాబు మాయలో పడవద్దు
విశాఖ పరిపాలన రాజధాని వద్దని.. మీరు పాదయాత్ర చేస్తుంటే .. మేం నోరు మూసుకుని కూర్చోవాలా..? చంద్రబాబు తన పాలనలో.. శ్రీకాకుళానికి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇవ్వలేదు. శివరామకృష్ణన్ కమిటీని తుంగలో తొక్కి…అమరావతిని తెర మీదకు తెచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు అంతా మాయ చేశారు. అబద్దాలాడారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని…చంద్రబాబు అండ్ కో మాట్లాడటం తప్పు. అమరావతిలో క్యాపిటల్ వద్దని ప్రభుత్వం చెప్పట్లేదు..అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అందులో సందేహమే లేదు.
29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు. పాలకుల కృషితో.. రాష్ట్ర సంపద అన్నది అందరికీ చెందాలి. ఒక రాష్ట్ర జనాభా సొమ్ము అంతా తీసుకుని వెళ్ళి 29 గ్రామాలని అభివృద్ది చేయడానికి పెట్టాలా? లేదా అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధానిగా, చేసుకుని ఇంకొంచెం సదుపాయాలు పెంచి,అక్కడ నుండి వచ్చే రెవెన్యుని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధికీ ఉపయోగించాలా ? ఏది ఈ రాష్ట్రానికి మంచిది ? అన్నది అంతా ఆలోచించాలన్నారు.
రాష్ట్ర ప్రజలు రాజధాని రైతు ఉద్యమం పేరుతో నడుస్తున్న సెంటిమెంట్ రాజకీయాలకు అతీతంగా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. హైదరాబాద్‌లో 75 ఏళ్లు పెట్టుబడి పెట్టి..మనమంతా అభివృద్ది చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఆనాడే పెట్టుబడులు పెట్టి ఉంటే.. విభజన జరిగేది కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తరువాత..మనం తప్పు చేశామని గ్రహించాం..మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెడితే..హైదరాబాద్‌లో చేసిన తప్పే చేసినట్లు అవుతుంది. పెట్టుబడులు కేంద్రీకృతం కాకూడదనేది..ప్రపంచమే చెబుతోంది అని ధర్మాన వివరించారు.
అమరావతిపై బాబు స్వార్థానికి అదే కారణం..!
అన్ని ప్రాంతాలకు అనుకూలమైన..మోడల్ గా రాజధాని ఉండాలని శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే మోడల్‌ను..చంద్రబాబు ఎందుకు అంగీకరించడం లేదు. రాజధాని పేరిట 33వేల ఎకరాల భూములును సేకరించి..వాటి చుట్టూ మీరూ,మీ బంధువులు,మీ బినామీలు..మీ పార్టీ నేతలకు కొనిపెట్టారు. ఇదే కదా! మీ స్వార్థం. చంద్రబాబు స్వార్థం ప్రజలకు ఇవాళ తెలుస్తోంది. ప్రజలు గుడ్డి వాళ్లు కాదు. మా ప్రతిపాదనలు అనుసరించి, మా నిర్ణయాలను అనుసరించి అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది.
అమరావతిలో రాజధాని లేదని చంద్రబాబు ఎలా చెబుతారు..?! ఏదేమయినప్పటికీ ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి…అమరావతిని తెర మీదకు తెచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు మాయ చేశారు. అబద్దాలాడారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని…చంద్రబాబు అండ్ కో మాట్లాడటం తప్పు. అమరావతిలో క్యాపిటల్ వద్దని ప్రభుత్వం చెప్పట్లేదు.. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అదేవిధంగా విశాఖకు పరిపాలన సంబంధ రాజధాని వద్దు అని చెప్పడం బాధాకరం.. రాయలసీమకు న్యాయ రాజధాని వద్దు అని చెప్పడం బాధాకరం.
జీడీపీలో మన శ్రీకాకుళం జిల్లా షేర్ ఏంటో చెప్పండి..శ్రీకాకుళం జిల్లా ఇవాళ్టికీ వెనుకబడే ఉంది. ఈ సమాజంలో ఎవ్వరూ గౌరవించని పనులు మా ప్రాంతం వాళ్లు చేస్తున్నారు. ఇలా ఎంత కాలం వెనుకబాటుతనంతోనే ఉండిపోవాలి. ఆ విధంగా మా పీక కోసే పనిచేస్తామంటే మాకు అంగీకారం కాదు.. అని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.