Suryaa.co.in

Andhra Pradesh

బీసీల రుణం తీర్చుకునేందుకే డిక్లరేషన్

-50 ఏళ్ల నిండిన వారికి నెలకు రూ.4 వేల పెన్షన్
-సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు
-బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదు…నాగరికతకు మూలం బీసీలే
-నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీసీలంతా సహకరించాలి
-బీసీలను జగన్ తన పల్లకీ మోసే బోయీలుగా చూస్తున్నాడు
-పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటివారిని మార్చని జగన్…బీసీ నేతలను బదిలీ చేశాడు
-జగన్ పాలనలో సామాజిక న్యాయం కాదు..బీసీలపై గొడ్డలి వేటు
-జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటన

మంగళగిరి : ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 10 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం, ఆచార్య నాగార్జు యూనివర్సిటీ ఎదురు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంగళవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….‘‘టీడీపీకి 40 ఏళ్లుగా అండగా ఉన్న బీసీల రుణంతీర్చుకునేందుకే డిక్లరేషన్ ప్రకటించాం. జ్యోతీరావుపూలే ఆశయాలను పాటించిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నేడు చిరస్థాయిగా నిలిచిపోతుంది. టీడీపీ-జనసేన పార్టీలు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాయని చెప్పేందుకే సమిష్టిగా డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నాం. జయహో బీసీ అనేది అందరి నినాదం…విధాననం కావాలి. 153 కులాలతో 56 సాధికార కమిటీలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించాం. తెలుగుదేశం-జనసేన నాయకులతో చర్చించి చరిత్ర తిరగరాయబో బీసీ డిక్లరేషన్ ను మీ ముందుకు తీసుకువచ్చాం. బీసీల జీవితాల్లో ఒక వెలుగు వచ్చే విధాంగా ముందుకు వెళ్తున్నాం. బీసీల డీఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది.

50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4 వేల పెన్షన్
మన ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఫించను విధానాన్ని రూ.35తో కి ఎన్టీఆర్ ప్రారంభించారు. దాన్ని రూ.70 కి నేను పెంచాను. తర్వాత రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచిన టీడీపీనే. ఇప్పుడు రూ.3 వేలు ఉన్న పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా రూ.1.50 కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేసే బాధ్యత మాది.

దొంగ లెక్కలు చూపించి నిధులను దొడ్డు దారిని మళ్ళించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 25 శాతం నుండి 34 శాతానికి పెంచాం. కానీ జగన్ రెడ్డి 34 శాతాన్ని 24 శాతానికి తగ్గించడంతో 16,800 పదవులు బీసీలు కోల్పోయారు. నాయకత్వం అనేది రాత్రికి రాత్రే రాదు. అనునిత్యం కష్టపడేత తప్ప సాధ్యం కాదు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉండటం వల్ల పేదరికంలోనే మగ్గుతున్నారు. అందువల్ల రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లు పెట్టి నాయకులను తయారుచేసిన పార్టీ టీడీపీ.

చట్ట సభల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టేంతవరకు మీ తరుపున మేము పోరాడుతాం. ఎవరికైనా రాజకీయంగా ప్రాముఖ్యతివ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత మాది. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతకముందు అర్హత లేదు…ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తాం. పాత చట్టాన్ని రద్దు చేస్తాం.

చట్టబద్ధంగా కులగణన
చట్టబద్దంగా కులగణన నిర్వహించాలి. వెనుకడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థతిని అధ్యయనం చేయాలి. అందరికీ సముచితమైన స్థానం రావాలి. జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎక్కువ ప్రాముఖ్యతినిచ్చి వారిని పైకి తీసుకురావాలనేదే మా ఆలోచన. ఆర్థిక అసమానతను తగ్గించడానికి ప్రయత్నిస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం 300 మందిని పొట్టన బెట్టుకుంది. వేల మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్న బీసీలను అణచివేసే ధోరణి.

అందుకే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. నా బీసీల జోలికి ఎవరైనా వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండని హెచ్చరిస్తున్నా. ఈ చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఆర్థికాభివృద్ధి కోసం, జనాభా ఒక పక్క, బీసీల వెసులుబాటును తీసుకొని ఐదేళ్ళలో రూ.10 వేల కోట్లతో నిధిని కేటాయించి..పరిశ్రమలు పెట్టాలన్న, ఆర్థికంగా పైకి రావాలన్న, ఆధునిక పనిముట్లు రావాలన్నా పారిశ్రమిక ప్రోత్సహకాలు కల్పిస్తాం.

బీమా ద్వారా రూ.10 లక్షల పరిహారం
గతంలో అమలు చేసిన విద్యా పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తాం. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌ని జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్యను ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలనుకున్నా అవకాశాన్ని కల్పిస్తాం. పీజీ విద్యార్ధులకు కూడా ఫీ రీఎంబర్స్‌మెంట్ పునరుద్దరిస్తాం. స్టడీ సర్కిల్, విద్యోన్నత పథకాలను తిరిగి ప్రారంభిస్తాం. చంద్రన్న భీమా కింద మట్టి ఖర్చులకే కాకుండా గతంలో రూ.5 లక్షలు మీ ఇంటికి పంపించే వాళ్ళం. ఈసారి నుండి ఎవరు చనిపోయినా రూ.10 లక్షలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. పెళ్ళి కానుకను పుణప్రారంభిస్తాం. ఘనంగా పెళ్లి చేసేందుకు రూ.1 లక్ష అందిస్తాం.

లంచం తీసుకొని కుల ధృవీకరణ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత కుల ధృవీకరణ ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుడుతాం. పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం-జనసేన పార్టీది. 10 సూత్రాలతో వెనుకబడిన వర్గాల వారి కోసం బీసీ డిక్లరేషన్ ను తీసుకువచ్చాం. మీ దశా దిశా మార్చడానికి ఇదొక అవకాశం. 40 ఏళ్లుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి జయహో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ను ప్రకటించాం.

బీసీలు లేకపోతే నాగరికత లేదు
బీసీల్లో ఉన్న 153 కులాలు…మీరు లేకపోతే నాగరికత లేదు. మీరు లేకపోతే సమాజహితం లేదు. ఈరోజు నాగరికతకు, మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నం వెనుకబడిన వర్గాలే. రజకులు బట్టలు ఉతకపోతే మనం ఇంత బాగా కనపడము. అలాంటి రజకులకు ఇబ్బందులు ఉన్నాయి. వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుకుంటున్నారు. తప్పకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటాం. చెరువులు, దోబీ గాట్లపై మీకు హక్కులు ఉండేవి. ఇస్త్రీ పెట్టులివ్వడం ఈ ప్రభుత్వం మానేసింది.

దోభీ ఘాట్లకు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తే…దాన్ని కూడా రద్దు చేశారు. బంజరు భూముల్లో పశువులను మేపుకొనడానికి 559 జీవోను ఇస్తే దానిని నేడు అమలు చేయడం లేదు. తప్పుకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలో అది చేస్తాం. వడ్డెర కులస్తులు రాళ్లను కొట్టే వృత్తిగా పెట్టుకొని జీవితాలు సాగిస్తూ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. దీని కోసం మేము మద్దతుగా ఉంటాం. మత్య్సకారులకు నష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవోను రద్దు చేస్తాం. చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు…మన ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ రద్దు చేస్తాం. ప్రతి కులానికి నిధులు కేటాయించి ఆర్థికంగా బలపరిచేందుకు బాధ్యత తీసుకుంటాం.

ఈ సభలో ఉన్న ప్రతీ ఒక్కరు ఈ ప్రభుత్వ బాధ్యులే. అచ్చెన్నాయుడును 80 రోజులు జైల్లో పెట్టారు. ఎక్కడో హత్య జరిగితే కొల్లు రవీంద్రపై హత్యకేసు పెట్టి జైల్లో పెట్టారు. యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు వంటి వారిపై కూడా కేసులు పెట్టారు. బీసీ నాయకుల అందరిపై కేసులు పెట్టారు. నేను, పవన్ కళ్యాణ్ కూడా బాధితులమే. 40 ఏళ్లలో ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదు. బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ టీడీపీ. బీసీ నాయకత్వంపైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైసీపీ. జగన్ రెడ్డి కుటుంబ వ్యవస్థ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. రాష్ట్రాన్ని పెద్దిరెడ్డి దోచుకుంటున్నాడు. గనులు, లిక్కర్, ఒకటి కాదు ఏది దొరికితే అది దోచుకునే వ్యక్తిని మార్చే శక్తి జగన రెడ్డికి ఉందా?

బీసీలను ఊచకోత కోసిన జగన్ రెడ్డి
వెనుకబడిన వర్గాల్ని ఊచకోతకు కోసినటు వంటి పల్నాడు నాయకులను మార్చగలిగే శక్తి మీకు ఉందా? 18 మంది బీసీ నాయకులను చంపారు. చంద్రయ్యను చంపేముందు జై జగన్ అను నిన్ను వదలిపెడతామన్నారు…ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలొదిడాడు. ఇలాంటివి ఏ విధంగా మరచిపోగలం? నేను చంద్రయ్య పాడి మోశాను. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే టీడీపీ నాయకున్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దారుణంగా చంపించాడు. ఆ ఎమ్మెల్యేకి సీటు ఎందుకిచ్చారు.? తిరుపతిలో ఒకాయనను పెద్ద ఎత్తున ఎర్రచందనం వ్యాపారం చేశాడు…ఆయన్ను తెచ్చి ఒంగోలు ఎంపీగా పెట్టారు. వీరప్పన్ మాదిరిగా ఈ భాస్కరన్ తయారయ్యాడు.

రాష్ట్రంలో నలుగురు రెడ్లను పెట్టుకొని పెత్తందారీ వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాలను అణచివేసే మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్ మోహన్ రెడ్డికి లేదు. సామాజిక న్యాయం కంటే సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో అన్నివిధాలా వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొస్తాం.

బీసీలంటే నీ పల్లికీ మోసే బోయీలునుకున్నావా జగన్.?
బీసీలంటే జగన్ రెడ్డికి పల్లకీలు మోసే బోయీలని అనుకుంటున్నాడు. కాదని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు. బ్యాక్ బోన్ సొసైటి అని నిరూపించడానికే ఈ జయహో బీసీ. వైసీపీ అన్యాయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేను, పవన్ కల్యాణ్ సమాజం కోసం కలిశాం. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఈ కలయిక పెట్టుకోలేదు.

అధికారం కోసం పవన్ కలవలేదు. ఏపీ హితం కోసం…రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కలిశాం. భావితరాల భవిష్యత్తు కోసం పోరాడేందుకు మేము ధర్మపోరాటం చేస్తున్నాం. పవన్ తో కలిసి మూడు మీటింగ్ లు ఏర్పాటు చేశాం…మూడు మీటింగులకే వైసీపీ గజగజలాడుతోంది. వైసీపీకి ఓటమి తప్పదు. ఇంకో రెండు మూడు మీటింగులు జరిగితే వైసీపీ అడ్రస్ గల్లంతు అవుతుంది. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు.

మంగళగిరి వాసులకు ఈ హామీలిస్తున్నాం….
మంగళగిరిలో ఉండే ప్రతి ఒక్కరికీ పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇస్తాం. పేదలకు 20 వేల టిడ్కో ఇల్లు నిర్మిస్తాం. మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా, ఆదాయం పెంచే కార్యక్రమాన్ని లోకేష్ చేశారు. టాటా సంస్థ భాగస్వామ్యంతో వీవర్స్ శాల పెట్టి ఆదాయం రెట్టింపు చేశారు. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. తాడేపల్లి పరిధిలో యూ-1 ఎత్తేస్తాం. తద్వారా మీ భూములు మీరు యథేచ్ఛగా అమ్ముకోవచ్చు. రాబోయే ఎన్నికలు చాలా కీలకం. ఐదు కోట్ల భవిష్యత్తుకై పవన్, నేను పోరాడుతున్నాం. సూపర్ -6 కింద అన్ని వర్గాలను ఆదుకుంటాం. ఇచ్చిన హామీలను ఐదేళ్లలో చిత్తశుద్ధితో అమలు చేస్తాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.

బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాలు
1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్‌ అమలు చేస్తాం. పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచుతాం.
2. ప్రత్యేక రక్షణ చట్టం : జగన్‌ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణ చట్టం’ తీసుకొస్తాం.
ఎ) సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.
3. బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
ఎ) వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
4. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను వైసీపీ ప్రభుత్వం
34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.
ఎ) చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
బి) అన్ని సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34% రిజర్వేషన్‌ అమలు.
సి) తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం.
5. ఆర్ధికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం
ఎ) జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
బి) దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.
సి) స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
డి) జగన్‌రెడ్డి ‘ఆదరణ’ లాంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.
ఈ) మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్‌ వర్క్‌ షెడ్స్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తాం.
ఎఫ్‌) జగన్‌ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం.
6. చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం
7. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు
8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
9. విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం
ఎ) నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్‌ స్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేస్తాం.
బి) షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.
సి) పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పునరుద్దరిస్తాం.
డి) స్టడీ సర్కిల్‌, విద్యోన్నతి పథకాలు పున:ప్రారంబిస్తాం.
10. బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం

LEAVE A RESPONSE