– గిరిజన మహిళల చీరలు చింపి కొట్టడం కాంగ్రెస్ రాక్షసత్వానికి నిదర్శనం
– హింసాత్మక మనస్తత్వం ఉన్న రేవంత్ రెడ్డి అధికార మదంతో చేసిన రాక్షసచర్య
– తనను ప్రశ్నించే మహిళలను వివస్త్రను చేస్తానని అసెంబ్లీలో బహిరంగంగా రేవంత్ రెడ్డే ప్రకటించినప్పుడు ఇలాంటి దారుణాలే జరుగుతాయి
– ఒక గుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగానే మారుతుంది
– రాహుల్ గాంధీ వాగ్ధానం చేస్తున్న న్యాయం, సమానత్వం అంటే బుల్డోజర్ సంస్కృతేనా?
– కాంగ్రెస్ పార్టీ తన గుర్తును హస్తం నుంచి బల్డోజర్ కు మార్చుకోవాలి
– గిరిజనల మహిళలను వివస్త్రలను చేసి హింసించిన అధికారులను సస్పెండ్ చేయాలి
– ఖర్గే, రాహుల్ గాంధీలు క్షమాపణలు చెప్పాలి
– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్ : భద్రాచలం-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామంలో గిరిజన మహిళలపై అటవీ అధికారులు చేసిన అమానుషమైన దాడిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు తీవ్రంగా ఖండించారు. గిరిజన మహిళల చీరలను చింపి, నిర్దాక్షిణ్యంగా కొట్టడం క్రూరత్వం అన్నారు.
ఒక గుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే, ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగానే మారుతుందన్న కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు దాడికి పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
అధికార మదం, అహంకారంతో రేవంత్ ప్రభుత్వం చేసిన రాక్షసచర్య అని మండిపడ్డారు. తనను ప్రశ్నించే మహిళలను వివస్త్రను చేస్తానని అసెంబ్లీలో బహిరంగంగా రేవంత్ రెడ్డే ప్రకటించినప్పుడు, ఆయన ప్రైవేటు సైన్యం లాగా పనిచేస్తున్న అధికారులు కూడా అలానే ప్రవర్తిస్తారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఈ అనాగరిక చర్య తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవంపై ప్రత్యక్ష దాడి అన్న కేటీఆర్, 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టాలనుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి పాతరవేయడమేనని విరుచుకుపడ్డారు. తమ నోటికాడి బువ్వ గుంజుకోవద్దని ప్రాథేయపడిన నిస్సహాయ స్త్రీల పై దాడి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నైతిక పతనానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రశ్నించే వారిపై బుల్డోజర్లను పంపి రేవంత్ రెడ్డి పాలిస్తున్నాడన్న కేటీఆర్, తన గుర్తును హస్తం నుంచి బల్డోజర్ కు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. రాహుల్ గాంధీ వాగ్ధానం చేస్తున్న న్యాయం, సమానత్వం అంటే బుల్డోజర్ సంస్కృతేనా అని ప్రశ్నించారు. మానవీయ విలువలకు ఘోరి కట్టిన ఈ అవమానకర సంఘటనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తమ భూముల్ని కాపాడుకోవాలనుకున్న గిరిజన మహిళలపై నిర్దాక్షిణ్యంగా సాగిన ప్రభుత్వ దమనకాండ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసాత్మక మనస్తత్వానికి ప్రతిబింబమని కేటీఆర్ విమర్శించారు. ఇరవైండి గిరిజనులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్, అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.