Suryaa.co.in

Andhra Pradesh

సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు

– స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి

విజయవాడ : చర్చలతోనే ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకోవాలని.. సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి తెలిపారు. కొత్త పీఆర్సీతో ఏ ఒక్క ఉద్యోగికి జీతం తగ్గలేదని, పే స్లిప్ లో ఉద్యోగుల జీతం వివరాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో వివిధ కార్మిక, ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఛైర్మన్ గౌతంరెడ్డి మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్, ప్రజా రవాణా శాఖ వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, గవర్నమెంట్ ప్రెస్ యూనియన్, ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయిస్, కేంద్రప్రభుత్వ ఆర్గనైజేషన్ ఎన్ఏసీ, తదితర సంఘాలన్నీ ఉద్యోగస్తులు నిర్వహించతలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంలో గానీ, సమ్మెలో గానీ పాల్గొనబోవని తెలిపారు.

ఉద్యోగులు తమ కార్యాచరణను వాయిదా వేయాలని, ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఏ సమస్య ఉన్నా చర్చల ద్వారానే పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా.. సమ్మెకు ముందే సహాయ నిరాకరణ చేయడం సరికాదని తెలిపారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 5 డీఏలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వ ఇది అని.. కొత్త పే స్కేల్స్ ప్రకారం ఏ ఒక్కరికీ జీతం తగ్గలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల ప్రకారం చిన్న, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అధికారులతో చర్చించాలని, అలాకాకుండా ఏకపక్ష ధోరణితో వెళ్లడం ద్వారా ఉద్యోగస్తుల మీద ప్రజలు హేయ భావం పెంచుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో ప్రజా రవాణా శాఖ వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాచపల్లె దేవరాజులు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. బాలాజీ ప్రసాద్, ఎన్ఏసీ ఎంప్లాయర్స్ స్టేట్ ప్రెసిడెంట్ జి. శంకరయ్య, ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వరికల్లు రవి కుమార్, మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE