ఎన్నికలకు పెద్దగా సమయం లేదు… త్వరగా సన్నద్ధం కావాలి

-అభ్యర్థులను ఖరారు చేసి… కదన రంగంలోకి దూకాలి
-ఈ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కసి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది
-విద్యా వ్యవస్థ పై జగన్ చెదరని చేదు సంతకం
-యువ గళం ను ప్రజాగళంగా ముగించిన నారా లోకేష్
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఎన్నికలకు అట్టే పెద్దగా సమయం లేదని ఎటువంటి అరమరికలు లేకుండా, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నెలరోజుల్లోగా అభ్యర్థులను ఖరారు చేసి కదనరంగంలోకి దూకాలని ఆశిస్తున్నట్లుగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి, దాని మిత్రపక్షమైన జనసేనకు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు సూచించారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20 వ తేదీనే ఎన్నికలని ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే ఇంకా ఎన్నికల 50 నుంచి 55 రోజుల సమయం మాత్రమే ఉన్నది. తెదేపా, జనసేన కూటమి త్వరగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నం కావాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తల మునుకలయ్యారన్నారు.

రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆర్దిక బలం ఉండి జన బలం లేని వారికి రాజ్యసభ సభ్యత్వాన్ని, అలాగే మరికొందరికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెడతామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. రాజ్యసభ పదవులను ఓ 30 మందికి, ఎమ్మెల్సీ పదవులను ఓ 50 మందికి కట్టబెడతామని చెబుతున్నారు. ప్రభుత్వమే అధికారంలోకి రాకపోతే, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఎలా కట్టబెడతారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

మాట వినేవారిని బుజ్జగిస్తున్నట్లు, వినని వారిని బెదిరిస్తున్నట్లు తెలిసింది. బుజ్జగించే బాధ్యతలను మిథున్ రెడ్డికి, బెదిరించే బాధ్యతలను సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించి ఉంటారు. ప్రముఖ దినపత్రికలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో ప్రచురించిన కార్టూన్లు అక్షరాల కనిపించే నిజాలని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మా పార్టీలో ముసలం పుట్టడం ఖాయం. ఎమ్మెల్యే టికెట్లు దక్కని వారు జగన్మోహన్ రెడ్డి పై శత్రుత్వం పెంచుకోకుండా ఉండడానికి క్రిస్మస్ శాంతి సందేశాన్ని వినిపించి ఉంటారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు .

జగన్ పుట్టినరోజు జనాలకైతే పండుగ కాదు… సాక్షి దినపత్రికకు మాత్రం పండగే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం ప్రజలకేమి పండుగ రోజు కాకపోయినప్పటికీ, సాక్షి దినపత్రికకు మాత్రం పండగ రోజేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సాక్షి దినపత్రిక అదనపు పేజీలతో అడ్వర్టైజ్మెంట్లను ప్రచురించింది. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ సంస్థకు, జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవానికి సంబంధం ఏమిటి?.

ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సాక్షి దినపత్రికకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ప్రజాధనాన్ని వృధా చేయడం అవసరమా అంటూ నిలదీశారు. ప్రజాధనంతో పుట్టిన రోజు వేడుకలను చేసుకోవలసిన అవసరం ఉందా? అంటూ రఘురామకృష్ణం రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ లేకుండానే 2025 లో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారట!
ఇప్పటి వరకు ఒక్క కొత్త టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. అయినా, 2025 లో ఐ బీ సిలబస్ ప్రవేశపెడతారట. ప్రపంచవ్యాప్తంగా మూడు వేల ఐబి సిలబస్ స్కూళ్లు ఉంటే, రాష్ట్రంలోని 40000 వేల పై చిలుకు స్కూళ్లలలో… ఐ బి సిలబస్ ప్రవేశపెడతామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఐబీ సిలబస్ లో మన జాతీయ నాయకుల గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. రామాయణం, భారతం వంటి ఇతిహాసాల గురించి కూడా విద్యార్థులకు చదువుకునే వెసులుబాటు ఉండదు. ఐ బి సిలబస్ లో కేవలం ప్రపంచ దేశాధి నేతల గురించి మాత్రమే విద్యార్థులకు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

బహుశా జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడని ఆయన గురించి ఒక చాప్టర్ ఐబీ సిలబస్ లో ప్రవేశపెడతారేమోనని ఎద్దేవా చేశారు. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విద్యావిధానాన్ని రూపొందించింది. న్యాయస్థానాలలోనూ కూడా మాతృభాషలో వాదనలు జరగాలని, తీర్పులు కూడా మాతృభాషలోనే వెలువరించాలని పేర్కొనడం జరిగింది. దేశవ్యాప్తంగా మాతృభాషలో చదువుకునే వెసులుబాటు విద్యార్థులకు కల్పించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మాతృభాషతో పాటు ఇంగ్లీష్ మీడియం లోనూ చదువుకునే వెసులుబాటును కల్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని స్కూళ్లలో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడమేమో కానీ సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడానికి కూడా సరిపడా సౌకర్యాలు లేవని అధికారులు తేల్చి చెప్పారు. సీబీఎస్ఈ అధికారులు సౌకర్యాలు లేవని తిరస్కరించడమేమిటిని అహంకారానికి పోయిన జగన్మోహన్ రెడ్డి, ఐబీ సిలబస్ ప్రవేశపెడతానని ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డి జన్మదిన దినోత్సవం సందర్భంగా మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని విద్యార్థులు పెరేడ్ నిర్వహించాలని రాయలసీమ ప్రాంత విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ సూచించడం ఆశ్చర్యంగా ఉంది. ఐబీ సిలబస్ ప్రవేశపెడితే రాష్ట్రం నుంచి ఒక్క శాతం మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లవచ్చు కానీ మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి. స్వదేశంలోని సంస్కృతి, నాగరికత గురించి కనీస అవగాహన ఉండే విధంగా మన విద్యా విధానం ఉండాలి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేకుండా ఐబీ సిలబస్ ప్రవేశపెడితే… జగన్మోహన్ రెడ్డి తెలుగులో పాఠాలు చెబితే ఎలా ఉంటుందో… అలాగే ఉంటుంది.

విద్యారంగంపై చెదరని సంతకం అంటూ జగన్మోహన్ రెడ్డి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ను సాక్షి దినపత్రికలో ప్రచురించారు. విద్యారంగంపై చెదరని సంతకం కాదు… జగన్మోహన్ రెడ్డి ది చేదు సంతకమని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేదు సంతకం ఎంతమంది విద్యార్థుల జీవితాన్ని చెరిపేస్తుందో, చిదిమేస్తుందో అర్థం కావడం లేదన్నారు. అక్కరకు లేని విద్యా విధానం వక్రమైన ఆలోచనలతో, తెలిసి తెలియనితనముతో ప్రవేశపెట్టడం… విద్యావ్యవస్థను చిదిమి వేయడమే అవుతుందని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు .

సచివాలయం కంటే ఎక్కువ విస్తీర్ణంతో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసా?
అమరావతి లోని సచివాలయం కంటే ఎక్కువ విస్తీర్ణంతో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఫర్నిచర్ ఏర్పాటుకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అమరావతి పరిరక్షణ సమితి తరపున ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన వున్నం మురళీధర్ రావు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అమరావతి నుంచి పరిపాలన రాజధానిని మార్చేస్తామని గతంలో చాలామంది వైకాపా నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం వస్తున్నానని చెప్పి… ముఖ్యమంత్రి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఇంద్ర భవనం వంటి ఇల్లు కట్టుకుని, దుకాణం సర్దేసి విశాఖకు వెళ్లేందుకు రెడీ అయ్యారు.

జగన్మోహన్ రెడ్డి వస్తానని చెప్పడంతోనే, రాకుండా చూడండని యువ గళం సభ గ్రాండ్ సక్సెస్ చేసి ఉంటారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన న్యాయవాదులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మాత్రమే వాదనలను వినాలని పట్టుబట్టారు. దీనితో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చేవరకు, స్టేటస్కో విధిస్తానని న్యాయమూర్తి వెల్లడించారు. దానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని న్యాయవాదులు కోరగా, వున్నం మురళీధర్ రావు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయం పేరిట రాజధాని తరలింపు ప్రవాసం ఎంతవరకు వస్తుందో చూడాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.

ఎన్నో అడ్డంకులు… అయినా యువగళం సక్సెస్
యువగళం పాదయాత్ర నిర్వహణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో అవరోధాలు సృష్టించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. యువ గళం పాదయాత్ర ను ప్రారంభించి, దాన్ని ప్రజాగళంగా నారా లోకేష్ ముగించారు. యువ గళం ముగింపు సభ కు జనం ఉప్పెనలా హాజరయ్యారు. సభకు హాజరైన ప్రజానీకాన్ని చూస్తే అందరూ ఔరా… అన్నారు . యువ గళం ముగింపు సభకు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా, ప్రైవేటు బస్సులను రానివ్వకుండా ప్రభుత్వ పెద్దలు ఎన్నో అవరోధాలను సృష్టించారు. చివరకు రైలు కూడా సకాలంలో రానివ్వలేదు.

అయినా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, పొరుగు జిల్లాల నుంచి జనం తండోపతండాలుగా హాజరయ్యారు. యువ గళం ముగింపు సందర్భంగా తెదేపా, జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించిన బహిరంగ సభ కు ముఖ్య అతిథులుగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లు హాజరయ్యారు. తెదేపా, జనసేన శ్రేణులతో పాటు , సానుభూతిపరుల ఉత్సాహంతో పాటు, ఈ ప్రభుత్వంపై ప్రజాగ్రహం సరి సమానంగా తోడవడంతో సభ బీభత్సమైన సక్సెస్ అయింది. ఐదు నిమిషాలు ట్రాఫిక్ నిలిపివేస్తే 1000 మంది గుమి గూడే కూడళ్లలో మంత్రులు సామాజిక బస్సు యాత్ర సభ లు ఏర్పాటు చేసిన తుస్సుమన్నాయి.

యువగళం సభలో చివరి వక్త ప్రసంగం ముగిసే వరకు ఒక్కరు కూడా సీట్లలో నుంచి కదలలేదు. సభ ముగిసిన తర్వాత ఖాళీ సీట్లను ఫోటో తీసుకుని సాక్షి దినపత్రికలో ప్రచురించారు. లైవ్ లో ఎన్నో ఛానళ్లు యువ గళం సభను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. సభకు లక్షల మంది హాజరైన విషయాన్ని ప్రజలు తిలకించారు. ఊరు కానీ చోట సభను ఏర్పాటు చేసిన లక్షలాది మంది జనం సభ కు సొంత వాహనాలలో తరలివచ్చారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎంతో పరిమితి చెందిన నాయకుడిలా మాట్లాడారు. ఆయన మాటలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. అదే పెయిడ్ ఆర్టిస్టులయితే అంత స్పందన కనిపించదు. సభకు హాజరైన వారంతా ఈ ప్రభుత్వం కృంగిపోతుందని, కూల్చి వేయాలన్న కసి వారిలో కనిపించింది.

ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందా? అన్నప్రశ్న కు సర్వే నివేదికలతో ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాధానం లభిస్తూనే ఉంది.. సభా అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. నాలాంటి వెల్ విషర్స్ అంచనాలకు మించి సభికులు హాజరయ్యారు. తప్పు చేసిన వారి పేర్లను రెండు బుక్ లో రాసుకున్నామని వారిని శిక్షిస్తామని, కక్షపూరితంగా మాత్రం వ్యవహరించమని నారా లోకేష్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన క్రీస్తు తత్వం, నారా లోకేష్ తన మాటల్లో చెప్పినట్లుగా ఉంది. ఇదే తరహాలో మరో రెండు సభలను అమరావతి, తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రెండు సభలు కూడా విజయవంతం కావాలని రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు.

క్రీస్తు సందేశాన్ని చెప్పడం కాదు… పాటిస్తే బాగుంటుంది
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీస్తు సందేశాన్ని చెప్పడం కాదని ఈ మూడు నెలలైనా పాటిస్తే బాగుంటుందని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.. విజయవాడలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆకాశమంత, అవధులు లేని సహనం , శత్రువుల పట్ల క్షమాగుణం అలవర్చుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఎంతో చక్కగా చెప్పారని, ఆయన కూడా క్రీస్తు సందేశాన్ని పాటిస్తే బాగుంటుందన్నారు.

ముఖ్యమంత్రి అంత క్షమాగుణాన్ని కలవారైతే పోలీసుల చేత లాకప్ లో మిమ్మల్ని ఎందుకు చిత్రహింసలకు గురి చేసి ఆనందించోరనని, నాకు ఫోన్ చేసిన పలువురు ప్రశ్నించారన్నారు. రేపో మాపో తట్టా బుట్టా సర్దుకొని వెళ్లే అవకాశం ఉంది కాబట్టి, కరుణా, క్షమ గుణాన్ని గురించి ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు

Leave a Reply