– ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత వరదల విపత్తు పై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం: వరద విపత్తుల వల్ల నష్టపోయిన ప్రజలు ఆందోళన చెందవద్దు మనది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం మర్చిపోయినా గత పాలకులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసే విధంగా విమర్శించడం తగదు.
ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి మండలి సభ్యులందరూ రెండు రోజులుగా రోడ్లమీద ఉండి సహాయక చర్యలు చేపట్టడం వల్లే ఇంత పెద్ద విపత్తును అధిగమించాం.
భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్టుగా ఉండటం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ముందస్తు అప్రమత్తం చేయడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం.
రెండు రోజులుగా పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రులకు సూచనలు సలహాలు ఇస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ పర్యవేక్షణ చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది.
రాష్ట్రంలో సంభవించిన ఈ విపత్తు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి మోదీ దృష్టికి తీసుకువెళ్లారు.ప్రజల కోసం తపించే ప్రజా ప్రభుత్వం ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాం.
నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ, వరద నీటితో మునిగిన ఇండ్లకు 10 వేల నగదు ఇస్తాం. వరదలు తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాం అధికారుల నివేదిక రాగానే పరిహారం ఇచ్చి సంబంధిత బాధితులను ప్రభుత్వ ఆదుకుంటుంది.
చెట్లు కూలి విద్యుత్ వైర్లు తెగి, సబ్ స్టేషన్ లు నీటమునిగి,విద్యుత్ స్తంభాలు విరిగి ప్రజలు చీకట్లో ఉండకూడదని విద్యుత్ అంతరాయం లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి అర్ధరాత్రులు కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి వెలుగుల పంచిన సిబ్బందికి అభినందనలు. ఖమ్మంలో మున్నేరు ఇంత పెద్ద ఉప్పొంగడం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూడలేదు. వరదల వల్ల మధిర నియోజకవర్గంలో రాకపోకలు బంద్ అయిన దుష్టాంతం కొన్ని దశాబ్దాలుగా చూడలేదు.
ఊహించని విధంగా భారీగా వర్షాలు కురిసాయి. ఈ ఉపద్రవం వల్ల మున్నేరు ఉప్పొంగడం వల్ల నిన్న ఖమ్మంలో 9 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు విశాఖపట్నం నెవల్ బేస్ డిఫెన్స్ అధికారులతో మాట్లాడి హెలికాప్టర్ తెప్పించడానికి ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని రక్షించుకున్నాం.