Suryaa.co.in

Telangana

వరదల్లోనూ బురద రాజకీయాలేనా?

– జనం చస్తున్నా పాపం అనిపించడం లేదా?
– కేసీఆర్ ఫాం హౌజ్ లో, కేటీఆర్ అమెరికాలో జల్సాలు
– బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి సీతక్క సీరియస్

హైదరాబాద్: జనం చస్తున్నా పాపం అనిపించడం లేదా? వరదల్లోనూ బురద రాజకీయాలేనా? ప్రజలు కష్టాల్లో… కేసీఆర్ ఫాం హౌజ్ లో, కేటీఆర్ అమెరికాలో జల్సాలు. కష్టకాలంలో చేయూతనివ్వాల్సింది పోయి కేటీఆర్, హరీష్ రావులు రాజకీయాలు చేస్తున్నారు. క్షేత్రంలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకోలేని, సర్కారు సహాయ చర్యలను చూడలేని కబోదులు బీఆర్ఎస్ నేత‌లు.

గడిచిన 48 గంటల నుండి ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుండి అత్యవసర సమీక్షలు నిర్వహించారు. జిల్లాల్లో మంత్రులతో, కలెక్టర్లతో క్షేత్ర స్థాయిలో అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఓదార్చేందుకు 48 గంటలు క్షేత్రంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో మరణించిన కుటుంబాలకు ధైర్యం కల్పించారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన భరోసానిస్తోంది. రూ.5 లక్షల తక్షణ సహాయం ప్రకటిస్తే… బీఆర్ఎస్ నేతలు వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారు. ప్రజల కష్టాలు నష్టాలు వాటి విలువలు కేసీఆర్ కుటుంబానికి తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు వానలు, వరదలపై తక్షణ సమీక్షలు చేసారా? కనీసం బాదితులను ఓదార్చారా?

కొండగట్టులో 63 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే కనీసం సంతాపం లేదు. రైతులు చనిపోతే పైసా పరిహారం ఇవ్వలేదు. నిరుద్యోగ అభ్యర్థులు చనిపోతే కనీసం ఓదార్పు లేదు…ఇప్పుడెమో శవరాజకీయాలు.వరదల్లోనూ కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు.

కెటిఆర్ కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పబ్బం గడుపుతున్నారు. రోజూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టి బురద చల్లుతున్నారు. కోటలు దాటే మాటలు చేతగాని పనులలో కేసీఆర్, కేటీఆర్ సిద్దహస్తులు.

వరదల్లో మృతి చెందిన వారికి రూ.5లక్షలు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రూ.4 లక్షలకు అదనంగా మరో లక్ష కలిపి ఐదు లక్షలు ఇస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇదే వరద బాదితులకు రూ.25 లక్షలు ఎందుకివ్వలేదు? పదేండ్లు అధికారంలో ఉండి పైసా పరిహారం ఇవ్వని నేతలు, ఏ మొహం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు?

హైదరాబాద్ లో నీట మునిగిన కుటుంబాలకు పది వేలు ఇస్తానని బిఆర్ఎస్ లీడర్లే పంచుకుతినలేదా? తెలంగాణ సొమ్మును పొరుగు రాష్ట్రాలలో పప్పు బెల్లంల్లా పంచిన కేసీఆర్ సర్కారు తెలంగాణ రైతులకు, వరద బాధితులకు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో ఇంత విపత్తు సంభవిస్తే ఏ ఒక్క బిఆర్ఎస్ కీల‌క నేత క్షేత్రంలో లేరు. కానీ మానవీయ విలువలకు తిలోదకాలిచ్చి శవ రాజకీయాలు చేయడం వారే దిట్ట. సోషల్ మీడియా రాజకీయాల పైనే బతకడం మాని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తిరగండి. లేక పోతే తెలంగాణ స‌మాజం మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.

LEAVE A RESPONSE