Home » భక్తి…. బంగారం కోసం తాపత్రయమా?

భక్తి…. బంగారం కోసం తాపత్రయమా?

త్యాగరాజు వారు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు. ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాపలేదు. తెల్లవారి లేస్తే సంధ్యావందనం చేసుకోవడం, కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చి భాగవత, రామాయణాలు, భగవద్గీతలు చదువుకోవడం. మధ్యాహ్నమయిన తరువాత కీర్తనలు చేసుకుంటూ ఉంఛవృత్తి చేసుకోవడం.

అంటే.. తన వద్ద ఇంట్లో ఎంత మంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదర పోషణకు సరిపడా పదార్థాల్ని సేకరించడానికి ఎన్ని ఇళ్ళ ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ళ వద్దకు వెళ్ళి కీర్తనలు చేయడం. పెట్టిన వారూ ఒకటే, పెట్టని వారూ ఒకటే. పదార్థాలు సరిపడా సమకూరాయని అనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల (పెద్దభార్య పార్వతి శరీరం విడిచి పెట్టిన తరువాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలు కమలను చేసుకున్నారు. వారికి ఒకే సంతానం.. సీతామహాలక్ష్మి) వాటిని వండి సిద్ధం చేసేది. దానిని త్యాగరాజు గారు రామచంద్రమూర్తికి నివేదించి తాను, తన కుటుంబం, శిష్యులు స్వీకరించేవారు.

చెట్టును ఆశ్రయిస్తే గోత్ర నామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వారికీ సంగీత విద్యను నేర్పేవారు. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు.. ఎందరో మహా రాజులు ఎలాగయినా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. తంజావూరు మహారాజు అయితే మారు వేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూండేవారు. ఒక రోజు ఆయన జోలెపట్టి వెడుతుంటే దానిలో బంగారు కాసులు వేశారు,ఏం చేస్తారో చూద్దామని. బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమయిందని త్యాగరాజు దానిని మొత్తం తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేశారు. ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా…’’ అని కీర్తన చేశారు. ఈయన పక్కింట్లోనే అన్నగారు జపేశుడు ఉండేవారు. ఎంత సేపటికీ ఈ విగ్రహాలు పెట్టుకుని మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకోనంటున్నాడని కోపమొచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీ నదిలో పారేసాడు. వాటి కోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి ‘నిన్ను ఎందని వెదకను హరీ…’’ అని కీర్తన చేశారు.

తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నది దగ్గరకు రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయి విగ్రహాలు. వంద రెండొందల సంవత్సరాల క్రితం నాటివి ఈ జరిగిన సంఘటనలు. పరమేశ్వరుడు వున్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు. మనమయితే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజచేస్తే కేవలం విగ్రహం గానే చూస్తాం. దీపం వెలిగించేటప్పడు పొరబాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం.

త్యాగరాజు వారు అలా కాదు. ఆ విగ్రహాలు కావేరీ నది మీద తేలుతూ వస్తే ‘‘సుకుమార రఘువీర రారా మా ఇంటికి’’.. అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్ళారు. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమయిన త్యాగయ్య నాకోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామీ, నీ కాళ్ళెంత సొక్కిపోయాయో.. అంటూ ‘‘నను పాలింపగ నడచి వచ్చితివా…’’ అని కీర్తన చేశారు.
భక్తి అంటే అది.. త్యాగరాజు గారు వారి లాంటి మహానుభావులు మనకు తెలిసిన వారు, తెలియని వారు ఎంత మందో…

Leave a Reply