బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఉదయం స్వామివారికి సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రం మీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీనిని ‘గరుడధ్వజ పటం’ అంటారు.
దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో -చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు వారివారి -నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టే.