Suryaa.co.in

Sports

హాకీ మాంత్రికుడు!

అది హాకీ స్టిక్కా.
మంత్రదండమా..
దానికి అయస్కాంతముందా!

ఆ మనిషి మాంత్రికుడా..
భూం భూమ్ బుషక్
అనగానే గోల్ పడిపోద్దా!

భారత జట్టుకు మూడు హాకీ
బంగారు పతకాలు..
మొత్తం గోల్స్ పది శతకాలు..
ధ్యాన్ చంద్..
హాకీ ఆయన చలాకీ…
ఎన్నో ఏళ్ల పాటు
ఆయనదే గిరాకీ..!

చిన్నప్పుడు హాకీ ఊసే
తెలియని కుర్రాడు..
ఆర్మీలో చేరి
స్టిక్కు పట్టి..
ఆట నేర్చి..
గెలిపించాడు ఒలింపిక్స్..
ఆ మూడు పతకాలు
ధ్యాన్ చంద్ ట్రిక్స్..!

1928..అమెస్టర్ డామ్..
మన హాకీ టీమును
పట్టించుకోని ప్రపంచం..
వరస విజయాలతో
కొట్టేసింది మెడల్..
పెద్ద పెద్ద జట్ల
మెడలు వంచేస్తూ..
గోల్ మీద గోలు కొట్టేస్తూ..
ముసలమ్మ నా ఊతకర్రతో
ఆడు చూస్తానంటే..
దాంతోనే గోల్స్ కొట్టేశాడు..
ప్రపంచాన్ని చుట్టేసాడు..!

1932..లాస్ ఏంజిల్స్…
1936..బెర్లిన్..
ఎక్కడికి వెళ్తే అక్కడ..
దంచి కొట్టడమే..
లాస్ ఏంజిల్స్ ఫైనల్లో
24..1 తో
అమెరికాపై విజయం..
2003 వరకు
అదే ప్రపంచ రికార్డు…
ధ్యాన్ చందే ట్రంప్ కార్డు!

ఆట..పతకాల వేట..
గోల్స్ పంట..
అదే ధ్యాన్ చంద్
గుండె ఘోష..
హాకీ..ఆయనెరిగిన భాష..!
అందుకే..అందుకే..
ఆయనయ్యాడు
పద్మభూషణ్..
ఆయన పేరిట ఖేల్ రత్న..
పుట్టినరోజు క్రీడాదినోత్సవం..
ధ్యాన్ చంద్ జీవితమే
హాకీ బ్రహ్మోత్సవం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE