Suryaa.co.in

Andhra Pradesh

రంగు మారిన ధాన్యాన్ని టీడీపీ ఏనాడైనా కొనుగోలు చేసిందా..?

– మంచి ధాన్యానికి, రంగు మారిన ధాన్యానికి ఒకే ధర ఇస్తారా..?
– ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీలు చాలని స్వీట్లు పంచుకుని, పండగ చేసుకుంది మీరు కాదా..?
– అమరావతికి మట్టి, నీళ్ళు, మీకు ప్యాకేజీ కావాలని అడిగింది మీరు కాదా బాబూ.. ?
– వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ఏ విధంగా అతలాకుతలం చేశాయో… పంట చేతికొచ్చే దశలో రైతాంగం నష్టపోయే పరిస్థితులు ఏ విధంగా ఏర్పడ్డాయో చూశాం. ఈరోజు వరికి కన్నీటి తడి అంటూ రాసిన “ఈనాడు కంట తడి” చూశాం. రాష్ట్రంలో గతం కంటే ఉత్తమమైన ప్రొక్యూర్ మెంటు విధానం ఉండేలా, మిల్లర్లు, దళారుల జోక్యం తగ్గించి, వారి చేతిలో రైతాంగం విలవిల్లాడకూడదన్న గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ గారు గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటినే ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించాం. రైతు పండించిన పంట అమ్ముకోవాలంటే.. నేరుగా ఆర్బీకే కేంద్రానికి వెళ్ళి అక్కడ పేరు రిజిస్టర్ చేసుకుంటే.. వారి ద్వారానే కొనుగోలు చేసి, 21 రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. ఆ పంటలకు ఎంఎస్పీ కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నాం. అధిక వర్షాల వల్ల ఉభయ గోదావరి, వైయస్ఆర్ కడప, గుంటూరు జిల్లాల్లో ధాన్యం పంటకు ఎక్కువగా నష్టం జరిగింది. అధిక వర్షాల కారణంగా ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఎంఎస్పీ ఇవ్వటానికి మిల్లర్లు ముందుకు రాకపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితి నుంచి రైతును కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది.
– 7681 ఆర్బీకే సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని మ్యాపింగ్ చేశాం. వచ్చింది వచ్చినట్లుగా కొనుగోలు చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేకి మిల్లులను అనుసంధానం చేశాం. వర్షాల వల్ల తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యాన్ని, ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టి, కొనుగోలు చేస్తున్నాం.
– రంగు మారిన ధాన్యాన్ని టీడీపీ హయాంలో ఏనాడైనా కొనుగోలు చేసిందా..?. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొంటున్నది మేమే.
– మంచి ధాన్యానికి, రంగు మారిన ధాన్యానికి ఒకే ధర ఇస్తారా..?
– ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఆలోచనే టీడీపీకి ఎప్పుడూ లేదు కదా..? అటువంటిది ఈరోజు రైతుల గురించి లేని ప్రేమను ఒకలబోస్తుంటే, దానికి వత్తాసు పలుకుతూ ఈనాడు రాతలు రాస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బాబుకు అధికారం పోయిందని అడ్డమైన రాతలు రాస్తారా.. ?. అదే మీ సిద్ధాంతమైతే, దానిని బహిరంగంగా ప్రకటించి, మీకు కావాల్సినట్టు రాతలు రాసుకోండి.
ధాన్యం కొనుగోలుకి, ఎఫ్ సీఐకి లింకు ఉంటుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం పెట్టే నిబంధనలకు కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం. నూకల శాతాన్ని ఎక్కువగా అనుమతించమని కేంద్రాన్ని కోరాం. 25 శాతంగా ఉండే నూకల శాతాన్ని 28 నుంచి 35 శాతంకు పెంచి, ఆ జిల్లాల వారీగా అనుమతించమని కోరాం. అలానే, పాడైపోయిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి 3 శాతం ఉన్నదాన్ని 7 శాతం వరకు పెంచాలని కోరాం. సహజంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నిబంధనలు సడలించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి సీఎంగారు ఇప్పటికే అధికారులకు, మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చారు.
వాస్తవాలను వాస్తవాలుగా చూడకుండా, ఏదైనా అంశం వస్తే.. ఆ బురదను పనిగట్టుకుని ముఖ్యమంత్రిగారి మీద, ప్రభుత్వం మీద చల్లటాన్ని చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియా ఒక పెద్ద ఉద్యమంగా పెట్టుకుంది. ప్రతిదానినీ ప్రభుత్వ వైఫల్యం అని నిరూపించాలన్నదే ఆ వర్గం మీడియా అత్యుత్సాహంలా కనిపిస్తుంది.

ప్రతిపక్ష పార్టీల కంటే ఘోరాతి ఘోరంగా ఆ వర్గం మీడియా వ్యవహరిస్తుంది. వర్షాలకు పంటలు పోయి, రైతాంగం నష్టపోయి ఉంటే, ఇంకోవైపు దళారులు, మిల్లర్ల దోపిడీ వ్యవస్థలు కాచుకు కూర్చుంటే… ఈ పరిస్థితుల్లో రైతును ఆదుకోవాలని, ప్రతి గింజా ఆర్బీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఈ ప్రభుత్వం నూతన వ్యవస్థను తెచ్చింది. టీడీపీ హయాంలో ఏనాడైనా మిల్లర్ల జోక్యం తగ్గించాలని చంద్రబాబు ఆలోచించాడా, లేదు. ఆరోజున చంద్రబాబును అడగటానికి ఈ మీడియాకు నోరు లేక కాదు, నోరు రాదు, ప్రశ్నించదు.
ఎంతసేపటికీ వీళ్ళు డబ్బున్న వాళ్ళకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడం తప్ప పేదల గురించి, రైతుల గురించి ఏనాడూ ఆలోచించింది లేదు. చంద్రబాబు నాయుడుని వీళ్ళు ప్రేమించినట్టుగా, బహుశా ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రేమించరేమో.. !
– ఎల్లో మీడియా రాతలకు, టీడీపీ చేష్టలకు రైతులు బెంబేలెత్తిపోయి, వారు ఎంతోకొంతకు అమ్మేసుకుంటే.. రైతులు నష్టపోతే దాన్ని ప్రభుత్వం మీద నెట్టాలన్న తాపత్రయమే తప్ప, రైతుకు మేలు చేయాలని ఈ పచ్చ మీడియాకు ఏమాత్రం ఆలోచన ఉండదు.
– బయట నుంచి ధాన్యాన్ని తీసుకురాకూడదు, రీ సైక్లింగ్ చేయకూడదు, ఈ కేవైసీ తీసుకొచ్చి, ఏ రైతు ధాన్యం అమ్మితే.. ఆ రైతు బ్యాంకు ఖాతాలోనే డబ్బు వేసేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు చర్యలు తీసుకున్నారు.
– ఇంత పారదర్శకంగా చేస్తుంటే.. తెల్లారి లేచిన దగ్గర నుంచీ ఈనాడు, టీడీపీకి వత్తాసు పలికే ఆ వర్గం మీడియాకు చంద్రబాబును కాపాడుకోవటానికి, జగన్ మోహన్ రెడ్డిగారిని తక్కువగా చూపించాలని, కించపరచాలన్నదే వీరి ధ్యాసంతా, ఒక శత్రువుతో ప్రవర్తిస్తున్నట్టు ఈ మీడియా వ్యవహరిస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ పచ్చ మీడియాకు ఇష్టం ఉండదు. కానీ, కోట్ల మంది ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని 2019 నుంచి నేటి వరకు, ఏ ఎన్నిక జరిగినా, తిరుగు లేని మెజార్టీ ఇస్తుంటే.. ప్రజల్లో ఉన్న నాయకుడికి అడుగడుగునా అడ్డు తగలడానికి మీకు సిగ్గు లేదా..?
– అఖండ గురించి కూడా బాబు మాట్లాడాడు. బహుశా అఖండ చూసిన ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు మాట్లాడినట్టు కనిపించింది.
– ఈమధ్య కాలంలో కరోనా దెబ్బకు హైదరాబాద్ లో దాక్కుని, కొడుకుని రాష్ట్రంలో తిప్పితే ఉన్నది కూడా పోయింది.
– ఇంకా, లేస్తే మనిషిని కాదు అంటూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 40 ఏళ్ళ నుంచి చూపిస్తున్న చంద్ర వీడియోలు చూపిస్తున్నాడు. ప్రజలకు చూపించాల్సింది చంద్ర వీడియోలు కాదు. నిన్న రాష్ట్రానికి వచ్చి మాట్లాడిన మాజీ న్యాయమూర్తి చంద్రు వీడియోలు చూపించండి.
నిజమే, జగన్ మోహన్ రెడ్డి మాట తప్పడు.. మడమ తిప్పడు అని ఈరోజు కూడా గట్టిగా చెబుతున్నాం. మీ మాదిరిగా చెప్పే దొకటి, చేసేదొకటి మా నాయకుడు జగన్ గారికి చేతకాదు. మాట ఇస్తే, చెబితే ఎంత కష్టమైనా చేస్తారు. న్యాయ నిపుణుడు చంద్రు గారు… ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. ప్రభుత్వం ఎవరితో పోరాటం చేయాల్సి వస్తుందో చాలా స్పష్టంగా చెప్పారు. కనీసం చంద్రు గారు మాట్లాడిన ఆ వీడియో చూసే ధైర్యం అన్నా బాబుకు ఉందా..?
నిన్ననే స్కిల్ డెవలప్ మెంటు స్కాంకు సంబంధించి సీఐడీ పోలీసుల పరిశోధనలో భాగంగా హైదరాబాద్ వెళితే.. “స్కిల్ డెవలప్ మెంటులో వీళ్ళ స్కిల్” ఎక్కడ బయటపడుతుందన్న భయంతో ఏం డ్రామాలు చేశారో చూశాం. మాజీ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించడానికి సీఐడీ పోలీసులు వెళితే.. అక్కడ టీడీపీ నేతలతో సహా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు. టీడీపీకి అనుకూలంగా ఉంటాడని కనీసం దాచుకునే ప్రయత్నం కూడా రాధాకృష్ణ చేయలేదు పాపం. స్కిల్ డెవలప్ మెంటు పేరుతో షెల్ కంపెనీలు సృష్టించి వందల కోట్లు స్కాం జరిగిందని ప్రభుత్వం భావిస్తుంటే.. దానిలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా..?, దాన్ని అడ్డుకుంటారా..?
-2014-19 వరకు మీరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు తవ్వి తీస్తుంటే, వందల కోట్లు అనుమతి లేకుండా, షెల్ కంపెనీలు సృష్టించి, సొంత ఆస్తిని అనుభవించినట్టుగా ప్రజా ధనాన్ని అనుభవిస్తే.. వాటిని ప్రశ్నిస్తే రాజకీయ కక్ష అని ముసుగు వేస్తారా..? 5 ఏళ్ళు అధికారంలో ఉండి, అడ్డంగా మేసేసి.. ఒక్కొక్కటిగా ఆ స్కాములన్నీ బయట పడుతుంటే, ఆ బాధతో రాజకీయ రంగు పులముతారా..? మీ అనుకూల మీడియాలో జగన్ గారి కక్ష సాధింపు చర్యగా చూపిస్తారా..?
– స్కిల్ డెవలప్ మెంటు పేరుతో వందల కోట్లు మింగేస్తే.. ఈ పచ్చ మీడియా ఏం ప్రచారం చేస్తుంది.? అంటే, వీళ్ళు సెయింట్ అంటే సెయింట్.. సైంటిస్ట్ అంటే సైంటిస్ట్ అని ప్రజలు నమ్మాలన్నదే వీళ్ళ భావన.
విభజన హామీలు ఏమయ్యాయని అడగటానికి మీకు అసలు సిగ్గుందా..? రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది మీరు కాదా.. సీనియార్టీ ఉంది కదా.. అని 7 బండ్ల మీద వంట వాడిని తీసుకొస్తే, రసానికి నీళ్ళు ఎన్ని పెట్టాలని అడిగినట్టు.. మీరే కదా విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పని చేసింది. పైగా ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీలు చాలు అని పండగ చేసుకుంది మీరు కాదా..? పోలవరం కాంట్రాక్టు ఇస్తే చాలు.. ఇంకేమీ అడగం.. ఇంకేమీ వద్దు అని ఢిల్లీ వెళ్ళి కాళ్ళు మొక్కింది మీరు కాదా.. ? మీరు చేసిన ఈ దుర్మార్గాలకే కదా 2019 ఎన్నికల్లో మిమ్మల్ని మళ్ళీ లేవకుండా ప్రజలు గుణపాఠం చెప్పింది గుర్తు లేదా.. ?
– ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ ఎంపీలను రాజీనామాలు చేయించి, ఢిల్లీలో దీక్ష చేయించింది ఆరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ గారు కాదా..? ఆ విషయం మీకు గుర్తుకు రాలేదా.. ప్రత్యేక హోదా మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటే.. ఆరోజు మీరు ఎందుకు రాజీనామాలు చేయించలేదు…? హోదా వద్దు- ప్యాకేజీ చాలు అని స్వీట్లు పంచుకున్నది మీరు కాదా..?
– అమరావతికి మట్టి, నీళ్ళు, మీకు ప్యాకేజీ కావాలని అడిగింది మీరు కాదా చంద్రబాబూ.. ?
అధికారంలో ఉంటే బీజేపీకి భజన.. అధికారం లేకపోతే రాష్ట్ర విభజన మీకు గుర్తుకొస్తాయా…?. బీజేపీ-టీడీపీ భాగస్వామ్య పాలనలో.. ఢిల్లీలో మీరు భాగస్వామ్యం.. మీ దగ్గర బీజేపీ భాగస్వామ్యంతో ఇద్దరూ అంటకాగారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు బయటకు వచ్చి మోడీ, అమిత్ షాను బూతులు తిట్టారు, రాహుల్ గాంధీ మీద చెయ్యేసి ఊరేగింపులు చేశారు. మీ స్వార్థరాజకీయాలకు.. మీరంతా 2019 ఎన్నికల్లో కట్టగట్టుకుని కొట్టుకుపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మోడీతో జత కట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూ.. అది రాజకీయ చతురత అని మీ సొంత పత్రికల్లోనే రాయిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అయిన రోజునే మీరు విభజన హామీలు అడిగి ఉంటే.. ఈరోజు మేము మాట్లాడే పరిస్థితే ఉండదు. మమ్మల్ని మీరు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు కదా…?
నిజమే, అమరావతి రాజధాని పేరుతో రూ. 2 లక్షల కోట్ల ఆస్తి మీది, మీ బంధువులది, మీ బినామీలది. ఈ ఊరేగింపులు, యాత్రలు, అమెరికాలో ఉన్నవారి దగ్గర కూడా అమరావతిని కాపాడుకోవడానికి విరాళాలు పోగేసి పంపిస్తున్నారంటే.. ఏంటి ఇంట్రస్ట్.. ? అమరావతి కాకుండా విశాఖనో, కర్నూలునో రాజధాని అంటే మీరు ఒప్పుకుంటారా.. ? ససేమిరా ఒప్పుకోరు. మీవాళ్ళ భూములకు రేట్లు పెరగడమే మీకు కావాలి. 30 వేల ఎకరాల ఆస్తుల కోసం, దాని విలువ పెంపు కోసం, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే.. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియవని అనుకుంటున్నారా..? అమరావతి వెనక, ఈ ఉద్యమం వెనక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసు.
మీ హయాంలో మీరే స్వయంగా ప్రవేశపెట్టి, ప్రధాని మోడీగారికి అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం చేసింది నిజం కాదా.. ? ఏ ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీ గారికి మీరు ధన్యవాదాల తీర్మానం చేశారు. ఇకనైనా, సిగ్గు, శరం లేని మాటలు మాట్లడకపోతే మంచిది బాబూ.. ఆరోజు ధన్యవాద తీర్మానాలు చేసి, ఈరోజు విభజన హామీలు జగన్ గారు పట్టించుకోవడం లేదని మాట్లాడే హక్కు అసలు మీకు ఉందా.. ? ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్వయంగా ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానాన్ని ఆరోజు సభ ఆమోదించిందని ఇదే ఈనాడు పత్రిక ఆనాడు రాసింది. మీ సుభాషితాలు- ప్రవచనాలు ఇంకెవరికైనా చెప్పండి చంద్రబాబూ..
ఓటీఎస్ అవసరం ప్రజలకు ఎంత ఉందో గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఉన్న ఆస్తిని అమ్ముకోలేక, వారసత్వంగా ఇచ్చుకోలేక, ఆపదలో అక్కరకు రాక ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డిగారు ఒక గొప్ప ఆలోచనతో, పేదల అవసరాలకు అప్పు పుట్టేలా, ఒక ఆస్తిలా మార్చి, రూ. 10 వేల కోట్ల రుణాలను సైతం మాఫీ చేసి, ఉచితంగా పేదలకు హక్కు పత్రం ఇస్తుంటే.. మీ గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడిందా.. ? ఇన్ని లక్షల మంది మెచ్చుకుంటుంటే.. మీకు మింగుడు పడటం లేదా.. ?
గోదావరి ఎరువుల కర్మాగారాన్ని, సహకార మిల్లుల్న్నీ ప్రైవేటు వ్యక్తులకు పప్పు బెల్లాల్లా అమ్మేసింది బాబు కాదా.. ? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన మీ హయాంలో కాదా కేంద్రం మొదలు పెట్టింది..? ఆరోజు మోడీ గారిని ఎందుకు అడగలేకపోయావు బాబూ..? దాని వెనకాల ఏదో అర్థం ఉందని ఈరోజు బాబు పచ్చి అబద్ధాలను వండి వారుస్తున్నారు. దేశంలో డిజ్ ఇన్వెస్ట్ మెంటు పాలసీని తీసుకుని.. కేంద్రం ఈ ప్రక్రియ కొనసాగిస్తుంటే… విశాఖ ఉక్కును ప్రైవేటు వాళ్ళకు ఇచ్చేందుకు, జగన్ గారు మాట్లాడినట్టు ఇంత అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటు.
– విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జగన్ గారు అన్ని కార్మిక సంఘాలతో రెండు గంటల పాటు మాట్లాడి, వారు ఏం చెబితే.. అదే అసెంబ్లీలో తీర్మానం చేసి, ప్రైవేటీకరణ కాకుండా కేంద్రానికి ప్రత్యామ్యాయాలు సూచిస్తే లేఖ రాసింది గుర్తు లేదా.. ? విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తుంటే.. చంద్రబాబు బీజేపీతో ఉద్యమం చేయాలి. మా హయాంలో మేము ఏ ఒక్క పరిశ్రమను అయినా ప్రైవేటీకరణగానీ, అమ్మేయడం గానీ చేశామా..? లేదు.
పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఎప్పుడు కలలుగన్నారు. ప్రాజెక్టు ఎవరి కల…? ఆ ప్రాజెక్టు ప్రారంభించింది, దానికి ఒక రూపం తెచ్చింది వైయస్ఆర్ గారు కాదా.. ? అప్పుడే కాలువలు, ల్యాండ్ యాక్విజేషన్ జరిగి, కేంద్రం నుంచి అనుమతులు తీసుకువస్తే.. విభజన హామీగా కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును, కాంట్రాక్టుల కోసం మీరు తీసుకోవడమే మీ ఘనతా..? తండ్రి వైయస్ఆర్ గారు ప్రారంభించారు.. కుమారుడు జగన్ గారు పూర్తి చేస్తారు. చంద్రబాబు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తారు అని ఘంటాపథంగా చెబుతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు కనీసం అపాయింట్ మెంటు కూడా ఇవ్వని చంద్రబాబు.. ఈరోజు పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారు అని మాట్లాడుతుండటం సిగ్గుచేటు.
బాబు ఫ్రస్ట్రేషన్ కు చాలా కారణాలు ఉన్నాయి. ఆయన “వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ..” అందుకే ఎలాగైనా పార్టీని బతికించుకోవాలని, భారం అంతా తాను మోయ్యాల్సి వస్తుందని బాబు తపన పడుతున్నాడు. మొన్న బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు పసుపు జెండా కప్పుకుని బీజేపీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నారు. రెండు నెలల క్రితమే బీజేపీకి ఏజెంట్లుగా పనిచేసిన పార్టీగా.. విభజన హామీల గురించి మీరు కేంద్రాన్ని ఎందుకు అడగరు..?
– ప్రత్యేక హోదా నినాదాన్ని నీరుగార్చిన చరిత్ర చంద్రబాబుదే. చరిత్ర ఉన్నంతకాలం ఆ హీన చరిత్ర బాబుదే. దాన్ని ఎవరూ తుడిచి వేయలేరు. ప్యాకేజీకి ఎప్పుడైతే బాబు ఒప్పుకున్నాడో హోదాను నీరుగార్చాడు. ప్యాకేజీ అంటే నాలుగు రోడ్లు, ఆరు కాంట్రాక్టులే కదా..
– విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అధికారం ప్రజలు ఆరోజు చంద్రబాబుకే ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, చేయాల్సినప్పుడు చేయకుండా, ఇప్పుడు పిల్లి శాపాలకు ఉట్టి విరిగిపడుతుందా.. మీ శాపాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంగారు పడిపోదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి బలంగా ఉంది.
రాష్ట్రంలో టీడీపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించే పరిస్థితి లేదు. చిన్న చిన్న ఎన్నికల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్ గారి పాలన మెచ్చి ప్రజలు 85-90 శాతం సీట్లు ఇస్తే.. అది ప్రజల్లో వ్యతిరేకతా..? వ్యతిరేకత ప్రజల్లో కాదు, మీదే వ్యతిరేకత. దీటైన నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డిగారు మీకు ఎదురుగా నిలబడి, ఢీ కొడుతున్నాడన్నదే మీ వ్యతిరేకత..
– మేనిఫెస్టో అమలును అధికారంలోకి వచ్చిన మొదటి గంటలోనే జగన్ గారు ప్రారంభించారంటే.. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడిగా, మాట ఇస్తే నిలబెట్టుకోవడం, దానికోసం ఎంతవరకైనా పోరాటం చేసే నాయకుడుగా ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఆయనకు స్థానం ఉంటుంది.
చంద్రబాబు అధికారంలో ఉండగా, ఉద్యోగుల్లో కూడా చీలికలు పెట్టి, ఒకాయనకు ఎమ్మెల్సీ ఇచ్చి.. మరొకటి ఇచ్చి ఉద్యోగ సంఘాల్లో గందరగోళం సృష్టించారు. అటువంటి మీరు ఉద్యోగుల ఫ్రెండ్లీనా..? ఉద్యోగులకు న్యాయం చేయటానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొవిడ్ మహమ్మారి వచ్చినా.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని ముందుకు వెళుతున్నాం. ఉద్యోగుల పట్ల పూర్తి సానుకూలతతో జగన్ గారు వ్యవహరిస్తుంటే.. వారిని రెచ్చగొట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు జీవిత కాలంలో ఆయన్ను నమ్మని వర్గాల్లో నెంబర్ వన్, నెంబరు 2 స్థానంలో ఉద్యోగులు ఉంటారు. చంద్రబాబు మైండ్ సెట్టే వరల్డ్ బ్యాంకు, కార్పొరేట్ మైండ్ సెట్.
– గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సింగిల్ స్టోక్ లో ఏర్పాటు చేసిన ఘనత జగన్ గారిదే. ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని బాబుకు తెలియదా..?
– మీ 5 ఏళ్ళ కాలంలో మేం ఇచ్చిన 1.30 లక్షల ఉద్యోగాల్లో కనీసం 5వ వంతు అయినా మీరు ఇచ్చారా చంద్రబాబూ..?
– పేదలకు మంచి చేస్తుంటే,మీ మనుషుల్ని కోర్టులకు పంపి, మంచి పథకాలను అడ్డుకోవడం మాత్రమే చంద్రబాబు పాలసీగా తీసుకున్నారు.
– చివరికి కుప్పంలోనూ టీడీపీ పతనావస్థకు చేరి, భయంకర పరిస్థితుల్లోకి దిగజారిపోతే.. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం, పార్టీని నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గారిని శత్రువుగా తీసుకుని మాట్లాడటంగా కనిపిస్తుంది. మీ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జగన్ గారు బలమైన నాయకుడిగా ఉన్నారు. మీ మీడియాతో జనాన్ని ప్రభావితం చేయొచ్చు అనే రోజులు పోయాయి.
కళ్ళ ముందు ఉన్న ఆస్తి.. ఏం చేయలేకపోతున్నాం అనే బాధే ఎక్కువ మంది పేద వర్గాల ప్రజల్లో ఉంది. 40 ఏళ్ళ నుంచి, ఇందిరా గాంధీ హయాంలో ఇళ్ళు ఇచ్చిన పరిస్థితుల నుంచి జరగని మంచిని, 40 లక్షల కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాన్ని జగన్ గారు చేస్తున్నారన్న విషయాన్ని మరుగున పరచడానికే చంద్రబాబు ఓటీఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కేవలం బీ ఫారం పట్టాలతో ఉన్న ఇళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చాలాకాలం నుంచి ప్రజల్లో డిమాండ్ ఉంది. టీడీపీ హయాంలో అధికార యంత్రాగం ఆ ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పుడే రూపాయి తీసుకోకుండా చంద్రబాబు చేసి ఉండవచ్చుగా..? మళ్ళీ వస్తే చేస్తానంటున్నాడు. మరి అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. ఓటీఎస్ అన్నది బలవంతం కానేకాదు.. పూర్తిగా స్వచ్ఛందమే.
– రంగుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. రైతు రుణ మాఫీ చేయలేకపోయి, అధికార అంతానికి వచ్చినప్పుడు రైతు రుణ మాఫీకి సంబంధించి పచ్చటి పసుపు రంగులో కాగితాలు ఇచ్చాడు. ఆయన చేస్తేనేమో ఆ వర్గం పత్రికలకు, టీవీ ఛానల్స్ కు రాజనీతి.. అదే జగన్ గారు చేస్తేనేమో అపచారమా.. ? స్కీములకు పేర్లు పెట్టుకోవడం ఒక్క ఈ రాష్ట్రంలోనే జరగటం లేదు. హక్కును చూడండి.. కాగితం రంగును కాదని చెబుతున్నాం.
– బీజేపీతో స్నేహం ఉందని ప్రకటించి, రాజకీయంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇక్కడ దీక్షలు చేయడం ఎందుకు, మోడీగారి మీద ఒత్తిడి తీసుకొస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది కదా. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు, దానిని ప్రైవేటీకరణ చేయెద్దు అని చంద్రబాబు, పవన్ ల కంటే ముందే ప్రకటించి పోరాటం చేస్తున్నది మేమే.

LEAVE A RESPONSE